The insurance sector
-
బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు వద్దు
ఒకరోజు సమ్మె చేసిన బీమా ఉద్యోగులు కర్నూలు(జిల్లా పరిషత్): బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు వద్దని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కర్నూలు యూనిట్ కార్యదర్శి ఆర్. సునీల్‌కుమార్ చెప్పారు. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఇఏ) పిలుపు మేరకు సోమవారం బీమా ఉద్యోగులు ఒక రోజు సమ్మె చేసి కర్నూలులోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లును అలాగే వదిలేసి లోక్‌సభలో ఇదే బిల్లును ప్రవేశపెట్టడం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసే పని సరికాదన్నారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టాక అది పార్లమెంటు ఉమ్మడి ఆస్తి అవుతుందన్నారు. ఆమోదించడమో, తిరస్కరించడమో, ఉపసంహరించడమో సభ ఆమోదంతోనే జరగాలన్నారు. అదేమీ లేకుండా మరో సభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్దమని తెలిపారు. ఇప్పటి వరకు పార్లమెంటు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందని విమర్శించారు. నిధుల లేమి వల్ల బీమా వ్యాపారం విస్తరించడం లేదని, నూతన సాంకేతిక పరిజ్ఞాన ం, నూతన ఉత్పత్తులు వస్తాయని ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందన్నారు. ప్రైవేటు బీమారంగ సరళీకరణ వల్ల ఒరిగేదీ లేదని, దేశీయ ప్రైవేటు భాగస్వాముల వద్ద నిధుల కొరత ఏమీ లేదన్నారు. ఎందుకంటే దేశీయ బీమా కంపెనీల భాగస్వాములు(టాటా, బిర్లా, రిలియన్స్)వంటి కార్పొరేట్ దిగ్గజాలు అనేక దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని, ఇందులో భాగంగా ప్రైవేటు కంపెనీల సేవలపై ఫిర్యాదులు నానాటికీ మిన్నంటుతున్నాయని చెప్పారు. బీమా నియంత్రణ సంఘం(ఐఆర్డిఏ)కు రెండు లక్షలపై ఫిర్యాదులు వస్తున్నాయంటే ప్రైవేటు బీమా కంపెనీల పనితీరును మనం అర్థం చేసుకోవచ్చన్నారు. పాలసీదారులకు ఆర్థిక భద్రత కల్పించడం, చిన్నమొత్తాల పొదుపును సమీకరించి, దేశ మౌళిక వనరుల కల్పనకు పెట్టుబడులుగా ఉపయోగించడంలో బీమా రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అనంతరం యూనియన్ అధ్యక్షుడు మక్బుల్ అహ్మద్, ఉపాధ్యక్షురాలు కె. నాగమణి, సెక్రటరి ఎం. అమీర్‌బాషా, ఎల్ఐసీ సీనియర్ బ్యాంక్ మేనేజర్ ఎన్. శంకర్‌నాయక్, నాయకులు ఎ. ప్రతాప్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పుల్లారెడ్డి, రామాంజనేయులు, రాధాకృష్ణ, అంజిబాబు పాల్గొని ప్రసంగించారు. సమ్మె విజయవంతం ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26 నుంచి 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలోని నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలైన యునెటైడ్ ఇండియా, న్యూ ఇండియా, ఓరియంటల్, నేషనల్ కంపెనీల్లో సమ్మె విజయవంతం అయింది. ఏఐఐఈఏ ఇచ్చిన సమ్మె పిలుపునకు స్పందించి స్థానిక ఓరియంటల్ ఇన్సూరెన్స్, భూపాల్ కాంప్లెక్స్‌లో జరిగిన సమ్మెలో జిల్లా కార్యదర్శి జి. శివకుమార్, ఉపాధ్యక్షులు జయశ్రీ, అజీజ్, రంగనాథరెడ్డి పాల్గొన్నారు. లాభాల బాటలో పయనిస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీలను విదేశీయుల చేతుల్లోకి పోకుండా అందరూ పోరాడాలని వారు కోరారు. -
తెలిసే ఓకే అంటున్నారా!
