Interiors
-
వారెవ్వా! రబ్బర్ ఫ్లోరింగ్.. ఇంటీరియర్‌లో నయా ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: ఇంటీరియర్‌లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆధునిక పోకడలు, అభిరుచుల మేరకు వైవిధ్యభరితమైన ఇంటీరియర్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా రబ్బర్ ఫ్లోరింగ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది ఇంటీరియర్ ప్రియులు గ్రానైట్, మార్బుల్స్, టైల్స్ బదులుగా రబ్బర్ ఫ్లోరింగ్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. గదికో రకంగా డిజైనింగ్ చేయిస్తున్నారు. సాధారణంగా రబ్బర్ ఫ్లోరింగ్ అనేవి జిమ్‌లు, క్రీడా మైదానాలలో వినియోగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇళ్లలోనూ ఈ తరహా ఫ్లోరింగ్‌ను కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి పిల్లల గదులలో రబ్బర్ ఫ్లోరింగ్‌ను వేయిస్తున్నాయి. పై అంతస్తులో పిల్లలు ఆడుకుంటే కిందికి శబ్దాలు వినిపించకుండా, కిందపడినా దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఈ రబ్బర్ ఫ్లోరింగ్‌ను ఎంపిక చేస్తున్నారు. తడిగా ఉంచే కిచెన్, బాత్రూమ్ వంటి ప్రాంతాలలో కూడా వీటిని వేసుకోవచ్చు. రబ్బర్ ఫ్లోరింగ్ ఉత్పత్తులు మ్యాట్స్, టైల్స్, రోల్స్ రూపంలో, విభిన్న శైలి రంగులలో, డిజైన్లలో లభ్యమవుతాయి. వీటికి దీర్ఘకాలం మన్నిక ఉంటుంది. సరిగ్గా నిర్వహణ చేస్తే 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి. ఇతర ఫ్లోరింగ్‌లతో పోలిస్తే చిరిగిపోవటం, పాడైపోవటం వంటివి చాలా తక్కువ. ఫంగస్ కూడా పట్టదు. ఇదీ చదవండి: చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు! -
ఆకాశంలో లివింగ్ రూమ్
విమానాల్లో బిజినెస్ క్లాస్ అంటేనే కాస్త పర్సనల్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ప్రయాణించేలా సీట్లు, ఇతర సౌకర్యాలుంటాయి. కానీ అచ్చం ఇంట్లో లివింగ్ రూమ్‌లోనే ఉన్నామా అనిపించేలా క్యాబిన్ డిజైన్ చేస్తే! టీవీ, కర్టెన్లు, కార్పెట్లు, ఇతరత్రా ప్రత్యేక సౌకర్యాలుంటే! ఇలాంటి అద్భుతమైన క్యాబిన్లను సియాటెల్‌కు చెందిన డిజైన్ కంపెనీ టియాగ్యు, టెస్లా, ఒక్లహోమాకు చెందిన ఎయిరోస్పేస్ కంపెనీ నోర్డామ్ కలిసి రూపొందించాయి. ఈ డిజైన్‌కు‘ఎలివేట్’ అని పేరు పెట్టాయి. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేశాయి. జర్మనీలోని హాంబర్గ్‌లో ఈ ఏడాది జూన్‌లో జరిగే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్‌పోలో ఈ డిజైన్లను ప్రదర్శించనున్నాయి. తక్కువలో ఎక్కువగా.. అద్భుతమైన వాల్ అటాచ్మెంట్స్, పెద్ద బెడ్ సైజు, లివింగ్ స్పేస్, వస్తువులు పెట్టుకునేందుకు స్థలం లాంటివి ప్రతి ప్రయాణికుడికి ఉండేలా డిజైన్ చేయడం ఇదే తొలిసారని ‘ఎలివేట్’ డిజైనర్లు తెలిపారు. ఈ ఇంటీరియర్‌కు విమానంలో ఎక్కువ స్థలం అవసరం ఏమీ ఉండదని, సీట్లు తగ్గించుకోవాల్సిన అవసరమూ రాదని చెప్పారు. పైగా డిజైన్‌లో వాడినవన్నీ తక్కువ బరువున్నవేనని వివరించారు. దీని వల్ల విమానంపై భారంపడదని, ఎక్కువ ఇంధనం ఖర్చవదని తెలిపారు. చిన్న విమానాల్లో కూడా ఎలివేట్ క్యాబిన్లను సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అందమైన క్యాబిన్లతో ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని అందించడానికి.. ఎక్కువ స్థలం ఉండేలా, సౌకర్యవంతంగా అనిపించేలా, ప్రైవసీ ఉండేలా ఎలివేట్‌ను డిజైన్ చేశామని చెప్పారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
కంటెయినర్ ఇళ్లొచ్చాయ్!
మొయినాబాద్(చేవెళ్ల)/కందుకూరు: చూడముచ్చటైన సోఫాలతో హాల్, అబ్బురపరిచే కిచెన్, బెడ్రూమ్లు, ఔరా అనిపించే ఇంటీరియర్. ఇది చాలా ఇళ్లలో ఉంటుంది కదా అని అనుకుంటున్నారా?. కానీ ఈ ఇళ్లు మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకునిపోవచ్చు. కొద్దిరోజులు విహారయాత్రలకు వెళ్లినా వీటిని మనతోనే తీసుకెళ్లొచ్చు. ఇవే కంటెయినర్ ఇళ్లు. ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వీటి నిర్మాణంవైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. ట్రెండ్‌కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం ఇలా మారుతోంది. కొన్నిచోట్ల ఆఫీసులుగా మారుతున్నాయి. బయటకు సాధారణంగానే కనిపించినా.. లోపల మాత్రం సకల హంగులు ఉంటున్నాయి. సులభంగా తరలింపు... రియల్టర్లు, డెవలపర్లు, బిల్డర్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా ఓ షెడ్ ఉండాలని భావిస్తున్నారు. చిన్న గది కట్టాలన్నా ఇటుకలు, ఇసుక, సిమెంటు, రేకులు తదితర సామగ్రి కావాలి. పని పూర్తయిన తరువాత దానిని కూల్చి వేయాల్సిందే. వీటికి ప్రత్యామ్నాయంగా కంటెయినర్లలో ఆఫీసులు ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిని సులభంగా తరలించే అవకాశం ఉండటంతో కూడా ఎక్కుమంది మొగ్గు చూపుతున్నారు. చదరపు అడుగుకు రూ.1,200... 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ప్రారంభించి 30/10, 40/10, 40/20, 40/8 ఇలా పలు కొలతల్లో కంటెయినర్ ఇళ్లు, కార్యాలయాలను తయారు చేసి ఇస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్లతో పాటు విద్యుత్, ఫ్యాబ్రికేషన్ తదితరాలను, ఫర్నిచర్, టాయిలెట్స్ సమకూర్చి అందజేస్తున్నారు. ఒక చదరపు అడుగు విస్తీర్ణం సుమారుగా రూ.1,200–1,500 వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. 20/10 కంటెయినర్ ఇల్లు ఏర్పాటుకు రూ.1.85–2.40 లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతోపాటు టాయిలెట్, ఫర్నిచర్‌కు అదనంగా మరో రూ.60 వేలు వరకు తీసుకుంటున్నారు. 40/10 కంటెయినర్ దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కానుంది. కంటెయినర్‌ను బట్టి దాని జీవితకాలం 20–30 ఏళ్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. కంటెయినర్ ఇళ్లు, ఆఫీసులను శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ పక్కన, నగరంలోని జీడిమెట్లలో తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆసక్తిని బట్టి తయారీ వినియోగదారుడి ఆసక్తి మేరకు వివిధ రకాల సైజుల్లో కంటెయినర్లను తయారు చేసి ఇస్తున్నాం. ఫాంహౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లతో పాటు ప్రాజెక్టుల వద్ద అవసరమైన ఆఫీస్ రూమ్‌లు, లేబర్ క్వార్టర్స్, టాయిలెట్లు, బాత్రూమ్లు తదితరాలను నిర్మించి ఇస్తున్నాం. సాధారణంగా మెటల్ మందం 1.2 మి.మీ., లోపల ఇన్సూలేషన్ 50 మి.మీ.తో ఇస్తాం. మందం పెరిగితే ధర పెరుగుతుంది. కంటెయినర్లో ఏర్పాటు చేసుకునే వసతుల్ని బట్టి ధర మారుతుంటుంది. ఆర్డర్ ఇచ్చిన వారం పది రోజుల్లో సరఫరా చేస్తాం. – కృష్ణంరాజు సాగి, నిర్వాహకుడు, ఆర్ఈఎఫ్ టెక్నాలజీస్, జీడిమెట్ల -
ఆకట్టుకునే.. సెలబ్రిటీల స్నానాల గదులు
గృహ నిర్మాంణంలో వాస్తుతో సమానంగా ఇంటీరియర్ డిజైన్ కూ ప్రాముఖ్యతను ఇస్తారు. అయితే ఇటీవల సంపన్నుల ఇళ్ళలోనే కాక సాధారణ ప్రజలు కూడ గృహ నిర్మాణంలో ఆకట్టుకునే ఇంటీరియర్ డెకరేషన్ కు లక్షలకు లక్షలు కుమ్మరిస్తున్నారు. ఇక సెలబ్రిటీల ఇళ్ళలో ఇంటీరియర్ గురించి వర్ణించడం కూడ కష్టమే. బెడ్ రూం నుంచి... బాత్రూం వరకూ ఇంట్లో ప్రతి అంశం ఆకట్టుకోవలసిందే. ఇటీవల విడుదలైన కొందరు ప్రముఖులు, సెలబ్రిటీల బాత్ రూమ్ ల ఇంటీరియర్ డెకరేషన్ ఫొటోలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. న్యూయార్క్ లోని హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్... ప్రపంచ ప్రఖ్యాత సెక్సీతార మార్లిన్ మన్రో... అపార్ట్ మెంట్లోని బాత్రూం... ఇంద్ర భవననాన్ని తలపిస్తోంది. పాలరాతి మెట్లమీద నల్లని జాకూజ్జీతో పాటు... అద్దాలు అమర్చిన గోడలు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి. తీర్చి దిద్దిన అలంకరణ... కనువిందు చేస్తోంది. అలాగే మాజీ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ సౌథింగ్టన్ ఓహియో హోమ్ లోని పైకప్పులు, గోడలు, గదుల్లోని ప్రతి అలంకరణకు తోడు.. బాత్రూం ఇంటీరియర్లు.... అతడి విలాసవంతమైన జీవితాన్ని బహిర్గత పరుస్తున్నాయి. 1980, 90 లమధ్య మైక్.. నివసించిన ఓహియో హోమ్ లోని రెస్ట్ రూం, బంగారపు వన్నెచిన్నెలద్దిన బ్రహ్మండమైన బ్లాక్ హాట్ టబ్, అద్దాల గోడలు, ఆకట్టుకునే డైజనర్ కిటికీలు అత్యున్నత సౌందర్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 1999 లో 49 ఏళ్ళ వయసున్న మైక్.. తన ఇంటిని అమ్మేసి లాస్ వెగాస్ లో నివసిస్తున్నాడు. ఆ తర్వాత అతడి ఇల్లు చర్చిగా రూపాంతరం చెందింది. కెనడాలోని ఓ ప్రైవేట్ ద్వీపంలో ఉన్న కెనడియన్ గాయని సెలిన్ డయాన్ అందమైన ఆరు బెడ్ రూమ్ ల ఇంట్లో ఉండే బాత్ రూం లోని టబ్.. బంగారు వన్నెలతో అలంకరించి ఉంది. అలాగే 47 ఏళ్ళ ఓ గాయకుడి ఇంట్లోని బాత్ టబ్ కూడ ఎర్రని రంగులో రిచ్ క్లాసిక్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ఐకానిక్ సినిమా స్టార్ కాథరిన్ హెప్ బర్న్ ఒకప్పటి లాస్ ఏంజిల్స్ మాన్షన్ లోని బాత్ రూం చూపరుల కళ్ళు మిరుమిట్లు గొలుపేట్టు చేస్తోంది. బాత్ రూమ్ లోని మార్బుల్ ఫ్లోర్, హాట్ టబ్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అలాగే ఫ్లోరిడాలోని పాప్ స్టార్ జాసన్ డెరూలో స్నానాల గది.. డినీస్ రిచర్డ్స్ లేడీస్ రూం, లివింగ్ రూం లా కనిపించే కెవిన్ కాస్టనర్ ఇంట్లోని బాత్ రూమ్ లు కూడ విభిన్న అలంకరణలు, ఆకట్టుకునే అందమైన గోడలు, క్లాసిక్ లుక్ నిచ్చే బాత్ టబ్ లతో కళ్ళు తిప్పుకోలేని సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇక న్యూయార్క్ లోని ప్రముఖ కళాకారుడు ఎడ్వర్డ్ హోపర్స్ వాష్ రూమ్... విక్టోరియా మాన్షన్ ను తలపిస్తుండగా.. బకింగ్ హామ్ షైర్ లో.. బ్రిటిష్ సినిమాల షూటింగ్ లకు తరచుగా వాడే.. జేమ్స్ బాండ్ స్టార్ రోగర్ మూరె ఇంట్లో కాంతులీనే తెల్లని బాత్ రూమ్ లు ఇంటీరియర్ డిజైన్లకే మోడల్స్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మాంఛెస్టర్ సిటీలోని ఇరవై ఏళ్ళ అతి చిన్న వయసైన సాకర్ స్టార్ రహీమ్ స్టెర్లింగ్ రెస్ట్ రూం ఏకంగా ఎందరికో కలల సౌధంగా కనిపిస్తుండటం ఇంటీరియర్ డిజైనింగ్ ప్రపంచాన్నే శాసిస్తోంది. వారి వారి ఇష్టాలకు అనుగుణంగా నిర్మించుకున్న ఇంటీరియర్ డిజైన్లు ప్రముఖులు, సెలబ్రిటీల అనుభూతులను, వారి విలాసవంతమైన జీవితాలను కళ్ళముందుంచుతున్నాయి. -
ఆర్ట్ ఫర్ హోమ్
అందమైన ఇంటికి మరిన్ని అందాలు అద్దాలని ఎవరికి మాత్రం ఉండదు. తమ కలల లోగిలిని కళల నెలవుగా మార్చుకోవాలని కోరుకునేవారు ఎందరో. ఇంటీరియర్స్‌కు భారీ మొత్తం వెచ్చించలేని వారికి టైట కళాకృతులు వరంగా మారాయి. తక్కువ బడ్జెట్లో గృహాన్ని కళల సీమగా మార్చేస్తున్నాయి. అందంగా తీర్చిదిద్దిన కుండలు.. మట్టితో మలచిన శిల్పాలు, బొమ్మలు, ఇతర అలంకరణ వస్తువులు టైట కళావైభవాన్ని నగరం ముందుంచుతున్నాయి. ధ్యానంలో ఉన్న బుద్ధ ప్రతిమ ఇంట్లో ప్రశాంతతను కలిగిస్తుంది. సూర్య భగవానుడి రూపం, కూర్మం, మీనం ప్రతిమలు వాస్తు సెట్ చేస్తాయనే నమ్మకం కొందరిది. ఉత్తరప్రదేశ్ నుంచి తరలివచ్చిన ఈ కళాకృతులు ప్రస్తుతం హైదరాబాదీల ఇళ్లలో కొలువుదీరుతున్నారుు. డిఫరెంట్ హ్యాంగింగ్స్, ఫొటో ఫ్రేమ్స్ అందరినీ అలరిస్తున్నాయి. ఇలా చేస్తారు ఈ కళాకృతుల తయారీకి కావాల్సిన మట్టిని నదులు, కాల్వల గట్ల నుంచి సేకరిస్తారు. దీనికి తగిన మోతాదులో నీరు, ఇసుక, గుర్రం లద్దె కలిపి బాగా మిక్స్ చేస్తారు. ఆ ముద్దను కుమ్మరి చక్రంపై ఉంచి కుండలను తయారు చేస్తారు. వివిధ ఆకారాల్లో ఉన్న కుండలైతే, తొలుత రెండు, మూడు భాగాలుగా చేసి వాటిని కలిపి అనుకున్న రీతిలోకి మలుస్తారు. తర్వాత వాటికి రంగులద్ది వన్నె తీసుకొస్తారు. ఇతర ప్రతిమలను, గృహోపకరణాలను అచ్చులలో వేసి రూపొందిస్తారు. సృజనాత్మకత, ఏకాగ్రత లేకపోతే ఈ బొమ్మలను అందంగా తీర్చిదిద్దలేం. - శ్రీనివాస్, విక్రేత, సుచిత్ర క్రాస్ రోడ్స్ విరివిగా అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన టైట కళాకృతుల అమ్మకాలు నగరంలో చాలా ప్రాంతాల్లో సాగుతున్నాయి. వంద రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు వివిధ ధరల్లో దొరుకుతున్నాయి. కేవలం గృహాలంకరణ వస్తువులే కాదు.. టైట ఫ్యాన్సీ ఐటమ్స్‌కు కూడా ఫుల్ క్రేజ్ ఉంది. గాజులు, లోలాకులు, నగలు ఇలా ఎన్నో వెరైటీలు మగువల మనసును దోచేస్తున్నాయి. - శిరీష చల్లపల్లి