నేవీ పొదిలోకి భారీ విధ్వంసక నౌక
ఐఎన్ఎస్ కొచ్చి జలప్రవేశం
భారత్ దేశీయంగా తయారు చేసిన అతిపెద్ద యుద్ధనౌక
ముంబై : దేశ నౌకాదళంలోకి క్షిపణి సామర్థ్యమున్న అత్యాధునిక విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ కొచ్చి చేరింది. భారత్ దేశీయంగా తయారు చేసిన అతిపెద్ద నౌక అయిన దీన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ బుధవారమిక్కడి నేవీ డాక్‌యార్డ్‌లో జలప్రవేశం చేయించారు. ఆయన నౌకపై విలేకర్లతో మాట్లాడుతూ..‘ ఇది విదేశీ యుద్ధనౌక మాదిరే సమర్థంగా ఉంటుంది. దీన్ని నిర్మించిన వారికి అభినందనలు. యుద్ధనౌకలకు సంబంధించి దేశీయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నాం. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను దేశీయంగా రూపొందించాల్సి ఉంది.
ఈ దిశగా వచ్చే 15 ఏళ్లకు రక్షణ సామగ్రిని దేశీయంగా తయారు చేసేందుకు నేవీ ప్రణాళిక రూపొందించింది. క్షిపణి టెక్నాలజీలోనూ వచ్చే ఏదేళ్లలో దేశీయ తయారీ ఉంటుంది’ అని తెలిపారు. ఇందులో ప్రైవేటు రంగానికీ చోటు ఉంటుందన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంపై పట్టుకోసం నేవీని బలోపేతం చేస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరలో ఇలాంటి మూడో, చివరి యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై రంగంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ ఆర్కే ధోవన్ తదితరులు పాల్గొన్నారు. నేవీ సామర్థ్య స్వావలంబనలో ‘కొచ్చి’ మైలురాయి అని ధోవన్ పేర్కొన్నారు.
ఐఎన్ఎస్ కొచ్చి ప్రత్యేకతలు..
ఐఎన్ఎస్ కొచ్చి కోల్‌కతా తరగతి(ప్రాజెక్ట్ 15 ఏ) గెడైడ్ క్షిపణి విధ్వంసక నౌక సిరీస్‌లో రెండోది. పోర్ట్ సిటీ కొచ్చి పేరు దీనికి పెట్టారు.
డిజైన్: నేవీకి చెందిన డెరైక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్. నిర్మాణం: మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్(ముంబై). బహళ నిఘా వ్యవస్థ, ప్రమాద హెచ్చరికల వ్యవస్థలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి(డీఆర్డీవో), ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ఆయుధ వ్యవస్థ: శక్తిమంతమైన ఆయుధాలు, సెన్సర్లు, నిఘా పరికరాలు. 30ఎంఎం, 70 ఎంఎం గన్లు. తీరంలో, సముద్రంలో దీర్ఘ శ్రేణి లక్ష్యాలను చేధించేందుకు క్షిపణులను నిలువుగా ప్రయోగించే వ్యవస్థ.