ప్రశ్నించడమే పురోగతికి సోపానం
- చర్చల ద్వారా నేనూతన ఆలోచనలు
- ఇండోర్ ప్రొఫెసర్ ప్రకాశ్
- ‘గీతం’లో మూడురోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
పటాన్‌చెరు: ప్రశ్నించడమే పురోగతికి సోపానమని ఇండోర్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రొఫెసర్ ప్రకాశ్ డి.వ్యవహారి అన్నారు. వివిధ అంశాలపై ఒకరితో మరొకరు చర్చిస్తేనే నూతన ఆలోచనలు వస్తాయన్నారు. రుద్రారంలోని గీతం వర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌లో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. వైర్‌లెస్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్ పేరిట నిర్వహిస్తోన్న సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ పరి శోధకులు హాజరయ్యారు. ఈ సందర్భం గా ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన జీవనాన్ని అందించేందుకు ఇంజినీర్లు నవకల్పనలు చేయాలన్నారు. విద్యుత్, మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు లేని వారు కూడా సెల్‌ఫోన్లను వినియోగిస్తున్నారని వివరించారు. ప్రజలు సులువుగా వినియోగించగల చౌకగా లభించే ఉపకరణాల తయారీకి యువ ఇంజినీర్లు పూనుకోవాలని మరో వక్త ప్రొ.ప్రకాశ్ సూచించారు. పరిశోధన అనేది జీవనాడి వంటిదని ఆత్మీయ అతి థి ప్రొ. వివేక్ ఎస్ దేశ్‌పాండే అభిప్రాయపడ్డారు. పక్షుల ద్వారా సమాచారం చేరేవేసే దశ నుంచి మొదలైన కమ్యూనికేషన్ల వ్యవస్థ ఐదు దశాబ్దాల్లో చెప్పుకోదగ్గ పురోభివృద్ధి సాధించిందని గీతం వర్సిటీ ప్రొ. వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం మనం గ్రహాల మధ్య సమాచారాన్ని మార్పిడి చేసుకునే దశలో ఉన్నామన్నా రు. అదే సమయంలో సిగ్నళ్లు సరిగ్గా అందకపోవడం, మేఘాలు, సోలార్ రేడియేషన్ వంటి వాటివల్ల అవరోధాలను ఎదుర్కొంటున్నామన్నారు. ఆ సవాళ్లను అధిగమించేలా పరిశోధనలు సాగాలని సూచించారు. ఐట్రిపుల్‌ఈ, ఐట్రిపుల్‌ఈ ఫొటోనిక్స్ సొసైటీ, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్‌ఐ) సౌజన్యంతో గీతం విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఈ సదస్సులో సీఎస్‌ఈ విభాగాధిపతి ప్రొ. ఎస్.ఫణికుమార్, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ డి.నిఖితతోపాటు మొత్తం 160 మంది పత్ర సమర్పణ చేయగా 40 పత్రాలను ఆమోదించి ప్రచురించిన సీడీని ముఖ్యఅతిథి ఆవిష్కరించారు.