కులాంతర పెళ్లిళ్ల రక్షణకు ప్రణయ్ చట్టం చేయాలి
హైదరాబాద్: కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న జంటల రక్షణ కోసం ప్రణయ్ చట్టం తీసుకురావాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఇటీవల చోటుచేసుకున్న ప్రణయ్ హత్యను నిరసిస్తూ శుక్రవారం ఇక్కడ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట దళిత, వామపక్ష, మైనార్టీ, విద్యార్థి జేఏసీ, బీసీ విద్యార్థి తదితర 30 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి ఆగ్రహసభ జరిగింది. ఈ సందర్భంగా కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. కులహత్యలపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రణయ్‌ను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమానికి మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, ఆల్ మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ అధ్యక్షత వహించగా తెలంగాణ ఇంటి పార్టీ అధినేత డాక్టర్ చెరుకు సుధాకర్‌తోపాటు జస్టిస్ చంద్రకుమార్, ప్రొ.కంచ ఐలయ్య, ప్రజాగాయకుడు గద్దర్, సామాజిక వేత్త ఉ.సా.ప్రజాగాయకురాలు విమలక్క, పీవోడబ్ల్యూవో నేత సంధ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, ప్రణయ్ తండ్రి బాలస్వామి, డాక్టర్ సూరెపల్లి సుజాత, కేవీపీఎస్ నేత స్కైలాబ్‌బాబు, ఆయా విద్యార్థి సంఘాల నేతలు వరంగల్ రవి, మాందాల భాస్కర్, పుల్లారావు యాదవ్, ఆర్ఎన్ శంకర్, రమేష్, మోడం రవి, బద్రీ, నలింగటి శరత్, గుడివల్లి రవి, దర్శన్, రంజిత్, ఆర్ఎల్ మూర్తి, జాన్ వెస్లీ, కొమ్ము శేఖర్, అశోక్‌యాదవ్, నాగేశ్వర్రావు, సత్య, గౌతమ్‌ప్రసాద్, అశోక్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. తొలుత కుల హత్యలకు గురైన వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల మౌనం పాటించి సభను ప్రారంభించారు. సభలో ప్రజాకళాకారుడు ఏపూరి సోమన్న పాటలు, మాటలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.