ముంబైలో ఒరాకిల్ క్లౌడ్ కాన్ఫరెన్స్
ముంబై: సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ వార్షిక అంతర్జాతీయ క్లౌడ్ కాన్ఫరెన్స్‌ను ముంబైలో నిర్వహించనుంది. మేకిన్ ఇండియా వీక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ గ్లోబల్ సీఈవో శాఫ్రా కాట్జ్ శనివారం ఈ విషయం వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధికంగా 35 ఏళ్లలోపు యువ జనాభా భారత్‌లోనే ఉందని, ఇక్కడ అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా నినాదాలు మార్మోగుతున్న ప్రస్తుత తరుణంలో టెక్నాలజీ సంస్థలు భారత్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు అత్యంత అనువైనదిగా కాట్జ్ పేర్కొన్నారు.
ఒరాకిల్ భారత్‌లో దాదాపు 40 కోట్ల డాలర్ల పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించిన నేపథ్యంలో కాట్జ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒరాకిల్ బెంగళూరులో అత్యాధునిక క్యాంపస్‌తో పాటు హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతీయ సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్లను ఒరాకిల్ ఏర్పాటు చేయనుంది. అలాగే ఏటా 5,00,000 పైచిలుకు భారతీయ విద్యార్థులకు శిక్షణనివ్వనుంది. ఇందుకు సంబంధించి ప్రధాని మోదీతో కాట్జ్ భేటీ అయ్యారు. భారత్‌లో దాదాపు పాతికేళ్లుగా ఒరాకిల్ కార్యకలాపాలు సాగిస్తోంది. అమెరికా కార్యాలయం తర్వాత అత్యధికంగా భారత్‌లోనే 40,000 మందికి పైగా ఉద్యోగులున్నారు.