industrial district
-
పారిశ్రామిక జిల్లాగా అనకాపల్లి
సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక జిల్లాగా అనకాపల్లి అభివృద్ధి చెందుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అచ్యుతాపురం, అనకాపల్లి రాష్ట్ర ముఖచిత్రంలో పారిశ్రామిక ప్రాంతాలుగా నిలవనున్నాయన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పూడిలో ‘యమ రిబ్బన్ కంపెనీ’ నిర్మాణానికి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే రమణమూర్తిరాజులతో కలిసి అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చైనాకు చెందిన యమ రిబ్బన్ కంపెనీ సుమారు రూ.300 కోట్ల వ్యయంతో 15.76 ఎకరాల్లో తమ శాఖను ఏర్పాటు చేస్తోందన్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్, హెచ్‌పీసీఎల్, షిప్‌యార్డ్, బీహెచ్ఈఎల్ వంటి పరిశ్రమలతో విశాఖ పెద్ద పారిశ్రామిక నగరంగా వెలుగొందుతోందని గుర్తు చేశారు. ఇదే సమయంలో అచ్యుతాపురం సెజ్‌లో మరిన్ని పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయంటే.. పారిశ్రామిక ప్రగతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్నారు. యమ రిబ్బన్ కంపెనీ ద్వారా సుమారు రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. అందుబాటులో 25 వేల ఎకరాల భూమి.. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్ర తీరప్రాంతంలో అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, తుని, కాకినాడ వరకు పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇప్పటికే 25 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా వాటికి భూమి కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. యలమంచిలి నియోజకవర్గం పూడిమడకలో త్వరలోనే ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారన్నారు. అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీని నంబర్‌వన్ స్థానంలో నిలిపిందని తెలిపారు. టెక్స్టైల్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ యమ రిబ్బన్ కంపెనీ ద్వారా 2వేల మందికి ప్రత్యక్షంగా, మరో 2వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. చైనా జనరల్ కాన్సులేట్ జాలియో మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు, న్యూఢిల్లీలో చైనా ఎంబసీ కార్యదర్శులు యు యాంగ్ డబ్లు్య జూన్ నిమి, ఏపీఐఐసీ జెడ్ఎం త్రినాథ్‌రావు, చైనా జనరల్ కాన్సులేట్ (కోల్‌కతా) జాలియు, యమ రిబ్బన్ కంపెనీ ఇండియన్ డైరెక్టర్ శివప్రసాద్, మేనేజర్లు పాల్గొన్నారు. -
పారిశ్రమిక గుమ్మంగా పాలమూరు
మహబూబ్‌నగర్: వలసల జిల్లా పాలమూరు ఇక.. పారిశ్రామిక గుమ్మంగా మారనుంది. జిల్లాలో నిక్షిప్తమై ఉన్న అపార సహజవనరులను వినియోగించుకోవడం ద్వారా పాలమూరును పారిశ్రామిక కేంద్రంగా తీర్చదిద్దాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి జిల్లా అధికారుల సంకల్పం తోడు కావడంతో జిల్లా ఇక పారిశ్రమిక ఖిల్లాగా వెలుగొందే అవకాశాలు ప్రస్పుటమవుతున్నాయి. ఇందుకు పారిశ్రామికవేత్తలనుండి సైతం అనూహ్య స్పందన లభించింది. ఫలితంగా కొత్తూరులోని ఒక రిసార్ట్స్‌లో జిల్లా కలెక్టర్ శ్రీదేవి అద్యక్షతన శుక్రవారం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సుకు రాష్ట్రానికిచెందిన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్త లు హాజరయ్యారు. జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. రూ. 695 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే వివిధ పరిశ్రమల్లో జిల్లాలోని నిరుద్యోగులకు ఉపా ధి కల్పించడానికి సత్వరం కార్యాచరణలోకి దిగుతున్నట్టు పారిశ్రామిక సంస్థలు ప్రకటిం చాయి. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి నూతన పరిశ్రమలు నెలకొల్పాలన్న లక్ష్యం తో తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామి క విధానాన్ని ఇటీవల ప్రవే శపెట్టింది. ప్రభుత్వం సరళీకరించిన నూతన పారిశ్రామిక విధానాన్ని జిల్లాకు వరంగా మల్చుకోవాలని సంకల్పించిన జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి రాష్ర్టంలోనే తొలిసారిగా అడ్వాంటేజ్ (సానుకూల)మహబూబునగర్ పేరిట పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. పరిశ్రమలకు మహబూబ్‌నగర్ ఏ విధంగా అనుకూలమైందో.. ఇక్కడ లభించే సహజవనరులు పరిశ్రమల స్థాపనకు ఏవిధంగా దోహదపడతాయి.. రవాణా పరిస్థితులు ఎలా అనువుగా ఉంటాయన్న అంశాలతో పాటు జిల్లా భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై గంట పాటు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లా చేనేత రంగానికి పెట్టింది పేరని గద్వాల, నారాయణపేట చీరలు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వని.. తిరుపతిలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో సైతం గద్వాల చీరను వినియోగిస్తారని వివరించారు. కోస్గిలో టస్సర్ పట్టును తయారు చేస్తారని.. జిల్లాలో ఊలు కుటీర పరిశ్రమగా విరాజిల్లుతుందని వివరించారు. వేరుశనగ, జొన్న, ఆముదం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నామన్నారు. ఫార్మా పరిశ్రమతో పాటు వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి కావాల్సిన సౌకర్యాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరిశ్రమలకు పరిపాలన అనుమతులు ఇచ్చేందుకు మానటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దళిత్ ఇండియా పారిశ్రీమిక వేత్తల సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో జిల్లా కలెక్టర్లు ఈ స్థాయిలో పారిశ్రమిక అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. గత సంవత్సరమైతే ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కమిటీ సమావేశాలు కేవలం రెండు మాత్రమే జరిగాయన్నారు. సమావేశంలో పలువురు మహిళా పారిశ్రమికవేత్తలు, జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్, జేసీ రాంకిషన్, షాద్‌నగర్ ఏఎస్పీ సందీప్ కుమార్, జిల్లాపరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్ రెడ్డి, పంచాయితీ అధికారి వెంకటేశ్వర్లు, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.