గసగసాల సాగు వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా!
బెంగళూరుకు చెందిన ముఠానే కీలకం
కోలారు, చిత్తూరు జిల్లాల్లో ఏజెంట్లు
ఆరేళ్లుగా సాగవుతున్న వైనం
పలమనేరు: ఓపీఎం పోపీ (గసగసాలు) పంట సాగు వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా హస్తమున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా మరో ముఠా అంతర్జాతీయ మాఫియాకు సహకారమందిస్తూ వీటిని స్థానికంగా పండించేలా పథకం ప్రకారం ముందుకెళుతున్నట్లు సమాచారం. జిల్లాలోని పుంగనూరు ప్రాంతంలో రెండ్రోజుల క్రితం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ పంట సాగును కనుగొన్న విషయం తెలిసిందే. పొరుగునే ఉన్న కోలారు జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో బెంగళూరు ముఠా ఏజెంట్లు వందలాదిమంది ఉన్నట్లు తెలుస్తోంది. ఆరేళ్లుగా ఈ ప్రాంతంలో గసగసాల సాగు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
పలు దేశాల్లో అక్రమంగా సాగు
ప్రపంచంలోని పలు దేశాల్లో ఓపీఎం పోపీ సాగు అక్రమంగా సాగుతూనే ఉంది. ఆస్ట్రేలియాలోని టాస్మానియా, అమెరి కా, యూఏఈలో మాత్రం దీని సాగుకు ఆ ప్రభుత్వాల నుం చి అనుమతులున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్ తదితర దేశాల్లో టైస్ట్లు ఈ సాగును భారీగా చేపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది.
మొక్క నుంచి అంతా లాభమే
గసగసాల మొక్క నుంచి గసగసాలతో పాటు కాయ నుంచి జిగురు, బెరడులను కూడా సేకరిస్తున్నారు. కాయ ఏపుగా పెరిగినపుడు దానిపై బ్లేడ్లతో గాట్లు పెట్టి అందులో నుంచి వెలువడే జిగురును సేకరిస్తారు. దీన్ని కొకైన్, హెరాయిన్ తదితరాల తయారీకి ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఔషధ తయారీ సంస్థ అనుమతులున్న రాష్ట్రాల్లో మాత్రం వీటిని సేకరించి వైద్యపరమైన మత్తు మందులకు వినియోగిస్తారు. సంబంధిత రాష్ట్రాలు ఈ పంట సాగుకు అనుమతి ఇచ్చినట్లయితే స్థానికంగా ఉండే సెంట్రల్ డ్రగ్ అధికారులు, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణలోనే సాగు చేపట్టాలి.
కోలారు, పుంగనూరు ప్రాంతాల్లో ఏజెంట్లు
కర్ణాటకలోని కోలారు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రాంతాల్లో బెంగళూరు ముఠాకు చెందిన ఏజెంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు కేవలం నాలుగైదేళ్లలో లక్షాధికారులుగా మారారు. బెంగళూరు నుంచి విత్తనాలను స్థానిక రైతులకు అంది స్తున్నారు. ఒబ్బిళ్లయ్యాక సరుకును బెంగళూరుకు చేరవేస్తున్నారు. బెరడు నుంచి పౌడర్‌ను స్థానికంగానే తయా రు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారు లు గుర్తించారు. ఇళ్లలోని పెద్ద గ్రైండర్లతో పౌడర్‌ను తయారు చేసి ప్యాకెట్లుగా చేసి బస్సుల్లోనే బెంగళూరుకు పంపుతున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక ముఠాను పట్టుకునే పనిలో అధికారులు
స్థానిక ఏజెంట్ల ద్వారా బెంగళూరులోని ప్రధాన ముఠాను పట్టుకునే పనిలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిమగ్నమైనట్లు తెలిసింది. బెంగళూరులోని ముఠాను పట్టుకుంటే అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా లింకులు బయటపడే అవకాశాలున్నాయి.