ఇక్కడ అన్నం తింటే ఆస్పత్రి పాలే!
సాక్షి, నూజివీడు : శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులకు అందించే భోజనం నాసిరకంగా ఉండటం, పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వారిలో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. నాసిరకం భోజనం పెడుతుండటంతో విద్యార్థులందరం అనారోగ్యానికి గురవుతున్నామని, భోజనంలో పురుగులు, ఈగలు వస్తున్నా పట్టించుకోవడం లేదంటూ శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం అల్పాహారం కూడా తినకుండా మెస్ వద్దనే 8 గంటల నుంచి ఆందోళన చేశారు. నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని నిర్వహిస్తున్నారు.
ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అనూష కేటరర్స్ నిర్వహించే డైనింగ్‌హాల్–7లో భోజనం చేస్తున్నారు. అయితే వారం రోజులుగా భోజనంతో పాటు, ఉదయం పూట అల్పాహారం కూడా అధ్వానంగా ఉండటమే కాకుండా ఈగలు, పురుగులు ఉంటున్నాయి. దీనిపై విద్యార్థులు ఆఫీస్ సిబ్బందికి పలుమార్లు తెలిపినప్పటికీ ఎవరి నుంచి స్పందన లేకపోవడమే కాకుండా భోజనం విషయంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో చివరకు చేసేదేమీ లేక విద్యార్థులందరూ కలిసి అల్పాహారం కూడా చేయకుండా ధర్నాకు దిగారు.
వందల మంది బాధితులు..
కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రబుల్లో సమస్యలతో ఈనెల 25న 120మంది విద్యార్థులు క్యాంపస్‌లోనే ఉన్న ఆస్పత్రిలో వైద్యచికిత్స చేయించుకున్నారు. వీరిలో 21 మందికి సెలైన్లను కూడా పెట్టారు. అలాగే 26న మరో 108 మందికి వైద్యచికిత్స చేసి 22 మందికి సెలైన్లను పెట్టారు. ఇంత జరుగుతున్నా డైరెక్టర్‌గాని, వైస్‌చాన్సలర్ గాని పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఈనెల 18వ నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకు 60 నుంచి 90 మంది వరకు ఆస్పత్రికి వెళ్లి వైద్యచికిత్స పొందుతున్నారు. ఆ సంఖ్య 25, 26 తేదీలలో పెరిగింది.
నాసిరకంగా అల్పాహారం..
అల్పాహారంలో భాగంగా ఇడ్లీ, చపాతి, పులిహోర పెడతారని, ఇడ్లీ ఏమీ బాగోదని, చపాతి పిండి పిండిగా ఉంటుందని, రాత్రిపూట అన్నం మిగిలిపోతే దానిని తరువాత రోజు ఉదయం పులిహోరగా చేసి పెడుతున్నారని ఆరోపించారు. అపరిశుభ్రంగా ఉండడంతో పురుగులు, ఈగలు ఉంటున్నాయని విద్యార్థులు వాపోయారు.
మెస్‌లపై ఏమాత్రం పర్యవేక్షణ లేని, మెస్ కమిటీలను నియమించినా కమిటీ సభ్యులు పరిశీలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మంచినీరు కూడా సరిగా లేకపోవడంతో పాటు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవని చెబుతున్నారు.
ఆహారాన్ని పరిశీలించిన వీసీ
విద్యార్థుల ఆందోళనతో ఆర్జీయూకేటీ వైస్‌ఛాన్సలర్ వేగేశ్న రామచంద్రరాజు మధ్యాహ్నం 12గంటలకు శ్రీకాకుళం ట్రిపుల్ఐటీకి చేరుకున్నారు. సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెస్‌లను, పరిసరాలను, తయారు చేస్తున్న ఆహార పదార్థాలను, భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెస్‌ల నిర్వహణను మెరుగుపరుస్తామని, వీటిని పర్యవేక్షించడానికి కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను కూడా భాగస్వాములం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.