సాంఘిక బహిష్కరణ రద్దు
ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండ లం డబ్బా గ్రామంలో బుడిగజంగాల కుటుంబాలకు విధిం చిన సాంఘిక బహిష్కరణను వీడీసీ విరమించుకుంది. శనివారం సాక్షి మెరుున్ పేజీలో ‘వీడీసీకి డబ్బులివ్వలేదని సాంఘిక బహిష్కరణ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖరరాజు, స్థానిక ఎస్సై రాజారెడ్డి స్పందించారు. సాయంత్రం డబ్బా గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు వీడీసీ సభ్యులను, బుడిగ జంగాల పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీడీసీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలు విధించడం నేరమన్నారు.
వీడీసీల పేరిట బలవంతంగా డబ్బులు వసూలు చేయరాదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కేసు నమోదు చేస్తామన్నారు. స్పందించిన వీడీసీ సభ్యులు బుడిగ జంగాలకు విధించిన బహిష్కరణను విరమించుకుంటున్నామని, ఇకనుంచి అందరం కలిసిమెలిసి ఉంటామని రాతపూర్వంగా ఒప్పందం చేసుకున్నారు. సీఐ రాజశేఖరరాజు వీడీసీ సభ్యులు, బుడిగజంగాల పెద్దల చేతులు కలిపి అందరూ కలిసుండాలని కోరారు. .