Inter question papers
-
ఇంటర్ ప్రశ్నాపత్రాలకు ఆన్లైన్ రక్షణ
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ అర్ధ వార్షిక పరీక్షల నిర్వహణకు బోర్డు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్ష పేపర్లు ఎక్కడా బయటకు రాకుండా గతేడాది అనుసరించిన విధానాలనే అమలు చేశారు. పరీక్షకు గంట ముందు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి సంబంధిత జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ లాగిన్‌కు ప్రశ్నాపత్రాలను విడుదల చేస్తున్నారు. వెంటనే ప్రిన్సిపల్ పాస్‌వర్డ్‌తో ఆన్లైన్లోని ప్రశ్నాపత్రాలను ప్రింట్ తీసి విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ పరీక్షలను ఇదే విధానంలో నిర్వహించగా, మంగళవారం నుంచి ప్రారంభమైన అర్ధ వార్షిక పరీక్షలకు కూడా ఇదే విధానం అమలు చేశారు. దీంతో ఎక్కడా లీక్ అనే సమస్యలు గానీ, ప్రశ్నాపత్రం బయటకు వెళ్లడం గానీ జరగదని బోర్డు అధికారులు చెబుతున్నారు. గత నాలుగేళ్లలో నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు ప్రశ్నాపత్రాలను ఆన్లైన్లోనే బోర్డు నుంచి గంట ముందు ప్రిన్సిపల్‌కు పంపిస్తే ప్రింట్ తీసి విద్యార్థులకు అందించేవారు. కాగా, విద్యార్థుల మార్కులను సైతం ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను ఈ ఏడాది నుంచి అమల్లోకి తెచ్చారు. గతంలో పబ్లిక్ పరీక్షలు మినహా, మిగిలిన పరీక్షల మార్కులను మాన్యువల్‌గా సంబంధిత కళాశాలలోనే నమోదు చేసేవారు, కానీ ఈసారి పరీక్షలు పూర్తయిన తర్వాత మార్కుల నమోదుకు విద్యార్థి వివరాలతో ప్రత్యేక ఆన్లైన్ ఫార్మేట్ అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంతో విద్యార్థి రాసిన అన్ని పరీక్షల వివరాలు, ప్రతిభా స్థాయి ఉన్నతాధికారులు కూడా పరిశీలించే అవకాశం కల్పించారు. -
ఇంటర్ ప్రశ్నపత్రాల పెట్టెలు మాయం
విద్యారణ్యపురి: వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో భద్రపర్చిన ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన రెండు పెట్టెలు మాయమయ్యాయి. బుధవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన చీఫ్ సూపరింటెండెంట్, కస్టోడియన్లకు ప్రశ్నపత్రాలను భద్రపర్చిన రెండు పెట్టెలు మాయమైన విషయం తెలిసింది. ఈ ఏడాది మార్చిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరిగాయి. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 23న రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి చెందిన విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు నుంచి వచ్చిన మూడు సెట్ల ప్రశ్నపత్రాలను 13 పెట్టెల్లో మిల్స్‌కాలనీ పోలీస్టేషన్లో బోర్డు అధికారులు భద్రపర్చారు. ఆ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో ఒక్కో సెట్‌ను మాత్రమే ఉపయోగించారు. మిగతా రెండు సెట్ల ప్రశ్నపత్రాలను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు వినియోగించడం కోసం పెట్టెల్లో అలాగే భద్రపరిచారు. ఈనెల 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రజిత, కస్టోడియన్లు పోలీస్టేషన్‌కు వెళ్లి పరిశీలించగా ప్రశ్నపత్రాలు కలిగిన 13 పెట్టెలలో రెండు పెట్టెలు కనిపించలేదు. దీంతో వారు ఇంటర్ విద్య డీఐఈఓ ఎం.లింగయ్య దృష్టికి తీసుకెళ్లారు. కాగా, హైదరాబాద్‌లోని బోర్డు నుంచి కూడా పలువురు అధికారులు ఈనెల 4న వచ్చి పోలీస్టేషన్లో పరిశీలించినట్లు సమాచారం. బుధవారం కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ రజిత వచ్చి మరోసారి పరిశీలించారు. రెండు పెట్టెలు తక్కువగా ఉండడంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రశ్నపత్రాల పెట్టెల గల్లంతుపై విచారణాధికారిగా ఏసీపీ నర్సయ్యను నియమించినట్లు డీసీపీ నర్సింహ తెలిపారు. ఇదిలా ఉండగా ఒకే గదిలో ఇంటర్, టెన్త్ పరీక్షల ప్రశ్నపత్రాలను పెట్టెల్లో భద్రపరిచారని, అందులో టెన్త్ పరీక్షల ప్రశ్నపత్రాల ఖాళీ పెట్టెలను సంబంధిత అధికారులు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొరపాటున ఇంటర్‌కు సంబంధించిన పెట్టెలు కూడా వారు తీసుకెళ్లారా అనేది తేలాల్సి ఉందని అంటున్నారు. -
ఇంటర్ ప్రశ్నపత్రం లీక్‌పై ఆగ్రహ జ్వాల
కోలారు : ప్రైవేట్ విద్యా సంస్థల ఒత్తిడికి తలొగ్గి ఇంటర్ ప్రశ్నపత్రాలు లీక్ చేయడాన్ని ఆగ్రహిస్తూ రైతు సంఘం పదాధికారులు గురువారం స్థానిక బస్టాండు సర్కిల్ వద్ద రాష్ట్ర విద్యాశాఖా మంత్రి కిమ్మనె రత్నాకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం పదాధికారులు మాట్లాడుతూ... ప్రశ్న పత్రాలను ముందుగానే లీక్ చేసి విద్యాశాఖ గ్రామీణ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే నారాయణగౌడ మాట్లాడుతూ... సంవత్సరం పొడవునా కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలు దీని వల్ల ప్రశ్నార్థకంలో పడిపోతుందని ఆరోపించారు. ఆందోళనలో బంగవాది నాగరాజగౌడ, ఏబీవీపీ మురళి, ఎంపీఎంసీ పుట్టరాజు, మరగల్ శ్రీనివాస్, బ్యాలహళ్లి చౌడేగౌడ, కల్వ మంజలి రాము శివణ్ణ, శంకరణ్ణ, ఎం హొసహళ్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి బాగేపల్లి : ద్వితీయ పీయూసీ రసాయన శాస్త్రం ప్రశ్నపత్రం మరోసారి లీక్ కావడంపై విద్యార్థులు ధర్నా నిర్వహించిన సంఘటన గురువారం పట్టణంలో జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఇక్కడి నేషనల్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. మార్చి 31న జరగాల్సిన ప్రశ్నపత్రం కూడా లీక్ కావడంపై వారు మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకూడదన్నారు. తక్షణం మంత్రి రాజీనామా చేయాలన్నారు. ఎస్ఐ భైర ఆందోళనకారుల వద్దకు చేరుకుని వారితో మాట్లాడి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.