చాంపియన్ రుత్విక శివాని
♦ కృష్ణప్రసాద్-సాత్విక్ జోడీకి డబుల్స్ టైటిల్
♦ అంతర్జాతీయ జూ. బ్యాడ్మింటన్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్ : సుశాంత్ చిపల్కట్టి స్మారక అంతర్జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌లో వరుసగా నాలుగో ఏడాది రుత్విక టైటిల్ గెలవడం విశేషం. మహారాష్ట్రలోని పుణేలో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. ఫైనల్లో టాప్ సీడ్ రుత్విక 21-9, 21-6తో రెండో సీడ్ సుపమర్త్ మింగ్‌చువా (థాయిలాండ్)ను చిత్తుగా ఓడించింది. 26 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగియడం విశేషం.
పురుషుల డబుల్స్‌లో కూడా తెలుగు కుర్రాళ్లు కృష్ణప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ ద్వయం సత్తా చాటి టైటిల్ చేజిక్కించుకున్నారు. మూడో సీడ్ ప్రసాద్-సాత్విక్ జోడి ఫైనల్లో 21-15, 21-17 స్కోరుతో వారిత్ సరపత్-పనచై వోరసక్త్యాన్పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన లక్ష్యసేన్ విజేతగా నిలవగా... మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్‌ను ఇం డోనేసియా జోడీలు కైవసం చేసుకున్నాయి.