వీఆర్ఓ, వీఆర్ఏల నోటిఫికేషన్ విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో 98 గ్రామ రెవెన్యూ అధికారి, 172 గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాల భర్తీ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారిగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిల్లా వాసులై ఉండడంతో పాటు కనీసం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు, ఈ ఏడాది జులై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగులకు 39 ఏళ్ల వయస్సు సడలింపు ఉందన్నారు.
ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగిన వారు కూడా అర్హులన్నారు. వీఆర్వో పరీక్ష 2014 ఫిబ్రవరి 2న ఉదయం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. గ్రామ రెవెన్యూ సహాయకుడి పోస్టుకు ఏ గ్రామానికి చెందిన వారు అక్కడే అర్హులన్నారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలన్నారు. 18 నుంచి 36 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు, మాజీ సైనిక ఉద్యోగులకు 39 ఏళ్ల వరకు అర్హులన్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 2న మధ్యాహ్నం ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ద్వారా మీ-సేవ, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా జనవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు రూ. 300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 150 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వికలాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అభ్యర్థులు పరీక్ష ఫీజును జనవరి 12లోగా చెల్లించాలన్నారు. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బోత్ ఆప్షన్ చేయించుకుంటే ఒకే సెంటర్లో రెండు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దరఖాస్తులను ఠీఠీఠీ.ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ లో నమోదు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాయవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 08455-272525కు సంప్రదించవచ్చన్నారు.