విశాఖ మదిలో కలాం
ఏయూక్యాంపస్ : క్షిపణి యోధుడు అబ్దుల్ కలాంకు విశాఖ నగరంతో, ప్రధానంగా ఆంధ్రవిశ్వవిద్యాలయంతో ఎనలేని అనుబంధం ఉంది. కలామ్ ఆంధ్ర విశ్వకళామతల్లి ముద్దుబిడ్డ. ఇది అక్షర సత్యం. 2000 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను కలాంకు అందించి విశ్వవిద్యాలయం తనను తాను సత్కరించుకుంది. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ హోదాలో ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా హాజరై కలాం స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. సాధారణ వ్యక్తిగా నలుగురిలో ఒక్కడిగా ఎటువంటి ఆడంబరాలు లేకుండానే ఆయన నాడు ఏయూకు వచ్చారు. ఆచార్య ఆర్.రాధాకృష్ణ ఉపకులపతిగా నిర్వహించిన 65వ స్నాతకోత్సవ సంబరంలో ఆయన డి.ఎస్సీని అందుకున్నారు. స్నాతకోత్సవ మందిరం అంతా యువతతో కిక్కిరిసి పోయింది. అదే స్ఫూర్తితో ఆయన నాడు తన ప్రసంగంతో యువతరాన్ని దిశానిర్ధేశం చేశారు.
మరో పర్యాయం ఆ శాస్త్రవేత్తకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఆంధ్రవిశ్వవిద్యాలయానికి 2010 ఆగష్టు 14న లభించింది. రాష్ట్రపతిగా తన పదవీకాలం ముగిసిన తరువాత మరలా సాధారణ పౌరుడిగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఆయన అడుగుపెట్టారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన మరో పర్యాయం స్నాతకోత్సవ మందిరం సాక్షిగా విశ్వవిద్యాలయం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాటి వీసీ ఆచార్య బీల సత్యనారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డిలు ఆయనకు వర్సిటీ చిహ్నాన్ని బహూకరించగా ఆయన దానిని మురిపెంగా అందుకున్నారు. నాటి ప్రసంగం యువతను మంత్రముగ్ధులను చేసింది.
ఏయూ సైకాలజీ విభాగం, జపాన్ సంయుక్తంగా 2009 లో జెరంటాలజీపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘యూత్ ఈజ్ ఏ గిఫ్ట్-ఏజ్ ఈజ్ ఏన్ ఆర్ట్’ అనే అంశంపై ప్రసంగించారని సైకాలజి విభాగాధిపతి ఆచార్య ఎం.వి.ఆర్ రాజు తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
కలాం మరణం తీరని లోటు...
కలాం వంటి గొప్ప అణు శాస్త్రవేత్తను భారతదేశం కోల్పోయింది. ఆయన మరణం తీరని లోటు. ఆయన హయాంలో భారతదేశ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో మారుమోగింది.
- చింతకాయల అయ్యన్నపాత్రుడు,రాష్ట్ర మంత్రివర్యులు
భారత్‌కి రత్నమే...
అబ్దుల్‌కలామ్ భారతదేశానికి రత్నమే. అటువంటి మహనీయుడు భారత్‌లో పుట్టడం గర్వకారణం. నిరాడంబర జీవితాన్ని గడిపి. తన మేధాశక్తితో దేశానికి ఎంతో గొప్ప సేవలందించిన మహనీయుడు అబ్దుల్ కలామ్. ఆయన లేని లోటు తీర్చలేనిది.
- గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి
మార్గదర్శి ఇక లేరు...
భారత మార్గదర్శి ఇక లేరు...ఆయన మృతి విద్యార్థిలోకానికి తీరని లోటు.. సైంటిస్టుగా, రాష్ట్రపతిగా సమర్థవంతంగా దేశానికి సేవలందించిన మహనీయుడు ఇకలేరు అనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాం.
- కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్
రక్షణ కవచం...
