ins sindhuratna
-
సింధురత్న ప్రమాదం మానవ తప్పిదమే
ముంబై తీరంలో గత బుధవారం ఐఎన్ఎస్ సింధురత్న జలాంతర్గామిలో చోటు చేసుకున్న ప్రమాదం మానవ తప్పిదమేనని ప్రాధమిక విచారణలో వెల్లడైందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. జలాంతర్గామిలోని మూడో కంపార్ట్మెంట్లో్ని కేబుళ్లు, బ్యాటరీల నుంచి విష వాయువులు ఒక్కసారిగా వెలువడి ఆ గది అంతా వ్యాపించాయని తెలిపారు. ఆ విషవాయువులు పీల్చడంతో ఇద్దరు నావికులు లెఫ్టినెంట్ కపిశ్ మున్వల్, లెఫ్టినెంట్ మనోరంజన్ కుమార్‌లు మరణించగా, మరో ఏడుగురు నావికులు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారని చెప్పారు. భారత్ లో ఉన్న జలాంతర్గాములన్నీ దాదాపు 20 ఏళ్ల నాటివని ఈ సందర్బంగా తెలిపారు. సింధురత్న 26 ఏళ్ల క్రితం తయారైందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు గుర్తు చేశారు. యుద్ధనౌకలు తరచూ ప్రమాదాల బారిన పడుతుండటం, తాజాగా సింధురత్న ఘటన చోటుచేసుకోవడంతో.. నైతిక బాధ్యత వహిస్తూ నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి బుధవారం నాడే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గతంలో ముంబై తీరంలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి గురైంది. అందులో భారీ పేలుళ్లు, అగ్నిప్రమాదం సంభవించడంతో 18 మంది సిబ్బంది మరణించిన విషయం విదితమే. -
గల్లంతైన నావికుల మృతి
సింధురత్న జలాంతర్గామిలో ఇద్దరి మృతదేహాల లభ్యం సాక్షి, ముంబై: ఐఎన్ఎస్ సింధురత్న జలంతర్గామిలో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దరు నౌకాదళ అధికారులను బలితీసుకుంది. బుధవారం నాటి ప్రమాదం తర్వాత గల్లంతైన ఈ ఇద్దరు అధికారులు జలాంతర్గామిలోని ఓ కంపార్ట్మెంట్లో గురువారం విగతజీవులై కన్పించారు. వీరిని లెఫ్టినెంట్ కపిశ్ మున్వల్, లెఫ్టినెంట్ మనోరంజన్ కుమార్‌లుగా గుర్తించారు. సింధురత్న గురువారం ఉదయం హార్బర్‌కు చేరుకుంది. అందులో చిక్కుకున్న ఇద్దరు అధికారులను వైద్యాధికారుల బృందం పరీక్షించింది. ఆ తర్వాత వారిద్దరూ మరణించినట్టుగా నేవీ ఓ సంక్షిప్త సందేశంలో ప్రకటించింది. యుద్ధనౌకలు తరచూ ప్రమాదాల బారిన పడుతుండటం, తాజాగా సింధురత్న ఘటన చోటుచేసుకోవడంతో.. నైతిక బాధ్యత వహిస్తూ నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి బుధవారం నాడే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరానప్పటికీ.. నేవీ పశ్చిమ కార్యాలయూనికి (వెస్టర్న్ కమాండ్) చెందిన మరికొందరు అధికారులు కూడా రాజీనామాల యోచనలో ఉన్నట్టు తెలిసింది. వైస్ అడ్మిరల్ శేఖర్ సిన్హా రాజీనామాకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. కాగా ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలకు నైతిక బాధ్యత వహించేందుకే తాను కట్టుబడి ఉన్నట్టు అడ్మిరల్ జోషి తన సహోద్యోగులకు పంపిన ఓ అంతర్గత సందేశంలో స్పష్టం చేశారు. దర్యాప్తు బృందం ఏర్పాటు: మరోవైపు జలాంతర్గాములు (సింధురత్న సహా) ప్రమాదాలకు గురికావడంపై రియర్ అడ్మిరల్ స్థారుు అధికారి నేతృత్వంలో నేవీ ఓ ఉన్నతస్థారుు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. తక్షణమే విధులు ప్రారంభించిన ఈ బృందం ప్రమాదాలకు కారణాలను అన్వేషించి.. జలాంతర్గాముల సంబంధిత కార్యకలాపాలు సురక్షితంగా సాగేందుకు తగిన చర్యలను సిఫారసు చేయనున్నట్టు వెస్టర్న్ నావల్ కమాండ్ తెలిపింది. -
సింధురత్న జలాంతర్గామి ప్రమాదంలో ఇద్దరి మృతి
ఐఎన్ఎస్ సింధురత్న జలాంతర్గామి ప్రమాదంలో అదృశ్యమైన ఇద్దరు నేవీ అధికారులు కపీష్ మువాల్, మనోరంజన్ కుమార్ మరణించినట్లు నౌకాదళం నిర్ధారించింది. ఈ జలాంతర్గామి నుంచి పొగ రావడంతో.. ఐదుగురు సిబ్బంది అస్వస్థతకు గురికాగా, మరో ఇద్దరు కనపడకుండా పోయిన విషయం తెలిసిందే. వారిద్దరూ మరణించిన విషయాన్ని నౌకాదళం గురువారం నాడు నిర్ధారించింది. వరుస పెట్టి జలాంతర్గాములలో ప్రమాదాలు సంభవిస్తుండటంతో తీవ్రంగా కలత చెందిన నౌకా దళాధిపతి అడ్మిరల్ డీకే జోషి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కూడా ఆయన రక్షణ మంత్రి ఏకే ఆంటోనీని కోరారు. -
ముంబై తీరానికి చేరిన సింధురత్న
ముంబయి : ప్రమాదానికి గురైన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురత్న.. ముంబై తీరానికి చేరుకుంది. ఈ జలాంతర్గామిలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు నేవీ సిబ్బంది మరణించడంతో పాటు ఏడుగురు సిబ్బంది గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న నేవీ ఉన్నతాధికారులు జలాంతర్గామిని చేరుకుని గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు... గత కొన్ని నెలల్లో నేవీలో జరిగిన ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషీ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. ప్రమాదాలు, డీకే జోషీ రాజీనామా బాధాకరమైనవని ఆంటోనీ వ్యాఖ్యానించారు. -
జలాంతర్గామిలో పొగలు.. ఐదుగురికి అస్వస్థత
ముంబై తీరంలో ఓ జలాంతర్గామిలో ప్రమాదం సంభవించింది. జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురత్న నుంచి పొగ రావడంతో నౌకాదళ సిబ్బంది ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. మొత్తం ఐదుగురు సెయిలర్స్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిసింది. కేవలం నావికులు మాత్రమే కాక, పశ్చిమ కమాండ్ లోని సీనియర్ అధికారి కూడా జలాంతర్గామిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. గతంలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అందులో భారీ పేలుళ్లు, అగ్నిప్రమాదం కూడా సంభవించడంతో 18 మంది సిబ్బంది మరణించారు. ఇది కూడా ముంబై తీరంలోనే జరిగింది.