మీ పిల్లలు తెలివిగల వాళ్లు కావాలంటే..
ఛత్రపతి శివాజి తల్లి బాల శివాజికి చిన్ననాటి నుంచే రామాయణ మహాభారత కథలు, భారతీయ వీరాధివీరుల కథల్ని వినిపించేది. తల్లి ఒడిలో కూర్చున ఆసక్తిగా వినే శివాజి పెద్దయ్యాక తానూ వీరాధివీరుణ్ని కావాలని కలలు కనేవాడు. యావత్ భారతాన్ని ఆధ్యాత్మికంగా తట్టిలేపిన వివేకానందుడు కూడా బాల్యంలో తల్లి చెప్పే పురాణ ఇతిహాసాలు, వాటిలోని గొప్ప వ్యక్తుల కథలను నరేంద్రునికి చెబుతుంటే ఆ బాలుడు ఉత్తేజానికి గురయ్యేవాడు. ఇలా అనాదికాలం నుంచి ‘స్టోరి టెల్లింగ్’ బాలల మానసిక వికాసంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. అది మళ్లీ ఇప్పుడిప్పుడే ఆదరణ అందుకుంటోంది.
బెంగళూరు: ‘అనగనగా ఓ రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు, ఆ ఏడుగురు వేటకెళ్లారు’ గుర్తుందా ఈ కథ, ప్రతి చిన్నారికి తన నాన్నమ్మ, తాతయ్యలు కచ్చితంగా ఇలాంటి కధలు చెప్పేవాళ్లు. కానీ ఉరుకుల పరుగుల నేటి కాలంలో ఇలాంటి కథలు, కథలు చెప్పే వాళ్లు కనిపించడం లేదు. ఇందుకు కారణం ఒక్కటే నగర జీవితంలో కుటుంబాలు చిన్నవైపోతున్నాయి, దీంతో నాన్నమ్మ, తాతయ్యలు పిల్లల దగ్గర ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇక కెరీర్ పరుగులో పడిపోయిన తల్లిదండ్రులకు తమ పిల్లలకు కథలను చెప్పగలిగేంత సమయం, ఓపిక రెండూ దొరకడం లేదు.
అందుకే ఇప్పటి పిల్లల్లో చాలా మందికి వీడియోగేమ్స్, ఇంటర్నెట్లలో మునిగిపోతున్నారు తప్ప కథలంటే ఏమిటో తెలియడం లేదు. వీటి కారణంగానే చాలా మంది పిల్లలు పుస్తకాలకు పరిమితమైపోతున్నారు తప్ప వారిలో ఏమాత్రం సృజనాత్మక పెరగడం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితిలో కాస్తంత మార్పు వస్తోంది. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో స్టోరీ టెల్లింగ్ విభాగంలో నిపుణులు తయారవుతున్నారు. స్టోరీ టెల్లింగ్ క్లాసులకు కూడా ఉద్యాననగరిలో ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఈ స్టోరీ టెల్లింగ్ క్లాసులకు తమ పిల్లలను పంపించడానికి మెట్రో ఎగువ మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
‘స్టోరీ టెల్లింగ్’కి పెరుగుతున్న క్రేజ్....
ఎప్పుడూ వీడియోగేమ్‌లు, ఇంటర్నెట్లతో కాలం గడిపే చిన్నారుల్లో సృజనాత్మక శక్తి పూర్తిగా తగ్గిపోవడంతో పాటు వారిలో ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఇప్పటికే అనేక సర్వేలు వెళ్లడించాయి. ‘మీ పిల్లలు తెలివిగల వాళ్లు కావాలంటే వారికి రోజూ కథలు చెప్పండి’ అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారంటే, చిన్నారుల జీవితాలను కథలు ఎంతగా ప్రభావితం చేయగలవో అర్ధం అవుతుంది. అందుకే ప్రస్తుతం బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని తల్లిదండ్రుల్లో ఇప్పుడిప్పుడే కాస్తంత మార్పు వస్తోంది.
