international scientists
-
వెల్కమ్ దాసరి హర్షిత.. జపాన్ నుంచి నేడు స్వదేశానికి..
సాక్షి, కరీంనగర్: తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డుల పోటీల్లో సత్తాచాటి జిల్లా పేరు ఇనుమండింపజేసిన దాసరి హర్షిత అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని ఆదివారం స్వదేశానికి చేరుకోనుంది. రామగిరి మండలం చందనాపూర్ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న హర్షిత ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు జపాన్ రాజధాని టోక్యో వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సకూర కార్యక్రమంలో పాల్గొంది. గతేడాది సెప్టెంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా నిర్వహించిన 9వ జాతీయ ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన పోటీల్లో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు హాజరవగా.. హర్సిత ప్రతిభ చూపించింది. కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి జితేంద్రసింగ్ నుంచి అవార్డును అందుకున్నట్లు డీఈవో మాధవి తెలిపారు. అలాగే ఈఏడాది ఏప్రిల్ 10 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఫైన్ కార్యక్రమంలో పాల్గొని నేరుగా రాష్ట్రపతికి తను రూపొందించిన బహుళ ప్రయోజనకర హెల్మెట్ గురించి వివరించి మన్ననలు పొందింది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో మే 10, 11, 12వ తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలోనూ ప్రతిభ చాటింది. మనరాష్ట్రం నుంచి 9వ జాతీయ ప్రదర్శన పోటీల్లో విజేతలైన 8 మంది విద్యార్థులతో కలిసి అంతర్జాతీయ కార్యక్రమానికి ఎంపికై ంది. దేశం నలుమూలల నుంచి ఏడు, ఎనిమిది, తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డు– మనక్ పోటీల్లో విజేతలైన 59 మంది విద్యార్థులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. మనరాష్ట్రం నుంచి ఆరుగురు విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఆదేశంలోని మన రాయబార కార్యాలయంతోపాటు పలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వారసత్వం కలిగిన 15కు పైగా ప్రదేశాలను తిలకించి రావడం హర్షిత ప్రత్యేకత. పాఠశాల స్థాయి నుంచే.. పాఠశాలస్థాయి ప్రదర్శన నుంచే చైనా, సైప్రస్, ఉజ్బెకిస్తాన్, తజబిస్తాన్ లాంటి దేశాల విద్యార్థులు పాల్గొన్న అంతర్జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడానికి అరుదైన అవకాశం మనదేశంలోని గ్రామీణి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని హర్షితకు రావడం విశేషం. ఆమెను ప్రో త్సాహించిన గైడ్ టీచర్ సంపత్‌కుమార్‌ను డీఈవో మాధవి, జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు, హెచ్ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు. -
కరోనా వైరస్ పుట్టుకపై మరో షాకింగ్ కోణం..
న్యూయార్క్: కరోనా వైరస్ పుట్టుకపై ఇది మరో కొత్త విశ్లేషణ. ఇన్నాళ్లూ గబ్బిలాల నుంచి ఈ వైరస్ సంక్రమించిందని భావిస్తూ ఉంటే కొందరు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం శునకాల నుంచి వచ్చిందని తమ పరిశోధనల్లో వెల్లడైనట్టు చెప్పారు. చైనాలోని వూహాన్ సీఫుడ్ మార్కెట్లో సేకరించిన జన్యు నమూనాలను అధ్యయనం చేస్తే వూహాన్ మార్కెట్లో అమ్ముతున్న రకూన్ డాగ్స్ నుంచే వైరస్ వ్యాప్తి చెందిందని తేల్చారు. ఈ కొత్త విశ్లేషణను న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. జనవరి 2020లో కొందరు శాస్త్రవేత్తలు వూహాన్ మార్కెట్లో శాంపిల్స్ సేకరించారు. అప్పటికే కొత్త వైరస్ ఆందోళనతో వూహాన్ మార్కెట్ అంతా ఖాళీ చేయించారు. ఆ మార్కెట్ గోడలపైన, నేలపైన, జంతువుల్ని ఉంచే పంజరాల్లోనూ జన్యు నమూనాలు సేకరించి అధ్యయనం చేశారు. ఆ నమూనాల్లో అత్యధిక భాగం రకూన్ డాగ్స్‌తో సరిపోలాయని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. ఈ వివరాలను చైనా శాస్త్రవేత్తలతోనూ వారు పంచుకున్నారు. అయితే ఆ తర్వాత గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్ఏఐడీ) నుంచి ఈ డేటా మాయం అయిపోయిందని ఆ శాస్త్రవేత్తలు చెప్పారు. అరిజోనా యూనివర్సిటీ, కాలిఫోర్నియాలో స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిడ్నీ యూనివర్సిటీ వైరాలజిస్టులు ఈ బృందంలో ఉన్నారు. రకూన్ డాగ్స్ నుంచే మనుషులకి సంక్రమించిందా లేదా అన్నది శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పలేకపోయారు. శునకాల నుంచి మనుషులకే నేరుగా సోకొచ్చు లేదా ఆ డాగ్స్ నుంచి వేరే జంతువుకి వెళ్లి మనుషులకి సోకి ఉండొచ్చని అన్నారు. -
ఊహకందని విషయమిది.. 7 నెలల కన్నా ఎక్కువ కాలం యాక్టివ్‌గా వైరస్?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని రెండేళ్లుగా అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు మనం ఊహిస్తున్న, అంచనా వేస్తున్న దానికన్నా మరింత ఎక్కువ కాలం మనుషుల శరీరంలో వైరస్ యాక్టివ్‌గా ఉంటుందని తాజాగా ఓ పరిశోధనలో తేలింది. పాజిటివ్‌గా తేలిన 14 రోజుల తర్వాత కూడా చాలా మంది యాక్టివ్ వైరస్‌ను వెదజల్లే అవకాశముందని, కొందరిలో 7 నెలలకు పైగానే యాక్టివ్‌గా ఉండొచ్చని వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రాంటియర్స్ ఇన్ మెడిసిన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన పాస్చర్ ఇన్స్టిట్యూట్, ది యూనివర్సిటీ ఆఫ్ సావ్పౌలో (యూఎస్పీ), బ్రెజిల్‌లోని ఆస్వాల్డో క్రజ్ ఫౌండేషన్, ఇతర అంతర్జాతయ శాస్త్రవేత్తల బృందం కలిసి ఈ పరిశోధన చేశాయి. ఒక్కొక్కరిలో ఒక్కోలా..! బ్రెజిల్‌లోని కొందరు కరోనా పేషెంట్లకు పరిశోధకులు వరుస పరీక్షలు చేశారు. నెగెటివ్ వచ్చే దాకా రెండు, మూడుసార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళలో 70 రోజులకు మించి వైరస్‌ను గుర్తించినట్టు వెల్లడించారు. దీన్ని బట్టి వైరస్ సోకిన వారిలో 8 శాతం మంది 2 నెలల కంటే ఎక్కువ కాలం పాటు ఇతరులకు కరోనాను వ్యాప్తి చేసే అవకాశాలున్నాయని వాళ్లు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత చివరి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని అంటున్నారు. 38 ఏళ్ల ఓ వ్యక్తిలో 20 రోజులు స్వల్ప లక్షణాలే కనిపించినా అతని శరీర వ్యవస్థల్లో 232 రోజుల పాటు వైరస్ కొనసాగినట్టు, మ్యుటెషన్లు జరిగినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాకు ఆ వ్యక్తి క్రమం తప్పకుండా చికిత్స తీసుకోకుండా, మాస్క్ ధరించకుండా, వ్యక్తుల మధ్య దూరం పాటించకుండా ఉండి ఉంటే ఆ 7 నెలల్లో ఎంతో మందికి వైరస్ వ్యాప్తి చెందించి ఉండేవాడని చెప్పారు. 14 రోజుల తర్వాత కూడా.. కరోనా వచ్చాక 14 రోజుల తర్వాత కూడా ప్రజలు ‘యాక్టివ్ వైరస్’ను కలిగి ఉండి ఇతరులకు వ్యాప్తి చెందించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పరిశోధనలో ముఖ్యపాత్ర పోషించిన పౌలా మినోప్రియో వెల్లడించారు. అందువల్ల కరోనా సోకిన వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా మరిన్ని మ్యుటేషన్లు, కొత్త వేరియెంట్లు వచ్చే అవకాశాలపై కన్నేసి ఉంచొచ్చని అంటున్నారు. పేషెంట్‌కు నెగెటివ్ రావడానికి నెల రోజులు పడుతుందని, కొన్ని కేసుల్లో 71 రోజుల నుంచి 232 రోజుల వరకు ఉండొచ్చని అధ్యయనం చెబుతోందన్నారు. ఐతే ఇలా వ్యాప్తి జరిగి అందరిలో యాంటీబాడీస్ ఏర్పడే అవకాశముందని కొందరు అంటున్నారు. -
డేంజర్ బెల్స్!
