ఐటీ కోర్సుల్లో మేటి.. ఎంఎస్‌ఐటీ
జాబ్ మార్కెట్ డిమాండ్ మేరకు సాంకేతికంగా సమర్థులైన, పరిస్థితులకనుగుణంగా స్వీయ ప్రేరణతో ముందుకు సాగే వృత్తి నిపుణులను తయారు చేసే ఉద్దేశంతో రూపొందించిన కోర్సు.. ఎంఎస్‌ఐటీ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ).
ఎంఎస్‌ఐటీ.. రెండేళ్ల మల్టి యూనివర్సిటీ ఇంటర్ డిసిప్లినరీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఈ కోర్సును అమెరికాలోని కార్నెగీ మిలాన్ యూనివర్సిటీ సహకారంతో.. రాష్ట్రంలోని పలుయూనివర్సిటీలు కలిసి ఏర్పాటు చేసిన కన్సార్టియం ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (సీఐహెచ్ఎల్) అందిస్తుంది. 2014 సంవత్సరానికి ఎంఎస్‌ఐటీ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
ఎంఎస్‌ఐటీ సంప్రదాయ కోర్సులకు భిన్నమైంది. విద్యార్థి స్వతహాగా నేర్చుకునే విధంగా ఈ కోర్సును రూపొందించారు. జాబ్ మార్కెట్ కోరుకుంటున్న విధంగా ఇండస్ట్రీ రెడీగా ఉండేలా కరిక్యులంను రూపొందించారు. ఇందులో లెర్నింగ్ బై డూయింగ్ బోధన విధానాన్ని అనుసరిస్తారు. థియరీకాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ప్రాధాన్యం ఇస్తారు. ప్రాజెక్ట్ కేంద్రీకృతంగా సిలబస్ ఉంటుంది.
ఉద్దేశం:
ఇంజనీరింగ్ ఇతర సాంకేతిక కోర్సులను పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు లభించని విద్యార్థులు..కెరీర్ దృష్టి కోణంలో ఇతర టెక్నికల్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయా కోర్సులు కేవలం అదనపు ఆర్హతగా మాత్రమే మిగిలిపోవడం తప్ప ఏవిధంగాను ప్రయోజనకరంగా ఉండడం లేదు. దాంతోపాటు పరిశ్రమ ఆశిస్తున్న నైపుణ్యాలు కూడా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ ప్రస్తుత అవసరాలకనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ కోర్సు రూపకల్పన వెనక ప్రధాన ఉన్న ఉద్దేశం.
4 సెంటర్లు.. 380 సీట్లు:
ఎంఎస్ఐటీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు నిర్దేశించిన లెర్నింగ్ సెంటర్లలో ప్రవేశం కల్పిస్తారు. చేరిన లెర్నింగ్ సెంటర్ ఏ యూనివర్సిటీలో ఉంటుందో సదరు యూనివర్సిటీ డిగ్రీని ప్రదానం చేస్తుంది. వాటి వివరాలు..
కోర్సు ఇలా:
రెండేళ్ల ఈ కోర్సులో మినీ సెమిస్టర్ల విధానాన్ని అనుసరిస్తారు. ప్రతి మినీ సెమిస్టర్ ను ఎనిమిది వారాలపాటు నిర్వహిస్తారు. మొదటి సంవత్సరంలో ఆరు మినీ సెమిస్టర్లుంటాయి. రెండో సంవత్సరంలో ఆరు మినీ సెమిస్టర్లను నిర్వహిస్తారు. రెండో సంవత్సరంలో స్పెషలైజేషన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. బ్రాంచ్‌తో నిమిత్తం లేకుండా రెండో సంవత్సరంలో మొదటి మినీ అందరూ విద్యార్థులకు కామన్‌గా ఉంటుంది. ఈ సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫౌండేషన్ కోర్సును బోధిస్తారు. అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్స్: కంప్యూటర్ నెట్వర్క్స్, ఈ-బిజినెస్ టెక్నాలజీస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ అండ్ డేటా విజువలైజేషన్, ఎడ్యుకేషన్ టెక్నాలజీస్.
