పాలపుంతలో భారీ అగాథం!
భూమిపై ఎడారులు ఉంటాయన్న విషయం మీకు తెలిసిందే.. అయితే అంతరిక్షంలోనూ ఎడారులు ఉంటాయా.. ఎడారిని పోలిన ప్రాంతం ఒకటి ఉందని అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు తేల్చారు. భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత మధ్యభాగంలో భారీ అగాథం ఉందని, నక్షత్రాలు, గ్రహాలు, ఇతర ఖగోళ శకలాలు ఏవీ ఈ ప్రాంతంలో లేవని గుర్తించారు.
ఈ ప్రాంతం దాదాపు 8వేల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉందని జపాన్, దక్షిణాఫ్రికా, ఇటలీలకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. కొన్ని కోట్ల సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో ఎలాంటి నక్షత్రమూ, గ్రహమూ కొత్తగా ఏర్పడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. పాలపుంత మధ్య భాంలో దాదాపు 150 కాంతి సంవత్సరాల వ్యాసం పరిధిలో కోటి నుంచి 30 కోట్ల సంవత్సరాల వయసున్న నక్షత్రాలు ఉన్నా... ఆ ప్రాంతం తరువాత ఈ నక్షత్ర ఎడారి ప్రాంతం విస్తరించి ఉందని సౌతాఫ్రికన్ లార్జ్ టెలిస్కోపు ద్వారా తాము జరిపిన పరిశీలనల ద్వారా ఇది స్పష్టమైందని వారు అంటున్నారు.