inter college tournment
-
జీసీపీఈ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో ప్రభుత్వ వ్యాయామ విద్య కాలేజి (జీసీపీఈ) జట్టు సత్తా చాటింది. కేశవ్ మెమోరియల్ డిగ్రీ కాలేజి (నారాయణగూడ) వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో జీసీపీఈ జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో జీసీపీఈ 11–10తో సిద్ధార్థ వ్యాయామ విద్య కాలేజి (ఇబ్రహీంపట్నం) జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భవన్స్ కాలేజి 16–8తో నిజాం కాలేజిపై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో జీసీపీఈ 14–5తో భవన్స్ కాలేజిపై, సిద్ధార్థ కాలేజి 13–4తో నిజాం కాలేజిపై ఘనవిజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎంఈ సొసైటీ సంయుక్త కార్యదర్శి బి. శ్రీధర్ రెడ్డి, కేఎంఐసీఎస్ ప్రిన్సిపాల్ జె. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంప్ జీఎన్ఐటీఎస్
దుండిగల్, న్యూస్‌లైన్: జేఎన్టీయూహెచ్ జోనల్ ఇంటర్ కాలేజి టోర్నమెంట్లో జీఎన్ఐటీఎస్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. ఇక్కడి మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు శనివారం ముగిశాయి. ఇందులో వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ జట్టు పురుషుల చాంపియన్‌గా, జీఎన్ఐటీఎస్ మహిళల చాంపియన్‌గా నిలిచాయి. క్రికెట్ పోటీల్లో 14 జట్లు పాల్గొనగా టీకేఆర్‌ఈసీ జట్టు టైటిల్ నెగ్గింది. ఫైనల్లో టీకేఆర్సీఈటీపై గెలుపొందింది. వాలీబాల్ పురుషుల విభాగంలో వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ, మహిళల విభాగంలో జీఎన్ఐటీఎస్ టైటిల్స్ గెలిచాయి. బాస్కెట్‌బాల్ పురుషుల విభాగంలో వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ, మహిళల విభాగంలో జీఎన్ఐటీఎస్ నెగ్గాయి. త్రోబాల్ మహిళల విభాగంలో జీఎన్ఐటీఎస్, టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో ఎంఎల్ఆర్ఐటీ (సింగిల్స్), జేఎన్టీయూ (డబుల్స్) జట్లు విజేతలుగా నిలిచాయి. మహిళల విభాగంలో జీఎన్ఐటీఎస్ (సింగిల్స్, డబుల్స్) గెలుపొందగా, షటిల్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో జేఎన్టీయూ (సింగిల్స్), వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ (డబుల్స్), మహిళల విభాగంలో వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ (సింగిల్స్, డబుల్స్) గెలిచాయి. విజేతలకు దుండిగల్ సీఐ బాలకృష్ణ, కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి బహుమతులు అందజేశారు. -
వారెవ్వా... లయోలా
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంటర్ కాలేజి టోర్నీ (‘బిట్స్’ ఓపెన్ స్పోర్ట్స్ మీట్)లో నగరానికి చెందిన లయోలా కాలేజి జట్టు సత్తా చాటింది. బిట్స్ పిలానీ (రాజస్థాన్)లో ఇటీవలే ముగిసిన ఈ టోర్నీలో లయోలా జట్టు వాలీబాల్ విజేతగా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి వాలీబాల్ చాంపియన్ కూడా అయిన లయోలా, ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయి టైటిల్ నెగ్గిన తొలి కాలేజి కావడం విశేషం. లీగ్ దశతో పాటు చివరి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా లయోలా జట్టు విజేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 25-17, 25-15, 25-19 స్కోరుతో ఐపీఎస్ అకాడమీ (చండీగఢ్)పై లయోలా విజయం సాధించింది. అంతకు ముందు సెమీఫైనల్లో లయోలా 25-17, 25-16, 25-19తో టోర్నీ ఫేవరేట్ బిట్స్ పిలానీ టీమ్‌ను ఓడించింది. బాస్కెట్‌బాల్‌లో కూడా మెరుగ్గా రాణించిన హైదరాబాద్ జట్టు సెమీఫైనల్లో ఓటమిని ఎదుర్కొంది. క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాళ్లతో నిండిన ఎస్ఆర్సీసీ-ఢిల్లీపై 79-67 స్కోరుతో సంచలన విజయం సాధించిన లయోలా... సెమీస్‌లో లక్ష్మీబాయి నేషనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ (గ్వాలియర్) చేతిలో 67-76 తేడాతో పరాజయంపాలైంది.