Inspire Science Fair
-
భావి శాస్త్రవేత్తలు మీరే..
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ టి.జయప్రకాశ్‌రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. కొండాపూర్ మండలం గిర్మాపూర్‌లోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి ప్రేరణ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జయప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ దేశం గర్వపడేలా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఇందుకోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలని సూచించారు. తన సొంత నియోజకవర్గంలో రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ వేడుకలు జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆవిష్కర్తలుగా ఎదగాలి.. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకుని ఆవిష్కర్తలుగా ఎదగాలని ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మళ్లించటం సరికాదన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి విద్యార్థులు పరిశోధనలవైపు మళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ దినకర్‌బాబు మాట్లాడుతూ సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు. బాలమేధావులైన విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను సైన్స్రంగం వైపు ఆకర్షింపజేసేందుకు ప్రేరణ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశ ప్రగతి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయిలో 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి వచ్చేనెల 8 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి ప్రదర్శనకు పంపనున్నట్లు చెప్పారు. ప్రతిభను చాటేందుకు చక్కని వేదిక.. మూడురోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ మెదక్ జిల్లాలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని డీఈఓ జి.రమేశ్ అన్నారు. 11 జిల్లాకు చెందిన 625 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. విద్యార్థులు తమలోని ప్రతిభాపాటవాలను చాటిచెప్పేందుకు సైన్స్‌ఫెయిర్ చక్కని వేదికని పేర్కొన్నారు. సైన్స్‌ఫెయిర్ ద్వారా విద్యార్థులు శాస్త్రసాంకేతిక రంగాల వైపు మొగ్గుచూపే అవకాశం ఉందన్నారు. ప్రశంసలతో ముంచెత్తిన అతిథులు.. సైన్స్‌ఫెయిర్‌ను ప్రారంభించిన అనంతరం అతిథులు విప్ జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ దినకర్‌బాబు తదితరులు విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు. విప్ జయప్రకాశ్‌రెడ్డి నీటిపంపు సైకిల్‌ను తొక్కి నీటి సరఫరా ఎలా జరుగుతుంది పరిశీలించారు. అనంతరం ఆ నమూనా తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ గోపాల్, ఎంపీడీఓ హరిసింగ్, ఎంఈఓ చంద్రశేఖర్, గిర్మాపూర్ సర్పంచ్ కృష్ణ, కమిటీ సభ్యులు విజయరాజు, ప్రభాకర్, రాంచందర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఇన్స్పైర్’ నిధుల వినియోగంలో అక్రమాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రేరణ’ (ఇన్స్పైర్) కార్యక్రమానికి అవినీతి చీడ పట్టింది. ఈ కార్యక్రమం కింద విడుదల చేసిననిధుల ధార.. విద్యార్థుల కోసం కాకుండా ఇతర వ్యవహారాలకు దారి మళ్లింది. ఏకంగా లక్షల రూపాయలు ఇతర అవసరాలకు ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ అవినీతిని కట్టడి చేయాల్సిన జిల్లా విద్యాశాఖ మాత్రం ఉపాధ్యాయులకే వంత పాడడం విశేషం. పాఠశాల విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎంపికయ్యే విద్యార్థికి రూ.5వేల చెక్కు అందిస్తోంది. చెక్కు అందుకున్న విద్యార్థి తన సృజనాత్మకతతో నిర్దేశించిన అంశంపై ఓ నమూనా తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా విద్యార్థులు రూపొందించిన