బాలురలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్‌స్పైర్ సైన్స్ ఫెయిర్‌ను సంగారెడ్డి డివిజన్ స్థాయిలో శనివారం ప్రారంభించనున్నారు. ఇందుకు గాను 15 మండలాలకు చెందిన విద్యార్థులు 480 ప్రదర్శనలు చేయనున్నారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: బాలురలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్‌స్పైర్ సైన్స్ ఫెయిర్‌ను సంగారెడ్డి డివిజన్ స్థాయిలో శనివారం ప్రారంభించనున్నారు. ఇందుకు గాను 15 మండలాలకు చెందిన విద్యార్థులు 480 ప్రదర్శనలు చేయనున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవే క్షించేందుకు 16 కమిటీలను నియమించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో నిర్వహించనున్న డివిజన్‌స్థాయి సైన్స్ ఫెయిర్‌ను ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డితో పాటు ఇతర శాసనసభ సభ్యులు హాజరు కానున్నారు. ప్రతి రోజూ మూడు నుంచి ఐదు వేల మంది సందర్శిస్తారని, వీరికి మూడు రోజులపాటు 15వేల మంది హాజరవుతారని అంచనా. సంగారెడ్డి డివిజన్ పరిధిలోని నారాయణఖేడ్, రాయికోడ్, జహీరాబాద్, కోహీర్, న్యాల్‌కల్, మునిపల్లి, సదాశివపేట, కొండాపూర్, రామచంద్రాపురం, జిన్నారం, పటాన్‌చెరు మండలాల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిర్వహిస్తున్నందున వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో సందర్శించేందుకు వస్తారని అధికారులు అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇన్‌స్పైర్ సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 7 గంటలకు ఒక గైడ్ టీచర్‌తో పాటు విద్యార్థి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏర్పాట్లకు సంబంధించి నియమించిన కమిటీలకు డీఈఓ పలు సూచనలు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలకు విద్యార్థులతో పాటు గైడ్ టీచర్‌కు భోజన వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.