అంతా.. ఓపెన్!
► ఒకరికి బదులు మరొకరు!
► ఓపెన్ స్కూల్ పరీక్షల తీరిది
► తొలిరోజు 14మంది విద్యార్థుల డీబార్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఓపెన్‌స్కూల్ పరీక్షల తీరులో ఎలాంటి మార్పురాలేదు.. సోమవారం తొలిరోజు ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ రాష్ట్ర పరిశీలకుడు రాజేశ్వర్‌రావుకు పట్టుబడ్డారు. ఓపెన్ పదో తరగతి పరీక్షలకు 4,826మంది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా 4,388మంది హాజరయ్యారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 7,816 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 7,181 మంది వచ్చారు. జిల్లా కేంద్రంలోని మదీనామసీద్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని డీఈఓ విజయలక్ష్మిబాయి తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను డీబార్ చేశారు.
అదే విధంగా వారికి సహకరిస్తున్న ముగ్గురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు. జిల్లా స్థాయి పరిశీలకుడు బోయపల్లిలో ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు. అదే విధంగా జడ్చర్లలో ఒకరి బదులు ఒకరు రాస్తుండటంతో వారిని బుక్ చేయడంతో పాటు కేసునమోదుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. జడ్చర్లలో ఇన్విజిలేటర్‌ను, నాగర్‌కర్నూల్‌లో ముగ్గురు విద్యార్థులను, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో నాగర్‌కర్నూల్‌లో నలుగురు, గద్వాలలో ఇద్దరు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను డీబార్ చేశారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని మాస్ కాపీయింగ్ ప్రోత్సహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.
ఒకరిస్థానంలో మరొకరు
జడ్చర్ల: పట్టణంలోని అక్షరస్కూల్ కేంద్రంలో ఓపెన్ పరీక్షలు రాస్తున్న ఇద్దరు విద్యార్థులు డీబార్ అయ్యారు. ముగ్గురు విద్యార్థుల స్థానంలో మరో ముగ్గురు పరీక్షలకు హాజరుకావడంతో వారిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తల్లికి బదులుగా కూతురు పరీక్షకు హాజరుకావడాన్ని ఇన్విజిలేటర్ గుర్తించి పట్టుకున్నారు. ఇదేకేంద్రంలో ఏకంగా పుస్తకం పెట్టి పరీక్షరాస్తున్న ఇద్దరిని డీబార్ చేశారు. ఎస్ఐ జములప్ప కేంద్రానికి చేరుకుని తల్లికి బదులుగా పరీక్షరాస్తున్న కూతురితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని సాయంత్రం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.