లక్ష్యం.. మద్యాంధ్రప్రదేశ్
లక్ష్యం.. మద్యాంధ్రప్రదేశ్
Published Fri, Jul 7 2017 11:06 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య
కొత్తపేట : మద్యం దుకాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గమనిస్తుంటే రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకా అనే అనుమానం కలుగుతోందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వై.మాలకొండయ్య వ్యాఖ్యానించారు.శుక్రవారం ఆయన కొత్తపేటలో ఆ పార్టీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. మద్యం దుకాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, రాష్ట్ర రహదారుల స్థాయిని తగ్గించేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల రేపు జాతీయ రహదారులకు కేంద్రం నుంచి నిధులు తగ్గిపోవడం, అసలు వచ్చే పరిస్థితి లేకపోవడం జరుగుతాయన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి మద్యం తప్ప మరే మార్గం లేదా అని ప్రశ్నించారు. ఒక ప్రక్క నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని కాంక్షిస్తూ స్వచ్ఛభారత్ వంటి పథకాలు అమలు చేస్తుంటే మరో పక్క రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారించి ప్రజల అనారోగ్యానికి బాటలు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రహదారుల పక్కన మద్యం షాపుల విదానంపై పునరాలోచన చేయాలని కోరారు.
కాపులకు ఇచ్చిన హామీకి కట్టుబడాలి
ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేయాలని మాలకొండయ్య సూచించారు. ఇది సున్నితమైన అంశమని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవలసింది పోయి ఓటు బ్యాంకుల కోసం ఒకరిపై ఒకరిని రెచ్చకొట్టి పబ్బం గడుపుకునేలా వ్యవహరించడం తగదన్నారు. కాపు రిజర్వేషన్లు విషయంలో కమిటీ నిర్ణయానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వివిధ కుల కార్పొరేషన్ రుణాల విషయంలో జన్మభూమి కమిటీల ప్రమేయంతో ఎంతో మంది అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌ను తొలగించారన్నారు. ఎవరి డిమాండ్ల కోసం వారు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఇచ్చిన హామీని నెరవేర్చాలనే డిమాండ్‌తో కాపు ఉద్యమ నేత ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం తగదన్నారు. అవసరమైతే కాపు నాయకలతో చర్చించి సంతృప్తి పరిచేందుకు ధైర్యం చేయాలని మాలకొండయ్య సూచించారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా పవన్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు పాలాటి మాధవస్వామి, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు పాలూరి జయప్రకాష్‌నారాయణ, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు దొడ్డిపట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement