the International Conference
-
ప్రశ్నించడమే పురోగతికి సోపానం
చర్చల ద్వారా నేనూతన ఆలోచనలు ఇండోర్ ప్రొఫెసర్ ప్రకాశ్ ‘గీతం’లో మూడురోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభం పటాన్చెరు: ప్రశ్నించడమే పురోగతికి సోపానమని ఇండోర్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రొఫెసర్ ప్రకాశ్ డి.వ్యవహారి అన్నారు. వివిధ అంశాలపై ఒకరితో మరొకరు చర్చిస్తేనే నూతన ఆలోచనలు వస్తాయన్నారు. రుద్రారంలోని గీతం వర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌లో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. వైర్లెస్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ పేరిట నిర్వహిస్తోన్న సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ పరి శోధకులు హాజరయ్యారు. ఈ సందర్భం గా ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన జీవనాన్ని అందించేందుకు ఇంజినీర్లు నవకల్పనలు చేయాలన్నారు. విద్యుత్, మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు లేని వారు కూడా సెల్ఫోన్లను వినియోగిస్తున్నారని వివరించారు. ప్రజలు సులువుగా వినియోగించగల చౌకగా లభించే ఉపకరణాల తయారీకి యువ ఇంజినీర్లు పూనుకోవాలని మరో వక్త ప్రొ.ప్రకాశ్ సూచించారు. పరిశోధన అనేది జీవనాడి వంటిదని ఆత్మీయ అతి థి ప్రొ. వివేక్ ఎస్ దేశ్‌పాండే అభిప్రాయపడ్డారు. పక్షుల ద్వారా సమాచారం చేరేవేసే దశ నుంచి మొదలైన కమ్యూనికేషన్ల వ్యవస్థ ఐదు దశాబ్దాల్లో చెప్పుకోదగ్గ పురోభివృద్ధి సాధించిందని గీతం వర్సిటీ ప్రొ. వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం మనం గ్రహాల మధ్య సమాచారాన్ని మార్పిడి చేసుకునే దశలో ఉన్నామన్నా రు. అదే సమయంలో సిగ్నళ్లు సరిగ్గా అందకపోవడం, మేఘాలు, సోలార్ రేడియేషన్ వంటి వాటివల్ల అవరోధాలను ఎదుర్కొంటున్నామన్నారు. ఆ సవాళ్లను అధిగమించేలా పరిశోధనలు సాగాలని సూచించారు. ఐట్రిపుల్ఈ, ఐట్రిపుల్ఈ ఫొటోనిక్స్ సొసైటీ, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ) సౌజన్యంతో గీతం విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఈ సదస్సులో సీఎస్ఈ విభాగాధిపతి ప్రొ. ఎస్.ఫణికుమార్, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ డి.నిఖితతోపాటు మొత్తం 160 మంది పత్ర సమర్పణ చేయగా 40 పత్రాలను ఆమోదించి ప్రచురించిన సీడీని ముఖ్యఅతిథి ఆవిష్కరించారు. -
విశాఖ మదిలో కలాం
ఏయూక్యాంపస్ : క్షిపణి యోధుడు అబ్దుల్ కలాంకు విశాఖ నగరంతో, ప్రధానంగా ఆంధ్రవిశ్వవిద్యాలయంతో ఎనలేని అనుబంధం ఉంది. కలామ్ ఆంధ్ర విశ్వకళామతల్లి ముద్దుబిడ్డ. ఇది అక్షర సత్యం. 2000 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను కలాంకు అందించి విశ్వవిద్యాలయం తనను తాను సత్కరించుకుంది. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ హోదాలో ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా హాజరై కలాం స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. సాధారణ వ్యక్తిగా నలుగురిలో ఒక్కడిగా ఎటువంటి ఆడంబరాలు లేకుండానే ఆయన నాడు ఏయూకు వచ్చారు. ఆచార్య ఆర్.రాధాకృష్ణ ఉపకులపతిగా నిర్వహించిన 65వ స్నాతకోత్సవ సంబరంలో ఆయన డి.ఎస్సీని అందుకున్నారు. స్నాతకోత్సవ మందిరం అంతా యువతతో కిక్కిరిసి పోయింది. అదే స్ఫూర్తితో ఆయన నాడు తన ప్రసంగంతో యువతరాన్ని దిశానిర్ధేశం చేశారు. మరో పర్యాయం ఆ శాస్త్రవేత్తకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఆంధ్రవిశ్వవిద్యాలయానికి 2010 ఆగష్టు 14న లభించింది. రాష్ట్రపతిగా తన పదవీకాలం ముగిసిన తరువాత మరలా సాధారణ పౌరుడిగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఆయన అడుగుపెట్టారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన మరో పర్యాయం స్నాతకోత్సవ మందిరం సాక్షిగా విశ్వవిద్యాలయం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాటి వీసీ ఆచార్య బీల సత్యనారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డిలు ఆయనకు వర్సిటీ చిహ్నాన్ని బహూకరించగా ఆయన దానిని మురిపెంగా అందుకున్నారు. నాటి ప్రసంగం యువతను మంత్రముగ్ధులను చేసింది. ఏయూ సైకాలజీ విభాగం, జపాన్ సంయుక్తంగా 2009 లో జెరంటాలజీపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘యూత్ ఈజ్ ఏ గిఫ్ట్-ఏజ్ ఈజ్ ఏన్ ఆర్ట్’ అనే అంశంపై ప్రసంగించారని సైకాలజి విభాగాధిపతి ఆచార్య ఎం.