- నాసిరకం భోజనం
- బొద్దింకలతో సావాసం
- ఇదీ ఆసియా గేమ్స్‌కు సిద్ధమవుతున్న భారత అథ్లెట్ల పరిస్థితి
న్యూఢిల్లీ: వారంతా ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఆటగాళ్లు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్‌లోనే ఫిట్‌నెస్ ఉండాలి. దీని కోసం ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. వంట శాలలో విచ్చలవిడిగా తిరుగుతున్న బొద్దింకలు.. అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న కూరగాయలు.. పనిచేయని స్థితిలో ఉన్న వాటర్ కూలర్లు.. సరిగా కడగని వంట పాత్రలు.. ఇదీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని పరిస్థితి.
ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే ఆసియా గేమ్స్ కోసం సన్నద్ధమవుతున్న అథ్లెట్లకు ఈ దృశ్యాలు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఇక్కడి వాస్తవ పరిస్థితిపై విచారణ జరపాల్సిందిగా కొందరు అథ్లెట్లు కేంద్ర క్రీడా శాఖకు లేఖలు కూడా రాశారు. ‘భోజన నాణ్యత గురించి క్యాటరర్‌ను అడిగితే అతడు మాపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. శిబిరం నుంచి బయటకి పంపిస్తామని అన్నాడు. కోచ్‌లు, డైటీషియన్‌లు ఇక్కడి పరిస్థితికి దూరంగా ఉంటున్నారు. క్యాంప్‌లో ఉన్న మేమే బలి కావాల్సి వస్తోంది. సర్వ్ చేసే వ్యక్తి క్యాప్, గ్లోవ్స్ లేకుండానే పనిచేస్తున్నాడు.
కొన్నిసార్లు మధ్యాహ్నం మిగిలిన చికెన్‌ను రాత్రి పెడుతున్నారు. ఏమన్నా అంటే ‘ఇది మీకు ఉచిత భోజనం.. నోర్మూసుకుని తినండి’ అని గద్దిస్తున్నారు. పది రోజుల నుంచి డైనింగ్ రూమ్‌లో వాటర్ కూలర్ పనిచేయడం లేదు’ అని తాము పడుతున్న బాధలను ఓ అథ్లెట్ వివరించింది. మరోవైపు ఇలాంటి ఘటనలను క్షమించేది లేదని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) డెరైక్టర్ జనరల్ జిజి థామ్సన్ అన్నారు. ‘స్టేడియంలోని క్యాటరింగ్ ఇన్‌చార్జి సాయ్ వ్యక్తి కాదు. తక్కువ ఖర్చుతో క్యాటరర్‌ను ఎంపిక చేసుకోమంటున్నారు. కానీ మంచి వ్యక్తులు ఈ ధరకు రావడం లేదు’ అని ఆయన చెప్పారు.
ఇలాగేనా శిక్షణ...?
Published Fri, Sep 12 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM
Advertisement
Advertisement