నమూనాలను జిల్లాస్థాయి వైజ్ఞానిక సదస్సులో ప్రదర్శించాల్సి ఉంటుంది. విద్యార్థికిచ్చిన రూ.5వేలలో రూ.2,500 నమునా తయారీకి ఖర్చు చేయగా.. మిగిలిన రూ.2,500లో ప్రయాణ ఖర్చులు, నమూనాకు అవసరమైన వాటికి వినియోగించాలి. దండిగా నిధులు.. దగాపడ్డ విద్యార్థులు.. ఈ ఏడాది జిల్లా నుంచి 1,438 మంది విద్యార్థులు ప్రేరణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ప్రభుత్వం రూ.71.9లక్షలు జిల్లా విద్యాశాఖకు విడుదల చేయగా.. వాటిని ఎంపికయిన విద్యార్థులకు చెక్కు రూపంలో పంపిణీ చేశారు. బ్యాంకులనుంచి డ్రా చేసిన నిధులను ఆయా విద్యార్థులు తమ వద్ద కాకుండా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద దాచారు. నిర్దేశిత అంశాలను దృష్టిలో పెట్టుకుని నమూనాలను తయారు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉపాధ్యాయులకిచ్చింది. కానీ జిల్లాలో ఎక్కడా ప్రేరణ కార్యక్రమంపై దృష్టి సారించలేదు. జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ తేదీ దగ్గర పడుతుండడంతో అప్పటికప్పుడు హడావుడిగా విద్యార్థులకు ఉచిత సలహాలిచ్చి ఏదో ఒక నమూనాతో సైన్స్‌ఫెయిర్‌లో హాజరుపర్చారు. దీంతో విద్యార్థుల సృజనాత్మకత ఏమేరకు మెరుగుపడిందో గానీ.. కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చుచేయకపోవడంతో ఆ మిగులును ఉపాధ్యాయులే వాడుకున్నారు. మూడోవంతు డుమ్మా.. ప్రేరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,438 మంది విద్యార్థులను ఎంపిక చేయగా.. అందులో మూడో వంతు విద్యార్థులు ఎలాంటి నమూనాలు చేయకపోవడం గమనార్హం. గత వారం డివిజన్ల వారీగా వైజ్ఞానిక ప్రదర్శన చేపట్టగా.. భారీగా విద్యార్థులు గైర్హాజరయ్యారు. డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. సరూర్‌నగర్ డివిజన్లో 449 మంది విద్యార్థులకు కేవలం 230 మంది మాత్రమే ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనకు నమూనాలతో హాజరయ్యారు. మల్కాజ్గిరి డివిజన్‌కు సంబంధించి కుత్బుల్లాపూర్‌లో వైజ్ఞానిక ప్రదర్శన చేపట్టగా.. 485 మంది విద్యార్థులకు 334 మందే హాజరయ్యారు. అదేవిధంగా వికారాబాద్ డివిజన్లో 504 మంది విద్యార్థులకు కేవలం 397 మంది మాత్రమే నమూనాలు చేశారు. మొత్తంగా 477 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనకు దూరమయ్యారు. ఈ లెక్కన రూ.23.85 లక్షలకు లెక్కలేదని స్పష్టమవుతోంది. మమ.. అనిపించారు ప్రేరణ కార్యక్రమంలో భాగంగా భారీగా నిధులు ఇచ్చినప్పటికీ విద్యార్థులు మాత్రం ఆ తరహాలో సృజనాత్మకతకు పదును పెట్టలేకపోయారు. అట్ట డబ్బాలు, థర్మాకోల్ షీట్లతో మొక్కుబడి నమూనాలతో చేతులు దులుపుకొన్నారు. వాస్తవంగా విద్యార్థులు తయారుచేసే నమూనాల ఎంపిక బాధ్యత ఉపాధ్యాయులకున్నప్పటికీ.. వారు బాధ్యతలను విస్మరించారు. దీంతో ఆదరాబాదరగా ఆయా విద్యార్థులు మొక్కుబడిగా నమూనాలు చేసినట్లు పలువురు విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో బహిరంగంగా పేర్కొన్నారు. ప్రేరణ కార్యక్రమంలో చేపట్టే నమునాల్లో థర్మాకోల్ షీట్లు, అట్టపెట్టెలు వాడొద్దనే నిబంధనలున్నప్పటికీ.. ఉపాధ్యాయులు ఆయా విద్యార్థులకు అవగాహన కల్పించకపోవడంతో ఈ గందరగోళం తలెత్తిందని ఓ ఉపాధ్యాయుడు ‘సాక్షి’తో పేర్కొన్నారు. వారం రోజుల్లో రికవరీ చేస్తాం ప్రేరణలో భాగంగా నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి హాజరు కాని విద్యార్థులనుంచి నిధులు రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గైర్హాజరైన విద్యార్థుల జాబితా తయారు చేశాం. అదేవిధంగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాం. వారం రోజుల్లోగా కచ్చితంగా నిధులన్నీ రికవరీ చేస్తాం. - సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి -
నేటినుంచి సైన్స్ ఫెయిర్
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: బాలురలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్‌ను సంగారెడ్డి డివిజన్ స్థాయిలో శనివారం ప్రారంభించనున్నారు. ఇందుకు గాను 15 మండలాలకు చెందిన విద్యార్థులు 480 ప్రదర్శనలు చేయనున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవే క్షించేందుకు 16 కమిటీలను నియమించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో నిర్వహించనున్న డివిజన్‌స్థాయి సైన్స్ ఫెయిర్‌ను ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డితో పాటు ఇతర శాసనసభ సభ్యులు హాజరు కానున్నారు. ప్రతి రోజూ మూడు నుంచి ఐదు వేల మంది సందర్శిస్తారని, వీరికి మూడు రోజులపాటు 15వేల మంది హాజరవుతారని అంచనా. సంగారెడ్డి డివిజన్ పరిధిలోని నారాయణఖేడ్, రాయికోడ్, జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్, మునిపల్లి, సదాశివపేట, కొండాపూర్, రామచంద్రాపురం, జిన్నారం, పటాన్చెరు మండలాల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిర్వహిస్తున్నందున వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో సందర్శించేందుకు వస్తారని అధికారులు అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 7 గంటలకు ఒక గైడ్ టీచర్‌తో పాటు విద్యార్థి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏర్పాట్లకు సంబంధించి నియమించిన కమిటీలకు డీఈఓ పలు సూచనలు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలకు విద్యార్థులతో పాటు గైడ్ టీచర్‌కు భోజన వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. -
ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ ప్రారంభం
మెదక్, న్యూస్‌లైన్: శాస్త్రీయ అభివృద్ధితోనే మానవ జీవన ప్రమాణాలు ముడిపడి ఉన్నాయని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వి.సునీతారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం డీఈఓ రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. విజ్ఞాన శాస్త్రంపైనే అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. గతంలో సంగారెడ్డిలో నిర్వహించిన ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో కదిలే సోలార్ ప్లేట్ల ద్వారా సౌర విద్యుత్‌ను కొంతమంది విద్యార్థులు తయారు చేశారని, దాని ఆధారంగానే మార్కెట్లో నేడు సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. మెదక్ పట్టణంలో బాలికల కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. ‘బంగారు తల్లి’ పథకం మంచిదే.. ఆడపిల్ల పుడితే రాష్ట్రంలోనే పుట్టాలనే విధంగా ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి అన్నారు. జిల్లాలో బాలికల కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించాలని కోరారు. మెదక్ మెతుకుసీమ కాదని... పదునైన మెదడు ఉన్న కత్తిసీమ అని జాయింట్ కలెక్టర్ శరత్ అభివర్ణించారు. ప్రతి వ్యక్తి పదిమందికి సహాయ పడినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందన్నారు. డీఈఓ రమేశ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ ధృక్పథాన్ని వెలికి తీయడానికే ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు 377 ప్రదర్శనలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ రమేశ్‌బాబు, తహశీల్దార్ పుష్పలత, ఏఎంసీ చైర్మన్ మధుసూదన్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డిప్యూటీ ఈఓలు సామెల్, శోభ, వెస్లీ ప్రిన్సిపాల్ డయాన డార్కస్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షులు యాదగిరి, ఏపీటీఎఫ్, ఆపస్ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చంద్రపాల్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆంజనేయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.