తెలిసే ఓకే అంటున్నారా!
బీమా రంగం గత దశాబ్ద కాలంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో మార్పులు, సంస్కరణలు సైతం అంతే వేగంగా ఉన్నాయి. ఇదే సమయంలో బీమా కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. ‘పాలసీ విషయంలో ఏజెంట్ మోసం చేశాడని కొందరు... తప్పుడు సమాచారం ఇచ్చాడని మరికొందరు... తనకొచ్చే కమిషన్‌పైనే దృష్టి పెట్టాడని ఇంకొందరు..’ ఇలా ఫిర్యాదులు రకరకాలుగా ఉంటున్నాయి.
తప్పెవరిది?
తీసుకున్న పాలసీ అవసరాలకు తగిన విధంగా లేదంటే తప్పెవరిది? తప్పంతా ఏజెంట్‌దేనా? అవగాహన లేకుండా, నియమ నిబంధనలు చూడకుండా పాలసీ కొనేసిన కస్టమర్‌కు ఇందులో పాత్రేమీ లేదా? వంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. రెండు దశాబ్దాల నుంచీ జీవిత బీమా రంగంలో ఉంటున్న నేను ఈ సందర్భంగా చెప్పేది ఒక్కటే. సంబంధీకులో లేక స్నేహితులో చెప్పారని వారిని సంతృప్తిపరచడం కోసం పాలసీ తీసుకోవడం లేదా పన్ను భారం తగ్గించుకోవడం కోసం అవగాహన లేకుండా ఏజెంట్ చెప్పిన పాలసీ తీసుకోవడం మంచిది కాదు. పాలసీ తీసుకునే ముందు వీటిని తప్పక పరిశీలించాలి.
1. విశ్వసనీయత: పాలసీ కొనుగోలుకు ముందు ఈ విషయంలో మీకు సలహాలు ఇస్తున్న ఏజెంట్ విశ్వసనీయతపై దృష్టి పెట్టాలి. ఏ బీమా సంస్థలో పనిచేస్తున్నాడు. వృత్తిపరంగా పూర్తి అవగాహన, సామర్థ్యం ఉన్న వ్యక్తేనా? అతని గుర్తింపు ఏమిటి? లెసైన్స్ ఉందా? ఇత్యాది అంశాలను పరిశీలించడం ముఖ్యం.
2. ఆర్థిక లక్ష్యాలు ఏమిటి? ఒక పాలసీ తీసుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యం, వ్యయాలు, అలవాట్లు, ఆదాయాల గురించి బాగా ఆలోచించాలి. ఆయా అంశాల ప్రాతిపదికన ఈ రంగంలో అపార అనుభవం కలిగిన ఏజెంట్ సలహా తీసుకోవాలి.
3. అవసరాలు ముఖ్యం: అవసరాలకు, ఇబ్బందులను అధిగమించడానికి అనుగుణంగా ఏ పాలసీ బెటరన్న అంశంపై చర్చించాలి. సాంప్రదాయ బీమా ప్రణాళిక మంచిదా? లేక యులిప్ బాగుంటుందా? యులిప్ అయితే మీకు పెట్టుబడికి తగిన ఫండ్ ఏది? ఇవన్నీ అవగాహనలో భాగం కావాలి.
4. తుది నిర్ణయం మీదే కావాలి: పాలసీ తీసుకోవడంలో తుది నిర్ణయం మీదే కావాలి. మీ అవసరాలు, బడ్జెట్‌కు తగిన బీమా ప్రణాళికపై ఒక ఏజెంట్ సలహా తరువాత ఆ తరహా ప్రొడక్ట్‌పై వివిధ బీమా సంస్థలు అందిస్తున్న ప్రయోజనాలు, ఆయా వివరాలను వెబ్‌సైట్లు లేదా ఇతర సాధనాలతో ధ్రువీకరించుకోవాలి.
5. ముఖ్య ప్రశ్నలు ఇవి..: బీమాకు ఎంత చెల్లించాలి? ఎంతకాలం చెల్లించాలి? సానుకూలతలు, ప్రతికూలతలు ఏమిటి? ఏ రైడర్లను జతకలుపుకోవచ్చు? ప్రీమియం చెల్లింపులు? అవకాశాలు ఏమిటి? వంటి ప్రశ్నలపై మీకుగా మీరు అవగాహనకు రావాలి. ఏజెంట్ నుంచే కాకుండా సంస్థ నుంచి సమాచారం పొందవచ్చు.
6. ప్రపోజల్ పత్రాన్ని మీరే నింపాలి: ఈ అంశాన్ని ఏజెంట్‌కు వదిలివేయడం మంచిదికాదు. వివరాలు ఇచ్చే విషయంలో మీ ఆరోగ్యం, ఆర్థిక, జీవన విధానం... ఇలా ఏ విషయంలోనూ తప్పుడు సమాచారం ఇవ్వకూడదు.
7. బాండ్ ఒరిజినల్స్‌ను పొందాలి: పాలసీ ఒరిజినల్ పత్రాలన్నింటినీ తెప్పించుకునే బాధ్యత మీదే. నిర్దిష్ట సమయంలో మీ ఏజెంట్ లేదా బీమా కంపెనీ నుంచి ఈ పత్రాలన్నింటి ‘హార్డ్ కాపీ’లను మీరు పొందగలగాలి.
8. సరిచూసుకోవాలి: బాండ్‌ను పూర్తిగా అధ్యయనం చేసి, అర్థం చేసుకోవాలి. మీ అవసరాలకు తగిన విధంగా పాలసీ ఉందా... లేదా అన్నది దీనితో స్పష్టమైపోతుంది. ఏవన్నా సందేహాలు ఉన్నా... ఇంకా చెప్పాలంటే పాలసీని విత్‌డ్రా చేసుకోవాలన్నా ‘ఫ్రీ లుక్ పీరియడ్’లో ఏజెంట్‌ను లేదా బీమా కంపెనీని వెంటనే సంప్రదించాలి.
9. నామినీకీ తెలియాలి: మీరు తీసుకునే పాలసీపై మీకు మాత్రమే చైతన్యం ఉంటే సరిపోదు. ఆయా అంశాలన్నింటిపై మీ నామినీకి కూడా మంచి అవగాహన కల్పించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. అప్పుడే మీరు తీసుకునే పాలసీకి సంబంధించి మీకు పూర్తి న్యాయం జరుగుతుంది. ప్రయోజనాలూ ఉంటాయి.
10. సకాలంలో ప్రీమియంలు: మీరు ఒకసారి పాలసీ తీసుకున్నారంటే... దానిని ఎట్టి పరిస్థితులలోనూ కొనసాగించేలా ఉండాలి. ప్రీమియంలు కట్టడం మానివేసి, దానిని మురిగిపోనీయవద్దు. ప్రీమియంలు సకాలంలో చెల్లించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.