అర్ధరాత్రి మృతదేహాన్ని దహనం చేస్తూ దొరికిపోయాడు
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : అర్ధరాత్రి సమయంలో రహస్యంగా మృతదేహాన్ని దహనం చేస్తూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామం రామాలయం వద్ద సబ్రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకొచ్చి నిప్పంటించాడు. చెత్త తగులబడుతుందని స్థానికులు అనుకున్నారు.
అయితే సరిగ్గా అదే సమయంలో అటువైపు వచ్చిన పెట్రోలింగ్ పోలీసులను చూసి అతడు పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి ఆర్ఎంపీ వైద్యుడని, వైద్యం వికటించి మృతి చెందిన రోగి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తన బైక్ పై ఎక్కించుకుని శంషాబాద్లో దహనం చేస్తున్నాడని స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.