కరాటే వీరుడు | Chandramohan Select For International Karate Champion Competitions | Sakshi
Sakshi News home page

కరాటే వీరుడు

Published Thu, Jan 17 2019 10:33 AM | Last Updated on Thu, Jan 17 2019 10:33 AM

Chandramohan Select For International Karate Champion Competitions - Sakshi

కరాటే ప్రాక్టీస్‌ చేస్తున్న చంద్రమోహన్‌

కుత్బుల్లాపూర్‌: సినీనటులు సుమన్, భానుచందర్‌ సినిమాల ప్రభావంతో పాటు బ్రూస్‌లీ, జాకీచాన్‌ల రియల్‌ టైమ్‌ స్టంట్స్‌తో ఆకర్షితుడయ్యాడు.. వచ్చీరాని కరాటే పోజులతో సరదాగా గడిపిన అతను ఏకంగా ఇంటర్నేషనల్‌ కుంగ్‌ఫూ పోటీలకు ఎంపిక కావడం విశేషం.. చదివింది పదో తరగతి. చేస్తోంది డ్రైవర్‌ ఉద్యోగమైనా కరాటేలో రాణిస్తున్నాడు  మహంకాళి చంద్రమోహన్‌. త్వరలో జరగనున్న అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం వచ్చినా ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. దాతలు ఆర్థికంగా సహకారం అందిస్తే పోటీలకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నాడు.  

అంతర్జాతీయ స్థాయికి..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రికి చెందిన మహంకాళి పోశం, గంగమ్మల రెండో కుమారుడు మహంకాళి చంద్రమోహన్‌. సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. 7వ తరగతి చదివే సమయంలో తెలుగు యాక్షన్‌ సినిమాలు, హాలీవుడ్‌ యాక్షన్‌ పోస్టర్లలో హీరోల స్టంట్స్‌ చూసి కరాటేపై మక్కువ పెంచుకున్నాడు. స్థానికంగా ఉన్న కరాటే మాస్టర్‌ కంఠేష్‌ వద్ద ఓనమాలు నేర్చుకున్న చంద్రమోహన్‌ స్థానికంగా జరిగిన పలు పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు.  

ఎన్నో పతకాలు..
స్థానిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన చంద్రమోహన్‌ తొలిసారిగా 1998లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో మొదటిస్థానంలో నిలిచాడు. అనంతరం 1999లో బెల్లంపల్లిలో, 2000లో మందమర్రిలో, 2001లో కాజీపేటలో, 2003లో హైదరాబాద్‌ మల్కాజిగిరిలో, 2004లో చెన్నూరులో జరిగిన పోటీల్లో మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చాడు. అనంతరం ఉపాధి కోసం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ గాజులరామారంలోని వలస వచ్చి ఓ ప్రైవేట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డ్రైవర్‌ వృత్తిలో కొనసాగుతూ వస్తున్నాడు. కరాటేపై మక్కువతో మరోసారి పోటీలకు సన్నద్ధమై 2017లో ఆసిఫాబాద్‌ కాగజ్‌నగర్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో రెండో స్థానం సాధించాడు. గత ఏడాది మందమర్రిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర గ్రాండ్‌ చాంపియన్‌ కరాటే పోటీల్లో మొదటి స్థానం సాధించి ప్రతిభ చాటాడు.  
ఇంటర్నేషనల్‌ బీచ్‌

కాంబాట్‌కు అవకాశం..
మహంకాళి చంద్రమోహన్‌కు ఈ నెల 17 నుంచి 20 వరకు గోవా వేదికగా ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ కాంబాట్‌ గేమ్స్‌ కౌన్సిల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరగనున్న  ఇంటర్నేషనల్‌ బీచ్‌ కాంబాట్‌– 2019లో పాల్గొనే అవకాశం లభించింది. ఇక్కడ జరిగే మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో సత్తా చాటితే ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశం మహంకాళి చంద్రమోహన్‌కు లభిస్తుంది.  

ఆటంకంగా మారిన ఆర్థిక పరిస్థితి..
జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన చంద్రమోహన్‌ డ్రైవర్‌ వృత్తితో వచ్చే చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ప్రస్తుతం గోవాలో జరగనున్న కరాటే పోటీలకు హాజరయ్యేందుకు ఖర్చు భారీగానే ఉంటుంది. పోటీల కోసం నాలుగు రోజులు గోవాలో ఉండడమే కాకుండా రానుపోను ఖర్చులు సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దాతలు, క్రీడా ప్రేమికులు ప్రోత్సహించి కొంతమేర ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాడు. దాతలు సంప్రదించాల్సిన నంబర్‌ 89196 37615.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

యవ్వనంలో కరాటే ప్రాక్టీస్‌ చేస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement