సిరియాపై సైనిక చర్యకు భారత్ అభ్యంతరం
సమస్యలకు రాజకీయ పరిష్కారమే సరి: ఖుర్షీద్
బిష్కెక్: సిరియాపై విదేశాల సైనిక చర్యకు భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సంక్షోభ నివారణకు సమగ్ర రాజకీయ పరిష్కారమే మేలని స్పష్టం చేసింది. ఇందుకోసం అక్కడి అన్ని పార్టీలు రాజకీయ చర్చల్లో తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చింది. సిరియాలో రసాయన ఆయుధాల దాడిలో వెయ్యి మందికిపైగా ప్రజలు మృతి చెందిన నేపథ్యంలో అక్కడ సైనిక చర్యకు అమెరికా యత్నిస్తున్న సంగతి విదితమే. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై సహకార మండలి సదస్సులో భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ శుక్రవారం ప్రసంగిస్తూ, సిరియాలోని రసాయనాల నిల్వలను అంతర్జాతీయ నియంత్రణలోకి తీసుకురావాలన్న రష్యా ప్రతిపాదనకు మద్దతిస్తున్నామన్నారు.
అలాగే త్వరలో ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భారత్, పాక్ ప్రధానులు చర్చలు జరిపేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో భారత్ వైఖరి వెల్లడించారు. ఉన్నతస్థాయి చర్చలకు ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు తగిన సుహృద్భావ వాతావరణం అవసరమని అన్నారు. ముంబై దాడుల కేసులో కొత్త ప్రాసిక్యూటర్ నియామకం, విచారణకు జ్యుడీషియల్ కమిషన్‌ను భారత్‌కు పంపడం, నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను పాక్ గౌరవించడం తదితర చర్యలు అవసరమని ఇవేవీ సాకారం కానప్పుడు ఈ ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసే అవుతుందని పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌కు చెప్పినట్లు ఖుర్షీద్ వెల్లడించారు.