రెండో ఏడాది ఎలా?
జిల్లాలోని మెడికల్ కళాశాలకు రెండో సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టంభన తొలగడం లేదు. మొదటి విద్యా సంవత్సరానికి షరతులపై అనుమతి ఇచ్చిన ఎంసీఐ రెండో ఏడాది కొనసాగింపుపై మెలిక పెట్టింది. ఆకస్మిక పరిశీలన చేపట్టిన ఎంసీఐ బృందం ప్రధాన సమస్యలను ఎత్తి చూపుతూ అనుమతిని నిరాకరించింది. దీంతో కంగుతిన్న అధికారులు దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉండగా రెండవసారి పరిశీలన చేపట్టేందుకు ఎంసీఐ సిద్ధమైంది. మే మొదటి వారంలో ఎప్పుడైనా పరిశీలన చేపడతామని ఎంసీఐ బృంద సభ్యులు మెడికల్ కళాశాల అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించారు.
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ఆస్పత్రిలోని ఇంటెన్సీవ్ కార్డియాక్ కేర్ సెంటర్, పాథలాజికల్ క్లీనిక్ సక్రమంగా లేవని, మైక్రోబయోలాజీ విభాగంలో పైకప్పు ఉడిపోయే దశలో ఉందని కళాశాల ప్రారంభంలో ఎంసీఐ బృందం తన నివేదికలో పేర్కొంది. సెంట్రల్ ఫొటోగ్రాఫి యూని ట్, విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బందికి వసతి గృహాలు లేకపోవడం, గ్రంథాలయంలో అసౌకర్యాలపై బృం ద సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మొద టి సంవత్సరానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.
ఫిబ్రవరిలో మరోసారి వైద్య కళాశాలలో తనిఖీలు చేపట్టిన ఎంసీఐ బృంద సభ్యులు సౌకర్యా ల మెరుగులో ఎలాంటి పురోగతి కనిపించలేదని పేర్కొన్నారు.కళాశాలను కొనసాగించేందుకు అభ్యం తరం వ్యక్తం చేశారు. దీంతో రెండో సంవత్సరం వైద్య విద్యకు ఎంసీఐ నుంచి అనుమతి రాలేదు. ఈ పరిణామాలతో కంగుతిన్న జిల్లా అధికారులు కళాశాలతో వసతుల కల్పనపై దృష్టి సారించా రు. ఆస్పత్రి విభాగం అసౌకర్యాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, మెడికల్ కళాశాల సమస్యలపై కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకుంటున్నారు. వీరి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఎంసీఐ ఎత్తిచూపిన అంశాలను సమగ్రంగా పరిశీలించి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది వరకే గ్రంథాలయంలో 80 శాతం పుస్తకాలు అందుబాటులో ఉంచారు.
భవనాల నిర్మాణం, గదుల కేటాయింపు పూర్తిచేశారు. మరికొన్ని పనులను త్వరితగతిన పూర్తిచేయడానికి కృషిచేస్తున్నారు. ఎలాగైనా ఈసారి ఎంసీఐ బృందం సంతృప్తి చెందేలా..ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ఉండాలని అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండవ సంవత్సరం అనుమతి తప్పనిసరి అయినందున డెరైక్టర్ ఆఫ్ మెడికల్ కళాశాల అధికారులు సైతం ఇక్కడి లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రొఫెసర్ల గైర్హాజరు, వైద్య సిబ్బంది నియామకాలపై అధికారుల్లో ఆందోళన నెలకొంది. పలుమార్లు హెచ్చరించినా ప్రొఫెసర్లు విధులకు హాజరుకావడం లేదు.
ఎంసీఐ పరిశీలనలో ఇది కీలకమైన అంశంగా ఉంది. ఈ సమస్య పరిష్కారంపై వైద్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టిసారించారు. మే మొదటి వారంలోగా కళాశాల అభివృద్ధి పనులు పూర్తిచేయడానికి తీవ్రంగా కృషిచేస్తున్నారు. కాగా వైద్య కళాశాలలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు కూడా అనుమతిపై ఆందోళ నగా ఉన్నారు.
పనులు చేపట్టాం - జిజియాబాయి, కళాశాల ప్రిన్సిపాల్
మేలో ఎంసీఐ బృందం వస్తున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం. బృందం వచ్చేలోగా కళాశాల, ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తాం. అభివృద్ధి పనులను పూర్తిచేస్తాం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. తప్పనిసరి అనుమతి వస్తుందనే నమ్మకం ఉంది.