వి.ఆర్ రాజు తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. కలాం మరణం తీరని లోటు... కలాం వంటి గొప్ప అణు శాస్త్రవేత్తను భారతదేశం కోల్పోయింది. ఆయన మరణం తీరని లోటు. ఆయన హయాంలో భారతదేశ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో మారుమోగింది. - చింతకాయల అయ్యన్నపాత్రుడు,రాష్ట్ర మంత్రివర్యులు భారత్‌కి రత్నమే... అబ్దుల్‌కలామ్ భారతదేశానికి రత్నమే. అటువంటి మహనీయుడు భారత్‌లో పుట్టడం గర్వకారణం. నిరాడంబర జీవితాన్ని గడిపి. తన మేధాశక్తితో దేశానికి ఎంతో గొప్ప సేవలందించిన మహనీయుడు అబ్దుల్ కలామ్. ఆయన లేని లోటు తీర్చలేనిది. - గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి మార్గదర్శి ఇక లేరు... భారత మార్గదర్శి ఇక లేరు...ఆయన మృతి విద్యార్థిలోకానికి తీరని లోటు.. సైంటిస్టుగా, రాష్ట్రపతిగా సమర్థవంతంగా దేశానికి సేవలందించిన మహనీయుడు ఇకలేరు అనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాం. - కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ రక్షణ కవచం... దేశానికి రక్షణ కవచంగా ఆయన సేవలు చిరస్మరణీయమైనవి. దేశానికి రక్షణ కల్పించడంలో ఆధ్యుడు, తొలి క్షిపణిని దేశానికి అందించిన దేశ భక్తుడు. ఆయన మరణం దేశానికే తీరని లోటు.శాస్త్రవేత్తగా యువతకు స్ఫూర్తిదాయకుడు. -డాక్టర్ కంభంపాటి హరిబాబు, పార్లమెంట్ సభ్యుడు. దిగ్భాంతికి గురిచేసింది మేధోసంపత్తు ఉన్న ఓ మహనీయుడిని దేశం కోల్పోయింది. రాష్ట్రపతిగా దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో కొనియాడేలా కృషిచేసిన అబ్దుల్ కలామ్ సేవలు భరతజాతి ఎప్పుడూ మరువలేదు. అలాంటి నేత మరణం తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది. -టి.సుబ్బరామిరెడ్డి రాజ్యసభ సభ్యుడు యువతకు స్ఫూర్తి శాస్త్రవేత్తగా దేశానికి ఎనలేని సేవలు అందించినా యువతను శక్తిగా తీర్చిదిద్దడానికి నిరంతరం పరితపించే వారు. విశాఖ నగరానికి రావడం, ప్రధానంగా ఏయూకు పలు పర్యాయాలు రావడం ఎంతో గర్వకారణం. దేశ శాస్త్ర విజ్ఞాన రంగానికి కలాం లేని లోటు అపారం. -ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు, ఉపకులపతి దేశభక్తుడిని కోల్పోయాం మేధస్సుతో దేశాన్ని ముందుకు నడిపంచగలమని కలాం రుజువు చేశారు. తన జీవిత సర్వస్వం దేశ అభ్యున్నతికి వినియోగించారు. రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ చిన్నారులతో, యువతతో ఆయన గడపడానికి ఇష్టపడేవారు. కలాంను ఆదర్శంగా తీసుకుని ఎందరో యువత ఉన్నతంగా రాణించారు. -ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, రిజిస్ట్రార్ ‘ప్రత్యేక’ అతిథిగా... విశాఖపట్నం : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉంది. రాష్ట్రపతి హోదాలో, అనంతరం మాజీ రాష్ట్రపతి హోదాలోనూ ఆయన విశాఖను సందర్శించారు. రాష్ట్రపతిగా తొలిసారి ఆయన 2006 ఫిబ్రవరి 12న వైజాగ్ వచ్చారు. భారత నావికాదళం తొమ్మిదో ఫ్లీట్ రివ్యూకు ప్రత్యేక అతిథిగా ఆయన హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఆయన విశాఖలోనే గడిపారు. ఐఎన్ఎస్ డేగా (విమానాశ్రయం) నుంచి నేవీ ఆడిటోరియం సముద్రికలో జరిగిన తొలి సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి డాల్ఫిన్నోస్పైకి వెళ్లి అక్కడ నుంచి ఆర్కే బీచ్‌లో విన్యాసాల కోసం ఉంచిన యుద్ధనౌకలను వీక్షించారు. నేవీ విన్యాసాలను తిలకించారు. ఆ మర్నాడు ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో ఐదు కిలోమీటర్ల మేర సముద్రంలో ప్రయాణించారు. అందులోనే సిబ్బందినుద్దేశించి ప్రసంగించారు. నగరంలోని కేర్ ఆస్పత్రిని సందర్శించారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి పిల్లలతో ముచ్చటించారు. ఫ్లీట్ రివ్యూను ముగించుకుని ఫిబ్రవరి 14న ఢిల్లీ వెళ్లిపోయారు. మాజీ రాష్ట్రపతి హోదాలో కలాం మార్చి 13, 2009లో మరోసారి విశాఖ వచ్చారు. ఎంవీపీ కాలనీలోని సత్యసాయి విద్యావిహార్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ చిన్నారులతో సరదాగా గడిపారు. -
