International Karatee competitions
-
రోజు కూలీగా మారిన అంతర్జాతీయ అథ్లెట్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 23 ఏళ్ల పంజాబ్ అథ్లెట్ హర్దీప్ కౌర్, ప్రస్తుతం కుటుంబ పోషణ నిమిత్తం దినసరి కూలీగా మారింది. రోజుకు రూ.300 సంపాదన కోసం వరి పొలాల్లో పని చేస్తుంది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 20కి పైగా పతకాలు సాధించిన ఆమె.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దుర్భర జీవితం కొనసాగిస్తుంది. ఓ వైపు విద్యను(ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా) అభ్యసిస్తూనే, తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్తుంది. 2018లో మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో స్వర్ణం సాధించిన హర్దీప్కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అప్పటి పంజాబ్ క్రీడామంత్రి రాణా గుర్మీత్ సోధీ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంతో ఆమె ఆవేదన చెందుతుంది. ఉద్యోగం కోసం ప్రభుత్వ పెద్దలను ఎన్ని సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, దీంతో తప్పని పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లాల్సి వస్తుందని వాపోతుంది. తండ్రి నయాబ్ సింగ్, తల్లి సుఖ్విందర్ కౌర్ తన క్రీడా భవిష్యత్తు కోసం చాలా శ్రమించారని, ఉన్నది అమ్ముకుని తనను ఈ స్థాయికి తెచ్చారని, వారి బాధ చూడలేకే తాను వారితో కలిసి పనికి వెళ్తున్నానని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాక ఇటువంటి పరిస్థితి వస్తుందని తానెప్పుడు ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని ఆమె ఆశగా ఎదురు చూస్తుంది. చదవండి: ఆ ఇంగ్లీష్ బౌలర్ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా -
కరాటే వీరుడు
కుత్బుల్లాపూర్: సినీనటులు సుమన్, భానుచందర్ సినిమాల ప్రభావంతో పాటు బ్రూస్లీ, జాకీచాన్ల రియల్ టైమ్ స్టంట్స్‌తో ఆకర్షితుడయ్యాడు.. వచ్చీరాని కరాటే పోజులతో సరదాగా గడిపిన అతను ఏకంగా ఇంటర్నేషనల్ కుంగ్‌ఫూ పోటీలకు ఎంపిక కావడం విశేషం.. చదివింది పదో తరగతి. చేస్తోంది డ్రైవర్ ఉద్యోగమైనా కరాటేలో రాణిస్తున్నాడు మహంకాళి చంద్రమోహన్. త్వరలో జరగనున్న అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం వచ్చినా ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. దాతలు ఆర్థికంగా సహకారం అందిస్తే పోటీలకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయికి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన మహంకాళి పోశం, గంగమ్మల రెండో కుమారుడు మహంకాళి చంద్రమోహన్. సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. 7వ తరగతి చదివే సమయంలో తెలుగు యాక్షన్ సినిమాలు, హాలీవుడ్ యాక్షన్ పోస్టర్లలో హీరోల స్టంట్స్ చూసి కరాటేపై మక్కువ పెంచుకున్నాడు. స్థానికంగా ఉన్న కరాటే మాస్టర్ కంఠేష్ వద్ద ఓనమాలు నేర్చుకున్న చంద్రమోహన్ స్థానికంగా జరిగిన పలు పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఎన్నో పతకాలు.. స్థానిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన చంద్రమోహన్ తొలిసారిగా 1998లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో మొదటిస్థానంలో నిలిచాడు. అనంతరం 1999లో బెల్లంపల్లిలో, 2000లో మందమర్రిలో, 2001లో కాజీపేటలో, 2003లో హైదరాబాద్ మల్కాజిగిరిలో, 2004లో చెన్నూరులో జరిగిన పోటీల్లో మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చాడు. అనంతరం ఉపాధి కోసం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ గాజులరామారంలోని వలస వచ్చి ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో డ్రైవర్ వృత్తిలో కొనసాగుతూ వస్తున్నాడు. కరాటేపై మక్కువతో మరోసారి పోటీలకు సన్నద్ధమై 2017లో ఆసిఫాబాద్ కాగజ్‌నగర్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో రెండో స్థానం సాధించాడు. గత ఏడాది మందమర్రిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర గ్రాండ్ చాంపియన్ కరాటే పోటీల్లో మొదటి స్థానం సాధించి ప్రతిభ చాటాడు. ఇంటర్నేషనల్ బీచ్ కాంబాట్కు అవకాశం.. మహంకాళి చంద్రమోహన్‌కు ఈ నెల 17 నుంచి 20 వరకు గోవా వేదికగా ఇంటర్నేషనల్ వరల్డ్ కాంబాట్ గేమ్స్ కౌన్సిల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఇంటర్నేషనల్ బీచ్ కాంబాట్– 2019లో పాల్గొనే అవకాశం లభించింది. ఇక్కడ జరిగే మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో సత్తా చాటితే ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశం మహంకాళి చంద్రమోహన్‌కు లభిస్తుంది. ఆటంకంగా మారిన ఆర్థిక పరిస్థితి.. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన చంద్రమోహన్ డ్రైవర్ వృత్తితో వచ్చే చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ప్రస్తుతం గోవాలో జరగనున్న కరాటే పోటీలకు హాజరయ్యేందుకు ఖర్చు భారీగానే ఉంటుంది. పోటీల కోసం నాలుగు రోజులు గోవాలో ఉండడమే కాకుండా రానుపోను ఖర్చులు సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దాతలు, క్రీడా ప్రేమికులు ప్రోత్సహించి కొంతమేర ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాడు. దాతలు సంప్రదించాల్సిన నంబర్ 89196 37615. -
కరాటే పోటీలకు గంగాపురం విద్యార్థులు
జడ్చర్ల టౌన్(మహబూబ్‌నగర్): విశాఖపట్నంలో ఈనెల 30, 31, 1 తేదీల్లో అంతర్జాతీయ కరాటే పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురానికి చెందిన మాస్టర్ కేశవ్బూడోకాన్ కరాటేక్ లబ్కు చెందిన విద్యార్థులు బుధవారం జడ్చర్ల నుంచి బయలుదేరి వెళ్లారు. పోటీలకు ఎంపికయిన వారిలో శివకుమార్, శ్రీనివాసచారి, అంబిక, రుషికేష్, అవినాష్, భానుప్రకాష్‌లు ఉన్నారని క్లబ్ ఫౌండర్ కేశవ్ తెలిపారు. వీరు బ్లాక్‌బెల్ట్, కటాస్, సైపరింగ్ విభాగాల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. పోటీలకు భారతదేశంతోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్, బూటాన్, నేపాల్, కొరియా, చైనా మాల్దీవులు, ఇరాన్, సౌది అరేబియా, కొరియా దేశాలకు చెందిన వారు పాల్గొనున్నారని తెలిపారు.