ఆ పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!
హైదరాబాద్: కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వాడుకలోలేని పీఎఫ్ ఖాతాదారులకు దీపావళి కానుక అందించారు. వాడుకలో లేని పీఎఫ్ అకౌంట్లకు 8.8 శాతం వడ్డీ చెల్లించాలని ఉద్యోగ భవిష్య నిధి కార్యాలయం (ఈపీఎఫ్‌వో) నిర్ణయం తీసుకుందని దత్తాత్రేయ పీటీఐకి తెలిపారు. 2011 నుంచి వడ్డీ చెల్లించని ఈ ఈపీఎఫ్ అకౌంట్లకు వడ్డీ చెల్లించడం ద్వారా ఆయా ఖాతాలను వాడుకలోకి తీసుకు వచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నోటిషికేషన్ విడుదల చేయనున్నదని ఆయన సోమవారం తెలిపారు. తమ నిర్ణయం దాదాపు 9.70 కోట్ల మంది కార్మికులకు లేదా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లావాదేవీలు జరపని అకౌంట్లలో రూ.42 వేల కోట్ల నిధులు ఉన్నాయని ఆయన తెలిపారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.సంబంధిత ఫైల్స్ పై ఇప్పటికే తాను సంతకం చేశానని, మరోవారంలోగానే నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఇది ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే దీపావళి కానుక అని ప్రకటించారు. పీఎఫ్ ఉపసంహరించుకోవడానికి ఇష్టపడని , లావాదేవీలు జరపని ఖాతాదారులు కూడా ఇక ముందు వడ్డీ పొందడానికి అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇది సురక్షితమైన పెట్టుబడిగా ఉండి, ఇవాళ కాకపోతే రేపు హక్కుదారులకు చెల్లిస్తామన్నారు.
ఈపీఎఫ్ విషయంలో గత 36 నెలలుగా లావాదేవీలు జరపని ఖాతాలను "పనిచేయని" గా వర్గీకరిస్తారు. ఇలాంటి ఖాతాలను గుర్తించే పనిలోఉన్నామని, ఈ ప్రక్రియ ముగియగానే ఖాతాలకు వడ్డీ పంపిణీ ప్రారంభిస్తామని దత్తాత్రేయ చెప్పారు.అన్ని ప్రభుత్వ రంగాల్లో సామాజిక భద్రతా పథకం పెంచాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలోభాగంగా ఇపీఎఫ్ఓ నెట్వర్క్ ను విస్తరించాల్సిన అవసరాన్ని ఉంది అన్నారు. కాబట్టి ప్రస్తుత జోనల్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయబడుతుందన్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక జోనల్ కార్యాలయం ఏర్పాటు కానున్నట్టుచెప్పారు. ఈ అంశంపై నేడు (మంగళవారం) వివరంగా చర్చించడానికి ఇపిఎఫ్ఓ సమీక్షా సమావేశమవుతోందని తెలిపారు. అలాగే ఇపిఎఫ్ఓ , పెట్టుబడులు పునర్నిర్మాణ తదితర సమస్యలపై ధర్మకర్తల మండలి తదుపరి సమావేశంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇతరులతో చర్చించనున్నట్టు తెలిపారు.