కరాచీ సదస్సుకు ఐజేయూ ప్రతినిధులు
హైదరాబాద్: ‘వన్ వరల్డ్-వన్ మీడియా’ అనే అంశంపై పాకిస్తాన్‌లోని కరాచీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ప్రతినిధులు హాజరుకానున్నారు. అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలంటూ పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (పీఎఫ్‌యూజే) నుంచి ఐజేయూకు ఆహ్వానం అందింది. దీంతో ఈ సదస్సుకు ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, కోశాధికారి షబీనా ఇందర్జీత్లను పంపాలని నిర్ణయించినట్లు యూనియన్ నాయకుడు కె. అమర్నాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెల 1 నుంచి 4 వరకు జరిగే ఈ సదస్సుకు ఆసియా, ఆఫ్రికా, యూరోప్, అమెరికాతో పాటు దాదాపు 15 దేశాలకు చెందిన జర్నలిస్టు ప్రతినిధులు, వివిధ యూనియన్ల నేతలు పాల్గొంటారు. -
సిటీలో పెరుగుతున్న హృద్రోగులు
12 శాతం మందికి గుండె వ్యాధులు 2020 నాటికి మూడు రెట్లు పెరిగే అవకాశం అంతర్జాతీయ సదస్సులో నిపుణుల వెల్లడి సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మంది హృద్రోగాలతో బాధపడుతున్నారని.. 2020 నాటికి బాధితుల సంఖ్య మూడు రెట్లు పెరిగే అవకాశముందని హృద్రోగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒక్క హైదరాబాద్‌లోనే 12 శాతం మంది హృద్రోగాలతో బాధపడుతున్నారని వారు పేర్కొన్నారు. యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, క్లీవ్‌లాండ్ క్లినిక్‌లు సంయుక్తంగా హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన నాలుగో అంతర్జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. డాక్టర్ వి.రాజశేఖర్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి యశోద ఎండీ జీఎస్‌రావు ముఖ్య అతిథిగా హాజరుకాగా... క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వైద్య నిపుణులు సమీర్ కపాడియా, రన్డాల్స్ట్రార్లింగ్, బ్రయన్ గ్రిఫిన్, మణిదీప్ భార్గవ్, మురాత్ టస్కు, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రస్తుతం ప్రతి ఐదుగురు హృద్రోగ బాధితుల్లో ఒకరు త్వరగా మత్యువాత పడుతుండగా.. మరో ఐదేళ్లలోఆ సంఖ్య ప్రతి ముగ్గురిలో ఒకరికి చేరే అవకాశం ఉందని చెప్పారు. బాధితుల్లో 65 శాతం పురుషులు ఉంటే, 35 శాతం మహిళలు ఉన్నారని.. కానీ, పురుషులతో పోలిస్తే మహిళ ల్లోనే ఆకస్మిక మరణాల రేటు ఎక్కువని పేర్కొన్నారు. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన సుమారు 400 మంది హృద్రోగ నిపుణులు పాల్గొని... ఎఫ్ఎఫ్ఆర్, వీఐయూఎస్, ఓసీటీ, హార్ట్ ఫెయిల్యూర్, సీఏడీ, స్టంట్స్ వంటి అత్యాధునిక హృద్రోగ చికిత్సలపై చర్చించారు. ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి ఎండీ జీఎస్ రావు మాట్లాడుతూ.. తమ ఆస్పత్రిలో ఇప్పటికే మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేస్తున్నట్లు చెప్పారు. కాలేయ మార్పిడి, బోన్‌మారో ట్రాన్స్ప్లాంటేషన్లను కూడా త్వరలోనే చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మధుమేహ రాజధానిగా మారుతున్న హైదరాబాద్‌లో భవిష్యత్తులో హృద్రోగుల సంఖ్య పెరగనుందని డాక్టర్ వి.రాజశేఖర్ పేర్కొన్నారు. మారిన జీవనశైలి, అధిక బరువు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా.. పాతికేళ్లకే గుండె జబ్బుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. కాగా.. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు వహించి, విధిగా వ్యాయామం చేస్తే గుండె వ్యాధులను నివారించవచ్చని డాక్టర్ సమీర్ కపాడియా చెప్పారు. ఒకసారి వేడి చేసిన నూనెలను మళ్లీమళ్లీ మరిగిస్తూ ఉపయోగించడం వల్ల కొవ్వు రెట్టింపు స్థాయిలో ఉత్పత్తి అవుతుందని.. ఇది ఊబకాయానికి దారి తీస్తుందని డాక్టర్ టి.శశికాంత్ తెలిపారు.