డ్రగ్స్ రాకెట్ లో హీరోయిన్!
థానే: బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన మమతా కులకుర్ణిపై 'డ్రగ్స్' మేఘాలు కమ్ముకున్నాయి. నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు ఆమెపై దృష్టి సారించారు. థానే పోలీసులు ఇటీవల 20 టన్నుల నిషేధిత ఎఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ స్మగ్లింగ్ లో మమత భర్త విక్కీ గోస్వామి కీలకపాత్రధారి అని పోలీసులు వెల్లడించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాలో అతడు తలపండిపోయాడు.
1997లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన విక్కి 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత భార్యతో కలిసి కెన్యా రాజధాని నైరోబికి మకాం మార్చాడు. అక్కడి నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. అమెరికా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అమెరికా సమాచారంతో థానే పోలీసులు కూడా అతడిని వాంటెడ్ జాబితాలో చేర్చారు. మమత పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని థానే పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తెలిపారు.
1990లో అగ్రతారగా వెలుగొందిన మమతా కులకుర్ణి టాప్ హీరోల సరసన నటించింది. తనపై ఇంటర్ పోల్ నోటీసు ఉండడంతో దుబాయ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, అమెరికాలో కార్యకలాపాలు చూసే బాధ్యత తన భార్యకు విక్కి అప్పగించాడని థానే పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మహారాష్ట్రలోనూ ఆమె డగ్స్ నెట్ వర్క్ నడుపుతున్నట్టు అనుమానిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలకు మమత పేరు విక్కి వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు హవాలా మార్గంలోనూ వీరు లావాదేవీల జరుపుతున్నట్టు భావిస్తున్నారు.
అంతకుముందు మమతా కులకుర్ణి పేరు బయటికి రాలేదు. విక్కి గోస్వామికి, ముంబైలోని డ్రగ్స్ స్మగ్లర్లకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న పునిత్ శ్రింగి అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతడు తెలిపిన వివరాలు ఆధారంగా మమత పాత్రపై పోలీసులు దృష్టి పెట్టారు.