పారిశ్రామిక నగరంగా ఓర్వకల్లు
ఓర్వకల్లు:
కర్నూలు నగరానికి అతి సమీపంలోని ఓర్వకల్లు మండలాన్ని పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రితో పాటు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా కలెక్టర్ విజయమోహన్, మాజీ మంత్రులు కేఈ ప్రభాకర్, ఎన్‌ఎండీ ఫరూక్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా స్థానిక అల్లాబకాష్ దర్గా వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి దర్గా పక్కనే గల ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సేకరించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మండల సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విజయభారతి అధ్యక్షతన నిర్వహించిన మహిళా బ్యాంకు విజయోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. సభను ప్రారంభించిన కొద్దిసేపటికే వర్షం కురవడంతో ఉపముఖ్యమంత్రి ప్రసంగానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఎంఎంఎస్ కార్యాలయ భవనంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకున్న ఓర్వకల్లు పొదుపు మహిళల పురోగతి ప్రశంసనీయమన్నారు. పొదుపు సంఘాల నిర్వహణ, పాలన సౌలభ్యం కోసం అన్ని గ్రామాల్లో సొంత భవనాలు నిర్మాణానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం మండలంలోని ఓర్వకల్లు, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ, లొద్దిపల్లె గ్రామాల్లో ఐక్య సంఘం భవన నిర్మాణాలకు ఎంపీ ల్యాడ్స్ నుంచి మంజూరైన రూ.కోటి చెక్కును ఉపముఖ్యమంత్రి వారికి అందజేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పొదుపు మహిళలు రూ.10 లక్షలు ఈ సందర్భంగా విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ పుష్పావతి, ఎంఎంఎస్ గౌరవ సలహాదారురాలు విజయభారతి, పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.