రాజుకొంటున్న ‘ఇంటర్ ట్రేడింగ్’
సాక్షి, ముంబై: బీజేపీ-శివసేన పార్టీలు తాము చేసుకొన్న ఒప్పందాలనే ఉల్లఘిస్తున్నాయి. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రే, బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ మధ్య అప్పట్లో కుదుర్చుకున్న ‘ఇంటర్ ట్రేడింగ్’ వద్దు అనే ఒప్పందాన్ని ఇప్పటి నాయకులు పాటించడం లేదు. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కిరాకపోవడంతో వివాదం ముదురుతోంది. దీనికి తోడు శివసేన నుంచి బయటపడిన నాయకులను, కార్యకర్తలను బీజేపీ అక్కున చేర్చుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరే సూచనలు ఉన్నాయి.
ఇరు పార్టీల నుంచి బయటపడిన వారిని చేర్చుకోవద్దనే అంశంపై దివంగత నేతల మధ్య లిఖిత పూర్వకంగా ఒప్పందం జరిగింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా బీజేపీలో అసంతృప్తికి గురైన తర్వాత పార్టీ నుంచి బయట పడాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో బాల్ ఠాక్రేతో భేటీ అయి తాను శివసేనలో చేరాలనుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ వెంటనే మహాజన్ ఠాక్రేతో భేటీ అయి ‘ఇంటర్ ట్రేడింగ్’ వద్దు అని విజ్ఞప్తి చేశారు. దీంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఠాక్రే నిక్కచ్చితంగా పాటించారు.
తిలోదకాలు
కానీ ఇప్పటి నాయకులు ఇంటర్ ట్రేడింగ్ ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నాసిక్ జిల్లా నిఫాడ్ తాలూకాకు చెందిన కొందరు శివసేన పదాధికారులు, 200 మంది కార్యకర్తలను బీజేపీలో చేర్చుకున్నారు. బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే సమక్షంలో వీరంతా పార్టీలో చేరడం గమనార్హం. ఇటీవల శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన సేనా భవన్లో జరిగిన సమావేశంలో కూడా ఇరు పార్టీల నాయకులు ఇదే విషయంపై (శివసేన నుంచి బయటపడినవారిని బీజేపీలో, బీజేపీ నుంచి బయట పడిన వారిని శివసేనలోకి చేర్చుకోవద్దని) ఒప్పందం కుదుర్చుకున్నారు. పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ధులే నియోజక వర్గంలో శివసేనకు చెందిన సుభాష్ భామ్రేను బీజేపీలో చేర్చుకుని ఆ ఒప్పందాన్ని కాలరాసింది. అప్పట్లో ఇరు పార్టీల నాయకుల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాన్ని ముందుగా బీజేపీ అధిగమిస్తోందని శివసేన ఆరోపిస్తోంది. ఇప్పుడు బీజేపీ నుంచి బయటపడిన వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు మేమేందుకు వెనకడాలనే ప్రశ్నను శివసేన నాయకులు లేవనెత్తుతున్నారు.