అర్హత: బీఈ/బీటెక్ (అన్ని బ్రాంచ్) లేదా తత్సమాన డిగ్రీ/పీజీ (కంప్యూటర్ సైన్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్) లేదా ఎంసీఏ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు: ప్రిపరేటరీ కోర్సు: రూ. 20,000
వార్షిక ఫీజు: రూ. 1,35,000
ప్రవేశ విధానం:
స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3 అనే మూడు దశల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. స్టేజ్-1లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గ్యాట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులు రెండో దశ స్టేజ్-2 లీజనింగ్ కాంప్రెహెన్షన్ అండ్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఇందులో లిజనింగ్ కాంప్రెహెన్షన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది (టోఫెల్ స్కోర్-79/120/ఐఈఎల్‌టీఎస్‌లో 6.0 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించిన విద్యార్థులకు మినహాయింపు,నిర్దేశించిన జీఆర్ఈ 302/3.5 స్కోర్ సాధించిన విద్యార్థులు నేరుగా స్టేజ్-2 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు). ఈ రెండు దశల్లో అర్హత సాధించిన విద్యార్థులకు మూడో దశ స్టేజ్-3 ప్రిపరేటరీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
రెండు విధాలుగా రాత పరీక్ష:
రాత పరీక్షకు రెండు విధాలుగా హాజరుకావచ్చు. అవి..1) వాక్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్, 2) రెగ్యులర్ ఎంట్రన్స్ టెస్ట్. రెండు విధాల్లోనూ పరీక్ష రాసే అవకాశం ఉంది. ఈ సమయంలో రెండు పరీక్షల్లోని బెస్ట్ స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. వాక్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్ విధానాన్ని ఎంచుకున్న విద్యార్థులు నిర్దేశించిన ఫీజును చెల్లించి, సంబంధింత చిరునామాలో ఈ పరీక్షకు హాజరుకావచ్చు. ఈ పరీక్షను ఏప్రిల్ 17 నుంచి మే 23 వరకు (మే 19,20,21,22 తేదీలతో కలిపి)..గురు, శుక్ర, శని, ఆది వారాల్లో నిర్వహిస్తారు. రెగ్యులర్ ఎంట్రన్స్‌కు ఆఫ్‌లైన్/ఆన్లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష ఇలా:
గ్యాట్ కంప్యూటర్ బే్‌స్డ్ టెస్ట్. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి రెండున్నర గంటల్లో సమాధానాలను గుర్తించాలి. మూడు విభాగాల్లోంచి ప్రశ్నలు ఇస్తారు. అవి..
1) క్వాంటిటేటివ్ ఎబిలిటీ: మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అభ్యర్థి ప్రాథమిక అవగాహనను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో 43 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో డిస్క్రిట్ కాంపారిజన్, డేటా అనాలిసిస్, క్వాంటేటివ్ కంపారిజన్, సెట్స్ వంటి ప్రధాన భాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటి ఉపవిభాగాలను పరిశీలిస్తే..డిస్క్రిట్ కాంపారిజన్ నుంచి స్టాటిస్టిక్స్, టైమ్ అండ్ వర్క్, రేషియో ప్రాపొర్షన్ అండ్ వేరియేషన్స్, టైమ్-స్పీడ్-డిస్టెన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. క్వాంటేటివ్ కంపారిజన్ నుంచి జ్యామెట్రీ, ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్ వంటి అంశాలు ఇస్తారు. డేటా ఇంటర్‌ప్రిటేషన్, సెట్స్ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు.
2) అనలిటికల్/లాజికల్ రీజనింగ్: విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని, తార్కిక ఆలోచనను ఉపయోగించి సమస్యకు ఒక పరిష్కారాన్ని ఏవిధంగా సాధిస్తారనే అంశాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో 29 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో లీనియర్ సీక్వెన్సెస్/అరేంజ్మెంట్స్, సర్క్యూలర్ అరేంజ్మెంట్స్, క్యాలెండర్స్, అసెండింగ్/డిసెండింగ్ ఆర్డర్, సిరీస్, క్యూబ్స్, లాజికల్ రీజనింగ్ వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
3) వెర్బల్ ఎబిలిటీ: అభ్యర్థి ఆంగ్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో 28 ప్రశ్నలు ఇస్తారు. సెంటెన్స్ కంప్లీషన్, అనాలజీ, రీడింగ్ కాంప్రెహెన్షన్, యాంటోనిమ్స్ సంబంధిత అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
ప్రిపరేటరీ కోర్సు:
ప్రవేశ ప్రక్రియలో మూడో దశలో ప్రిపరేటరీ కోర్సు ఉంటుంది. ఈ కోర్సు వ్యవధి ఎనిమిది వారాలు. ప్రిపరేటరీ కోర్సులో భాగంగా విద్యార్థులు పీసీని సొంతంగా రూపొందించడం, సాఫ్ట్వేర్-హార్డ్‌వేర్ ఇన్స్టాల్ చేయడం, అవసరమైన సమయంలో స్వతహాగా ట్రబుల్షూట్ నిర్వహించడం, ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్, బిజినెస్ ప్లాన్-సాఫ్ట్ స్కిల్స్ అంశాలు ఉంటాయి. నిర్దేశించిన విధంగా ఈ కోర్సును పూర్తి చేసిన వారికి మాత్రమే ఎంఎస్‌ఐటీ మెయిన్ కోర్సులో కొనసాగే అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు:
గ్యాట్‌కు ఆఫ్‌లైన్/ఆన్లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత రూ. 1,000 డీడీని నిర్దేశిత చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి. లేదా డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు. దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్లేస్‌మెంట్స్:
కోర్సులో చేరిన విద్యార్థులకు మంచి అవకాశం.. ప్లేస్‌మెంట్స్. గత బ్యాచ్ విద్యార్థులకు దాదాపు 100శాతం ప్లేస్‌మెంట్స్ లభించాయి. ఎంఎస్‌ఐటీ విద్యార్థుల కోసం టీసీఎస్, అమెజాన్, జేపీ మోర్గాన్, క్యాపిటల్ ఐక్యూ, ఎమర్సన్, ఐబీఎం జీబీఎస్, మోర్గాన్ అండ్ స్టాన్లీ, అవేవా, టిబ్కో వంటి ఎంఎన్‌సీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించాయి.
