ఉద్యోగులు కూడా మా కుటుంబసభ్యులే!
మహిళా విజయం
‘దేశంలో మొదటి స్థానానికి చేరుకుంటాం’. ఓ మహిళా పారిశ్రామికవేత్త ఆత్మవిశ్వాసంతో అన్న మాట ఇది. ఆమె విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ సరోజా వివేకానంద. సామాన్యులకు ఆమె మాజీ ఎం.పి వివేక్ సతీమణి మాత్రమే. పరిశ్రమల రంగంలో మహిళలకు మాత్రం ఆమె ఓ చుక్కాని, ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ చైర్పర్సన్.
ఒకప్పుడు ఆమె సంప్రదాయ కుటుంబంలో పుట్టిన సాధారణమైన అమ్మాయి. రాజకీయరంగంలో తలపండిన జి.వెంకటస్వామి ఇంటికి కోడలైన తర్వాత, పరిశ్రమను విజయవంతంగా నడిపిస్తున్న పారిశ్రామికవేత్త. ఈ పరిణామక్రమాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
నాన్న అనుకున్నట్లే...
‘‘మా నాన్న వాస్తు పండితులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం. కూతురి కోసం అల్లుడు వెతుక్కుంటూ వస్తాడని ఆయనకు నమ్మకం. అవి నేను ఇందిరాప్రియదర్శిని కాలేజ్లో డిగ్రీ చదువుతున్న రోజులు. నాన్న నమ్మకమే నిజమైంది. అదే సమయంలో వివేక్ ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసి పరిశ్రమ స్థాపించే ప్రయత్నంలో ఉన్నారు. భవనం వాస్తు నమూనా కోసం మా నాన్న దగ్గరకు పలుమార్లు రావాల్సి వచ్చింది. ఆ పరిచయంతో ఆయన ప్రపోజ్ చేశారు. 1986లో పెళ్లయ్యే నాటికి నాకు ఇరవై ఏళ్లు.
మామగారి ప్రోత్సాహంతో...
మా మామగారు నన్ను, మా తోడికోడల్ని ‘అమ్మాయిలు చదువుకున్నారు, ఆడవాళ్లు వ్యాపారాలు, ఉద్యోగాలు చేయకూడదని ఎవరన్నారు. పని చేసి నిరూపించుకోవాలి’ అని ప్రోత్సహించేవారు. అలా ఇరవయ్యేళ్ల కిందట విశాఖ కంపెనీకి డెరైక్టర్నయ్యాను. 1994లో చిన్నబ్బాయి పుట్టిన తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టాను.
చక్కటి కుటుంబం!
వివేక్ రాజకీయంగా ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ కుటుంబానికి ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటారు. కానీ తెలంగాణ మూవ్మెంట్ తీవ్రంగా ఉన్న ఐదేళ్లు మాత్రం ఫోన్కు కూడా అందని పరిస్థితుల్లో గడిచింది. ఎప్పుడైనా నేను అయోమయంలో పడితే ‘ఇంతకంటే పెద్ద ఇష్యూస్నే సమర్థంగా డీల్ చేశావు. దీనికెందుకు వర్రీ’ అంటూ భరోసా ఇస్తుంటారు.
ఎప్పుడైనా నేను అయోమయంలో పడితే ‘ఇంతకంటే పెద్ద ఇష్యూస్నే సమర్థంగా డీల్ చేశావు. దీనికెందుకు వర్రీ’ అంటూ భరోసా ఇస్తుంటారు వివేక్.
- సరోజా వివేకానంద, విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్
విశాఖ ఫ్యామిలీ!
మా పరిశ్రమలలో పని చేసే వారి ఫోన్ నంబర్లన్నీ విశాఖ ఫ్యామిలీ అనే గ్రూప్లో ఉంటాయి. ప్రతి ఉద్యోగి పుట్టిన రోజుకీ నా తరఫున శుభాకాంక్షలు అందుతాయి. వాళ్ల ఇంట్లో పెళ్లి వంటి వేడుకలు జరుగుతుంటే బొకే పంపిస్తాం. నెలకోసారి మా ఉద్యోగుల్లో ఒకరి ఇంట్లో లంచ్ చేస్తాను. ఇప్పుడు మా చిన్నబ్బాయి కూడా ఇండస్ట్రీ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. దాంతో నా హాబీలకు సమయం కేటాయించుకోవడానికి వెసులుబాటు దొరికింది. స్మిమ్మింగ్ క్లాసులు, సింగింగ్ క్లాసులతోపాటు గోల్ఫ్ ఆటతో గడుపుతున్నాను. హైదరాబాద్లో లేడీస్ గోల్ఫ్ బృందం ఉంది.
- వాకా మంజులారెడ్డి