బీమా రంగం గత దశాబ్ద కాలంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో మార్పులు, సంస్కరణలు సైతం అంతే వేగంగా ఉన్నాయి. ఇదే సమయంలో బీమా కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. ‘పాలసీ విషయంలో ఏజెంట్ మోసం చేశాడని కొందరు... తప్పుడు సమాచారం ఇచ్చాడని మరికొందరు... తనకొచ్చే కమిషన్‌పైనే దృష్టి పెట్టాడని ఇంకొందరు..’ ఇలా ఫిర్యాదులు రకరకాలుగా ఉంటున్నాయి. తప్పెవరిది? తీసుకున్న పాలసీ అవసరాలకు తగిన విధంగా లేదంటే తప్పెవరిది? తప్పంతా ఏజెంట్దేనా? అవగాహన లేకుండా, నియమ నిబంధనలు చూడకుండా పాలసీ కొనేసిన కస్టమర్‌కు ఇందులో పాత్రేమీ లేదా? వంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. రెండు దశాబ్దాల నుంచీ జీవిత బీమా రంగంలో ఉంటున్న నేను ఈ సందర్భంగా చెప్పేది ఒక్కటే. సంబంధీకులో లేక స్నేహితులో చెప్పారని వారిని సంతృప్తిపరచడం కోసం పాలసీ తీసుకోవడం లేదా పన్ను భారం తగ్గించుకోవడం కోసం అవగాహన లేకుండా ఏజెంట్ చెప్పిన పాలసీ తీసుకోవడం మంచిది కాదు. పాలసీ తీసుకునే ముందు వీటిని తప్పక పరిశీలించాలి. 1. విశ్వసనీయత: పాలసీ కొనుగోలుకు ముందు ఈ విషయంలో మీకు సలహాలు ఇస్తున్న ఏజెంట్ విశ్వసనీయతపై దృష్టి పెట్టాలి. ఏ బీమా సంస్థలో పనిచేస్తున్నాడు. వృత్తిపరంగా పూర్తి అవగాహన, సామర్థ్యం ఉన్న వ్యక్తేనా? అతని గుర్తింపు ఏమిటి? లెసైన్స్ ఉందా? ఇత్యాది అంశాలను పరిశీలించడం ముఖ్యం. 2. ఆర్థిక లక్ష్యాలు ఏమిటి? ఒక పాలసీ తీసుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యం, వ్యయాలు, అలవాట్లు, ఆదాయాల గురించి బాగా ఆలోచించాలి. ఆయా అంశాల ప్రాతిపదికన ఈ రంగంలో అపార అనుభవం కలిగిన ఏజెంట్ సలహా తీసుకోవాలి. 3. అవసరాలు ముఖ్యం: అవసరాలకు, ఇబ్బందులను అధిగమించడానికి అనుగుణంగా ఏ పాలసీ బెటరన్న అంశంపై చర్చించాలి. సాంప్రదాయ బీమా ప్రణాళిక మంచిదా? లేక యులిప్ బాగుంటుందా? యులిప్ అయితే మీకు పెట్టుబడికి తగిన ఫండ్ ఏది? ఇవన్నీ అవగాహనలో భాగం కావాలి. 