రవాణాపన్నుపై న్యాయపోరాటం: ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ సర్కార్ పన్ను విధించడం సరికాదని ఏపీ రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. ఉమ్మడి రాజధాని కాబట్టి హైదరాబాద్కు రాకపోకలపై ఏపీకి కూడా హక్కుంటుందని చెప్పారు. శనివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఇది సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్య అని పేర్కొన్నారు. అయితే దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావట్లేదన్నారు. ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశామని, అయినా ఇప్పటికీ ఆయన స్పందించలేదని అన్నారు.
రవాణా మంత్రి మహేందర్ రెడ్డిని కూడా సంప్రదించామని, ఆయన చర్చలకు వచ్చేది లేదని చెప్పారని రాఘవరావు తెలిపారు. చర్చలకు రమ్మని మరోసారి ఆహ్వానిస్తున్నామని.. అప్పటికీ రాకుంటే న్యాయపోరాటం చేయాలన్నదానిపై ఆలోచిస్తామని ఆయన అన్నారు. శేషాచలం ఎన్కౌంటర్ వల్ల ఏపీ- తమిళనాడు మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయని, చెన్నైలో కొన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సులను తగలబెట్టారని చెప్పారు. దీనివల్ల ఆర్టీసీకి రూ. 2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందన్నారు. చర్చల కోసం రాష్ట్ర రవాణా అధికారులను తమిళనాడుకు పంపినట్లు ఆయన తెలిపారు.