పరిశ్రమ కోరుకుంటున్న విధంగా విద్యార్థిని తీర్చిద్దిదేలా ఎంఎస్‌ఐటీ కరిక్యులం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థిని ఇండస్ట్రీ రెడీగా ఉంచడానికి ఈ కరిక్యులం ఎంతో దోహదం చేస్తుంది. ఈ క్రమంలో లెర్నింగ్ వైల్ డూయింగ్, స్టోరీ సెంటర్డ్ కరిక్యులం, ఇంటర్న్షిప్స్నకు పంపించడం వంటి వి విద్యార్థులు పరిశ్రమ ఆశిస్తున్న విధంగా ప్రాక్టీకల్ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి దోహదం చేస్తాయి. ఈ కోర్సుకు సంబంధించి గత నాలుగేళ్ల నుంచి 100 శాతం ప్లేస్మెంట్ సాధిస్తున్నాం.
-టి.వి. దేవిప్రసాద్,
ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్, ఐఐఐటీ-హైదరాబాద్
మిగతా పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల మాదిరిగా థియరటికల్ నాలెడ్జ్‌కు కాకుండా ఎంఎస్ఐటీలో ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు పెద్ద పీటవేస్తాం. ఈ క్రమంలో బోధనకు సంబంధించి లెర్నింగ్ వైల్ డూయింగ్ అనే భిన్నమైన పద్ధతిని అవలంబిస్తున్నాం. కోర్సు కరిక్యులం కూడా ప్రాజెక్ట్ కేంద్రీకృతంగా ఉంటుంది. ఈ కోర్సు సీక్వెన్సియల్ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరొకటి ఆరంభించే విధానం వల్ల విద్యార్థికి సంబంధిత భావనలపై అనుభవపూర్వకమైన పరిజ్ఞానం లభిస్తుంది. అంతేకాకుండా విద్యార్థుల్లో పరిశ్రమ ఆశిస్తున్న నైపుణ్యాలను పెంపొందించే విధంగా కోర్సుకు రూపకల్పన చేయడం జరిగింది. అనుభవజ్ఞులైప అధ్యాపకుల పర్యవేక్షణలో 21వ శతాబ్ధం ఆశించే సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ కూడా ఇస్తాం. LSRW (Listening, Speaking, Reading, Writing) నైపుణ్యాలపై పట్టు సాధించే విధంగా ఇన్ హౌజ్ శిక్షణను అందిస్తాం.
-ప్రొఫెసర్ మేడ శ్రీనివాస రావు,
డీన్, ఎంఎస్‌ఐటీ ప్రోగ్రామ్
సంప్రదాయ కోర్సులకు ఎంఎస్‌ఐటీ పూర్తిగా భిన్నమైంది. విద్యార్థి స్వతాహాగా నేర్చుకునే కోర్సును రూపొందించారు. ఈ విధానం ఉద్యోగంలో చేరిన కొత్తలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను స్వల్ప కాలంలో ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. ఐటీ కోర్సులతో సమాంతరంగా సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుస్తుంది.
- కెవల్ ఓరా
(రూ.11.8 లక్షలవార్షిక వేతనంతో మోర్గాన్ స్టాన్లీలో
ప్లేస్మెంట్ సాధించిన ఎంఎస్‌ఐటీ విద్యార్థి)
ముఖ్య తేదీలు
- వాక్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్ తేదీలు:
ఏప్రిల్ 17 నుంచి మే 23 వరకు.
- దరఖాస్తుకు (గ్యాట్) చివరి తేదీ: మే 12, 2014.
- రెగ్యులర్ రాత పరీక్ష తేదీ: మే 24, 2014.
- రాతపరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, అనంతపురం
- ఫలితాల వెల్లడి: జూన్ 2, 2014.
- స్టేజ్-2 కౌన్సెలింగ్: జూన్ 11, 2014
- ప్రిపరేటరీ కోర్సు ప్రారంభం: జూన్ 23, 2014
- మెయిన్ కోర్సు ప్రారంభం: ఆగస్ట్ 18, 2014
- ఈ-మెయిల్: enquiries2014@msitprogram.net
- వెబ్సైట్: www.msitprogram.net