4. తుది నిర్ణయం మీదే కావాలి: పాలసీ తీసుకోవడంలో తుది నిర్ణయం మీదే కావాలి. మీ అవసరాలు, బడ్జెట్‌కు తగిన బీమా ప్రణాళికపై ఒక ఏజెంట్ సలహా తరువాత ఆ తరహా ప్రొడక్ట్‌పై వివిధ బీమా సంస్థలు అందిస్తున్న ప్రయోజనాలు, ఆయా వివరాలను వెబ్సైట్లు లేదా ఇతర సాధనాలతో ధ్రువీకరించుకోవాలి. 5. ముఖ్య ప్రశ్నలు ఇవి..: బీమాకు ఎంత చెల్లించాలి? ఎంతకాలం చెల్లించాలి? సానుకూలతలు, ప్రతికూలతలు ఏమిటి? ఏ రైడర్లను జతకలుపుకోవచ్చు? ప్రీమియం చెల్లింపులు? అవకాశాలు ఏమిటి? వంటి ప్రశ్నలపై మీకుగా మీరు అవగాహనకు రావాలి. ఏజెంట్ నుంచే కాకుండా సంస్థ నుంచి సమాచారం పొందవచ్చు. 6. ప్రపోజల్ పత్రాన్ని మీరే నింపాలి: ఈ అంశాన్ని ఏజెంట్‌కు వదిలివేయడం మంచిదికాదు. వివరాలు ఇచ్చే విషయంలో మీ ఆరోగ్యం, ఆర్థిక, జీవన విధానం... ఇలా ఏ విషయంలోనూ తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. 7. బాండ్ ఒరిజినల్స్‌ను పొందాలి: పాలసీ ఒరిజినల్ పత్రాలన్నింటినీ తెప్పించుకునే బాధ్యత మీదే. నిర్దిష్ట సమయంలో మీ ఏజెంట్ లేదా బీమా కంపెనీ నుంచి ఈ పత్రాలన్నింటి ‘హార్డ్ కాపీ’లను మీరు పొందగలగాలి. 8. సరిచూసుకోవాలి: బాండ్‌ను పూర్తిగా అధ్యయనం చేసి, అర్థం చేసుకోవాలి. మీ అవసరాలకు తగిన విధంగా పాలసీ ఉందా... లేదా అన్నది దీనితో స్పష్టమైపోతుంది. ఏవన్నా సందేహాలు ఉన్నా... ఇంకా చెప్పాలంటే పాలసీని విత్‌డ్రా చేసుకోవాలన్నా ‘ఫ్రీ లుక్ పీరియడ్’లో ఏజెంట్‌ను లేదా బీమా కంపెనీని వెంటనే సంప్రదించాలి. 9. నామినీకీ తెలియాలి: మీరు తీసుకునే పాలసీపై మీకు మాత్రమే చైతన్యం ఉంటే సరిపోదు. ఆయా అంశాలన్నింటిపై మీ నామినీకి కూడా మంచి అవగాహన కల్పించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. అప్పుడే మీరు తీసుకునే పాలసీకి సంబంధించి మీకు పూర్తి న్యాయం జరుగుతుంది. ప్రయోజనాలూ ఉంటాయి. 10. సకాలంలో ప్రీమియంలు: మీరు ఒకసారి పాలసీ తీసుకున్నారంటే... దానిని ఎట్టి పరిస్థితులలోనూ కొనసాగించేలా ఉండాలి. ప్రీమియంలు కట్టడం మానివేసి, దానిని మురిగిపోనీయవద్దు. ప్రీమియంలు సకాలంలో చెల్లించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
బీమాకు ‘అంబుడ్స్‌మన్’ భరోసా!
గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో వినియోగదారుల చైతన్య స్థాయి గణనీయంగా పెరిగింది. దీనితో పలు రంగాలతో పాటు బీమా రంగంలో కూడా వినియోగదారుల వివాదాలు పెరుగుతున్నాయి. అయితే ప్రతి సమస్య పరిష్కారానికీ కోర్టుల చుట్టూ దీర్ఘకాలం పాటు తిరగడం కష్టం. ఇలాంటి సందర్భాల్లో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి ఒక పటిష్ట యంత్రాంగం అవసరం. ఇదే అంబుడ్స్‌మన్ వ్యవస్థ. బ్యాంకింగ్‌లో ఇప్పటికే ఇటువంటి వ్యవస్థ సమస్యల పరిష్కారంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇదే తరహాలో బీమా రంగంలో కూడా అంబుడ్స్‌మన్ క్రియాశీల పాత్ర విస్తృతమవుతోంది. 12 కార్యాలయాలు... దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల పరిధిలతో 12 కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటిలో న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, భోపాల్, భువనేశ్వర్, కొచ్చిన్, గౌహతి, చండీగఢ్, అహ్మదాబాద్, లక్నో, ముంబైలు ఉన్నాయి. సత్వర న్యాయం ఇక్కడ ప్రధానాంశం. ఫిర్యాదు అందిన 3 నెలల్లో అంబుడ్స్‌మన్ అవార్డు (తీర్పు)ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన అవార్డులను కంపెనీలు తప్పనిసరిగా అమలు చేయాలి. పాలసీ హోల్డర్ ప్రయోజనాల పరిరక్షణ నిబంధనల ప్రకారం, ప్రతి బీమా కంపెనీ అధికారి సంబంధిత పాలసీ హోల్డర్‌కు తన కార్యాలయం ఏ ప్రాంత అంబుడ్స్‌మన్ పరిధిలోకి వస్తుందన్న అంశాన్ని తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. రెండు రకాల విధులు... వివాదానికి సంబంధించి రాజీ కుదర్చడం, ఇందుకు తగిన తీర్పును ఇవ్వడం ప్రధానాంశాలుగా బీమా అంబుడ్స్‌మన్ కార్యకలాపాలు ఉంటాయి. పాలసీ నిర్వహణకు సంబంధించి ప్రీమియం చెల్లింపులు నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకూ తన ప్రయోజనాలకు విఘాతం కలిగిందని భావించిన ప్రతి వినియోగదారు నుంచి అంబుడ్స్‌మన్ ఫిర్యాదు స్వీకరిస్తారు. అయితే అంబుడ్స్‌మన్ వివాద పరిష్కార పరిధి మొత్తం రూ.20 లక్షల లోపే అన్న విషయం ముఖ్యాంశం. ఫిర్యాదు పద్దతి ఇదీ... పాలసీదారు తన సమస్యను తన న్యాయ పరిధికి సంబంధించిన అంబుడ్స్‌మన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అయితే అంబుడ్స్‌మన్‌ను మొదటే నేరుగా సంప్రదించడానికి వీలులేదు. ఫిర్యాదు చేసే ముందు పాలసీదారు తన సమస్యను తొలుత తన బీమా కంపెనీ దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకువెళ్లాలి. నెలలోపు దీనిపై సంస్థ స్పందించాలి. ఈ కాలంలో ఫిర్యాదును తిరస్కరించినా, అసలు సమాధానం ఇవ్వకపోయినా, ఇచ్చిన సమాధానం సంతృప్తి పరచకపోయినా అంబుడ్స్‌మన్‌కు ఆయా అంశాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అయితే ఇలాంటి ఫిర్యాదు చేయడానికి యేడాదికన్నా ఎక్కువ సమయం తీసుకోకూడదు. అదే విధంగా చేసిన ఫిర్యాదు అంశం ఏ కోర్టులో కానీ లేదా వినియోగదారుల ఫోరం లేదా ఆర్బిట్రేటర్ వద్ద పెండింగులో ఉండకూడదు. తీర్పు ఇలా: సమస్య పరిష్కారంపై అంబుడ్స్‌మన్ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ నిర్ణయాన్ని (రికమండేషన్), అలాగే ఈ నిర్ణయానికి వచ్చిన పరిస్థితులనూ వివరాలతోసహా లిఖితపూర్వకంగా నెలలోపు వినియోగదారునికీ, బీమా కంపెనీకి తెలియజేస్తారు. సిఫారసు నచ్చితే ‘పరిష్కారాన్ని’ అంగీకరిస్తున్నట్లు సెటిల్ మెంట్ పత్రం అందిన 15 రోజుల లోపు లిఖితపూర్వకంగా అంబుడ్స్‌మన్‌కు తిరిగి తెలియజేయాలి. రికమండేషన్‌ను అంగీకరించకపోతే సమస్య పరిష్కారానికి వినియోగదారుల ఫోరం, కోర్టులు వంటి ఇతర తగిన న్యాయ వేదికలను ఆశ్రయించవచ్చు.