పిల్లలకు ప్రతి రోజూ కథలు చెప్పే సమయం దొరక్కపోయినా వారాంతాల్లో తప్పనిసరిగా ‘స్టోరీ టెల్లింగ్’ కార్యక్రమాలకు తీసుకెళుతున్నారు. అంతేకాదు పాఠశాలల్లో సైతం వారంలో కనీసం రెండు రోజులు స్టోరీ టెల్లింగ్ క్లాసులు ఉండేలా చూడాలని పాఠశాల యాజమాన్యాలకు తల్లిదండ్రుల వద్ద నుండి అభ్యర్థనలు కూడా వస్తున్నాయి. దీంతో నగరంలో స్టోరీ టెల్లింగ్ నిపుణులకు, ఈ తరహా కార్యక్రమాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. నగరంలోని రంగోలి మెట్రో ఆర్ట్ సెంటర్లో ప్రతి వారాంతంలో స్టోరీ టెల్లింగ్ కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయంటే ఈ తరహా కార్యక్రమాలు ఏ విధంగా క్రేజ్ పెరుగుతోందో మనం అర్ధం చేసుకోవచ్చు.
ప్రయోజనాలెన్నెన్నో..
కథలు వినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తరగతుల్లో చెప్పె పాఠాల్లో దాదాపు సగం చిన్నారులకు గుర్తు ఉండవు. అదే ఒక కథలోని ప్రతీ సంఘటన పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోతుంది. ఇక ప్రతి రోజూ చిన్నారులకు కథలు చెప్పడం వల్ల చిన్నారుల్లో ఊహాశక్తి పెరుగుతుందని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. కథ చెబుతూ పోతుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని చిన్నారులు ఊహిస్తూ ఉంటారు.
ఇదే వారి మానసిక ఎదుగుదలకు కూడా ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని నిపుణుల అభిప్రాయం. ఇక చరిత్రకు సంబంధించిన అంశాలను కథల్లా చెప్పడం ద్వారా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయవచ్చు. పంచతంత్ర కథల ద్వారా బుద్ధికుశలత వల్ల ఎలాంటి అపాయం నుండైనా తప్పించుకోవచ్చని పిల్లలు తెలుసుకుంటారు. ఇక మాతృభాషతో పాటు ఇంగ్లీష్, హిందీ తదితర భాషల్లో పిల్లలకు కథలు చెబితే వారికి భాషా పరిజ్ఞానం కూడా పెరుగుతుంది.
ఊహాజనిత లోకాన్ని కళ్లకు కట్టేలా...
శ్రోతలను ఆకట్టుకునేలా కధలను చెప్పగలగడం ఓ ప్రత్యేకమైన కళ అంటారు నగరానికి చెందిన ప్రముఖ స్టోరీ టెల్లర్ ‘దీప్త’. కధల్లోని అంశాలకు తగ్గట్టు ఓ ఊహాజనిత లోకాన్ని కళ్లకు కట్టేలా కధలు చెప్పగలిగినపుడే శ్రోతలు ఆ కధలో పూర్తిగా నిమగ్నమవుతారు. ఇందుకోసం ఇప్పటి స్టోరీ టెల్లర్స్ చాలా మంది వారి హావభావాలను కధలతో కలిపి వ్యక్తీకరించడంతో పాటు పెయింటింగ్స్, పేపర్ కటింగ్స్, పాటలు వంటి వాటిని తమ మాధ్యమాలుగా వినియోగిస్తున్నారని దీప్త చెబుతున్నారు. ‘ఎంచుకున్న కధతో పాటు ఎత్తుగడ, ముగింపు అనే అంశాలు ఒక స్టోరీ టెల్లర్ నైపుణ్యం తెలుస్తుంది.
ఇక కధలు అనగానే కేవలం చిన్నారులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఎన్నో ఒత్తిళ్లతో సతమతమయ్యే పెద్ద వారికి సైతం ఈ తరహా కధాకాలక్షేపాలు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి. అమెరికా, సింగపూర్, దుబాయ్ వంటి దేశాల్లో ఇప్పటికే స్టోరీ టెల్లింగ్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక మన దేశంలోని మెట్రో నగరాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఈ స్టోరీ టెల్లింగ్‌కి ఆదరణ పెరుగుతోంది. స్టోరీ టెల్లింగ్‌లో నైపుణ్యాన్ని సాధించగలిగితే మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు’ అంటున్నారు దీప్త.