దేశానికి రక్షణ కవచంగా ఆయన సేవలు చిరస్మరణీయమైనవి. దేశానికి రక్షణ కల్పించడంలో ఆధ్యుడు, తొలి క్షిపణిని దేశానికి అందించిన దేశ భక్తుడు. ఆయన మరణం దేశానికే తీరని లోటు.శాస్త్రవేత్తగా యువతకు స్ఫూర్తిదాయకుడు.
-డాక్టర్ కంభంపాటి హరిబాబు,
పార్లమెంట్ సభ్యుడు.
దిగ్భాంతికి గురిచేసింది
మేధోసంపత్తు ఉన్న ఓ మహనీయుడిని దేశం కోల్పోయింది. రాష్ట్రపతిగా దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో కొనియాడేలా కృషిచేసిన అబ్దుల్ కలామ్ సేవలు భరతజాతి ఎప్పుడూ మరువలేదు. అలాంటి నేత మరణం తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది.
-టి.సుబ్బరామిరెడ్డి రాజ్యసభ సభ్యుడు
యువతకు స్ఫూర్తి
శాస్త్రవేత్తగా దేశానికి ఎనలేని సేవలు అందించినా యువతను శక్తిగా తీర్చిదిద్దడానికి నిరంతరం పరితపించే వారు. విశాఖ నగరానికి రావడం, ప్రధానంగా ఏయూకు పలు పర్యాయాలు రావడం ఎంతో గర్వకారణం. దేశ శాస్త్ర విజ్ఞాన రంగానికి కలాం లేని లోటు అపారం.
-ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు, ఉపకులపతి
దేశభక్తుడిని కోల్పోయాం
మేధస్సుతో దేశాన్ని ముందుకు నడిపంచగలమని కలాం రుజువు చేశారు. తన జీవిత సర్వస్వం దేశ అభ్యున్నతికి వినియోగించారు. రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ చిన్నారులతో, యువతతో ఆయన గడపడానికి ఇష్టపడేవారు. కలాంను ఆదర్శంగా తీసుకుని ఎందరో యువత ఉన్నతంగా రాణించారు.
-ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, రిజిస్ట్రార్
‘ప్రత్యేక’ అతిథిగా...
విశాఖపట్నం : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉంది. రాష్ట్రపతి హోదాలో, అనంతరం మాజీ రాష్ట్రపతి హోదాలోనూ ఆయన విశాఖను సందర్శించారు. రాష్ట్రపతిగా తొలిసారి ఆయన 2006 ఫిబ్రవరి 12న వైజాగ్ వచ్చారు. భారత నావికాదళం తొమ్మిదో ఫ్లీట్ రివ్యూకు ప్రత్యేక అతిథిగా ఆయన హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఆయన విశాఖలోనే గడిపారు. ఐఎన్‌ఎస్ డేగా (విమానాశ్రయం) నుంచి నేవీ ఆడిటోరియం సముద్రికలో జరిగిన తొలి సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి డాల్ఫిన్‌నోస్‌పైకి వెళ్లి అక్కడ నుంచి ఆర్కే బీచ్‌లో విన్యాసాల కోసం ఉంచిన యుద్ధనౌకలను వీక్షించారు. నేవీ విన్యాసాలను తిలకించారు. ఆ మర్నాడు ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో ఐదు కిలోమీటర్ల మేర సముద్రంలో ప్రయాణించారు. అందులోనే సిబ్బందినుద్దేశించి ప్రసంగించారు. నగరంలోని కేర్ ఆస్పత్రిని సందర్శించారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి పిల్లలతో ముచ్చటించారు. ఫ్లీట్ రివ్యూను ముగించుకుని ఫిబ్రవరి 14న ఢిల్లీ వెళ్లిపోయారు.
మాజీ రాష్ట్రపతి హోదాలో కలాం మార్చి 13, 2009లో మరోసారి విశాఖ వచ్చారు. ఎంవీపీ కాలనీలోని సత్యసాయి విద్యావిహార్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ చిన్నారులతో సరదాగా గడిపారు.