కష్టాల్లో ‘బంగారు తల్లి’
ఖమ్మం హవేలి: చిన్నారి బాలికల కోసం ఏర్పాటు చేసిన బంగారుతల్లి పథకం 2013 మే 1 నుంచి అమలవుతున్నప్పటికీ బాలారిష్టాలు తప్పడం లేదు. ఆడపిల్లలకు ఉన్నత విద్య అందించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకాన్ని రూపొం దించారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకంలో నిత్యం ఎదురుచూపులే మిగిలాయి. 90శాతం మందికి ఇప్పటికీ బాండ్లు అందలేదు. లబ్ధిదారుల ఖాతాలో తక్షణం జమ కావాల్సిన రూ.2500 మొదటి విడత నగదు కూడా 60 శాతం మందికి పైగా జమ కాలేదు.
జిల్లా నుంచి అధికారులు అన్ని వివరాలను ఆన్లైన్ చేసి పంపినప్పటికీ ప్రక్రియ ఏమాత్రం ముందుకు కదలడం లేదు.
ఈ పథకం కొనసాగింపు విషయమై శాసనసభ సమావేశాల్లోనూ సభ్యులు ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత రాలేదు. పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తారో.. కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తారో కూడా ఏమాత్రం స్పష్టత లేదు. సంబంధిత శాఖ మంత్రి నుంచి తగిన సమాధానం రాకపోవడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. జిలా ్లవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 14,157 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 6,604 మందికి మాత్రమే మొదటి విడత ఇన్స్టాల్మెంట్ నగదు ఖాతాల్లో జమ అయింది. వీరిలో సింహభాగం మందికి ఇప్పటికీ బాండ్లు అందలేదు. 7,553 మంది లబ్ధిదారుల ఖాతాలో మొదటి విడత నగదు జమ కాలేదు. బాండ్లు రాలేదు. మరో 65 మంది దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయి.
జిల్లా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ద్వారా 27మండలాల్లో ఈ పథకం అమలు అవుతోంది. ఈ మండలాల నుంచి 17 నెలల కాలంలో మొత్తం 9,214 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా 54 తిరస్కరణకు గురయ్యాయి. 4,409 మందికి మొదటి విడత నగదు జమ అయింది. మరో 4,805 మందికి ఇప్పటికీ మొదటి విడత నగదు ఖాతాలో పడలేదు. కాగా ఈ ఆర్థిక సవంత్సరం 2014-15కు సంబంధించి 3,656 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా అధికారులు 3,642మంది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ ఇందులో ఒక్కరికి కూడా తొలివిడత నగదు జమ కాలేదు.
అదేవిధంగా మరో 19మండలాల్లో ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ద్వారా ఈ పథకం అమలు అవుతోంది. ఈ 19మండలాల నుంచి గత 17 నెలల కాలంలో మొత్తం 5,050 మంది దరఖాస్తు చేసుకోగా 11 తిరస్కరణకు గురయ్యాయి. 1,874మందికి మొదటి విడత నగదు ఖాతాల్లో జమ అయింది. 3,176 మంది లబ్ధిదారులకు ఇప్పటికీ నగదు ఖాతాలో జమ కాలేదు. 2014-15 సంవత్సరానికి సంబంధించి 2,069 దరఖాస్తులు రాగా అధికారులు 2,066 లబ్ధిదారుల వివరాలు అన్లైన్ ద్వారా అప్లోడ్ చేశారు. ఇందులో ఇక్కరికి కూడా తొలివిడత నగదు ఖాతాల్లో పడలేదు. లబ్ధిదారులు తమ దరఖాస్తు ప్రక్రియ వివరాలు తెలియక గగ్గోలు పెడుతున్నారు. నెలల తరబడి బాండ్లు రాకపోగా కనీసం మొదటి విడత నగదు కూడా ఖాతాల్లో చేరకపోవడంతో లబ్ధిదారులు మండలాల్లోని ఐకేపీ, ఖమ్మంలోని డీఆర్డీఏ, భద్రాచలంలోని ఐటీడీఏ చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ప్రభుత్వం వెంటనే ఖాతాల్లో నగదు జమ చేయడంతో పాటు బాండ్లు విడుదల చేస్తే ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. పథకం కొనసాగిస్తారో, లేదోనని అబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు అనేక సందేహాలతో సతమతం అవుతున్నారు. చివరకు బడ్జెట్లో సైతం ఇందుకు సంబంధించి సరైన ప్రస్తావన లేదు. బంగారుతల్లి పథకం కొనసాగింపు, మార్పులు, చేర్పుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తగిన స్పష్టత ఇవ్వాలని, భరోసా కల్పించాలని లబ్ధిదారులతో పాటు ప్రజలు కోరుతున్నారు.