దేశం మొత్తమ్మీద లాక్డౌన్ ప్రకటించేశారు.. విమానాల్లేవు.. రైళ్లు రావు.. బస్సులూ కదలవు.. ఇంకేముంది.. ఇంకొన్ని రోజుల్లో కరోనా మహమ్మారి నుంచి.. దేశం విముక్తమైనట్లే అనుకుంటున్నారా? కాకపోవచ్చు. అనూహ్యంగా పెరగొచ్చు కూడా... 2 అంతర్జాతీయ సంస్థలు సిద్ధం చేసిన తాజా అంచనాల ప్రకారం.. మే నెల నాటికల్లా దేశం మొత్తమ్మీద కరోనా బాధితుల సంఖ్య.. అక్షరాలా 25 కోట్లకు చేరుకోవచ్చు.. వినేందుకు చాలా భయంకరంగా అనిపిస్తుంది ఈ విషయం. అయితే గతేడాది డిసెంబర్లో చైనాలో మొదలైన వైరస్ దూకుడు కొద్ది నెలల్లోనే 170 దేశాలకు విస్తరించడం.. 4 లక్షలకుపైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడటం చూస్తే మాత్రం ఈ భయాలు నిజమైనా కావొచ్చనిపిస్తోంది. వాషింగ్టన్ తో పాటు న్యూఢిల్లీలోనూ ఓ కేంద్రం ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ఎకనమిక్స్ అండ్ పాలసీ (సీడీడీఈపీ), ప్రఖ్యాత జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలు కలసి భారత్‌లో కరోనా బాధితుల, ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్యపై మంగళవారం ఓ నివేదిక విడుదల చేశాయి. ఇందులో మూడు రకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న లాక్డౌన్ నిబంధనలను ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉల్లంఘిస్తే ఏమవుతుందనేది వీటిల్లో ఒకటి. వైరస్ సామర్థ్యం, ఉష్ణోగ్రత/గాల్లో తేమ శాతం, సున్నితత్వం వంటివి ఏవీ మారకుండా.. నియంత్రణలన్నీ మోస్తరు నుంచి పూర్తిగా అమలైతే ఏమిటన్నది రెండో పరిస్థితి కాగా.. వైరస్ సామర్థ్యం తగ్గిపోతే, ఉష్ణోగ్రత/గాల్లో తేమ శాతం, సున్నితత్వం వంటివి పరిగణనలోకి తీసుకున్నది మూడో పరిస్థితి. ఈ మూడు పరిస్థితుల్లో దేశం మొత్తమ్మీద ఎంత మంది వైరస్ బారిన పడొచ్చు.. ఆస్పత్రిలో చేరేవారెందరు..? అన్న అంశాలతో పాటు రాష్ట్రాల వారీగానూ ఈ సంఖ్యలు ఎలా ఉండనున్నాయో ఈ నివేదికలో పొందుపరిచారు. నాలుగు అంశాల పరిశీలన.. సీడీడీఈపీ, జాన్ హాప్కిన్ యూనివర్సిటీలు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో రాష్ట్రాల వారీ లెక్కల కోసం 4 అంశాలను పరిశీలించారు. ఆయా రాష్ట్రాల్లో తొలి కరోనా కేసు ఎప్పుడు నమోదైంది.. వైరస్ బాధితులు ఉన్న మహా నగరాలు ఉన్నాయా.. చైనా, ఇటలీ వంటి కరోనా బాధిత దేశాలతో ఉన్న వైమానిక సంబంధాలు, ఆయా రాష్ట్రాల జనాభాలో ఏ వయసు వారు ఎంత మంది ఉన్నారనే లెక్కలు నాలుగో అంశంగా పరిగణించారు. దేశ జనాభాలో యువజనులు ఎక్కువగా ఉండటం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో వైరస్ తీవ్రత కొంచెం తక్కువగా ఉండొచ్చని, కాకపోతే పోషకాహార లోపాల కారణంగా సమస్య జటిలమైనా ఆశ్చర్యం లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యల అమలు కీలకం.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల అమలుపై దేశంలో వ్యాధి బాధితుల సంఖ్య ఆధారపడి ఉందని ఈ నివేదిక చెబుతోంది. వ్యాధిగ్రస్తులు, అనుమానితులు, లక్షణాలు ఉన్నవారు స్వీయ నిర్బంధాన్ని కచ్చితంగా పాటించడం, అన్ని చోట్ల సామాజిక దూరం ఉండేలా జాగ్రత్తలు పడటం ముఖ్యమని స్పష్టం చేసింది. ఇలాకాకుండా ప్రజలు ప్రభుత్వ నియంత్రణలను తేలిగ్గా తీసుకుంటే మాత్రం మే నెలకల్లా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 25 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అదే నిబంధనలన్నీ పాటిస్తే 19 కోట్లకు.. వైరస్ సామర్థ్యం తగ్గితే 12 కోట్లకు పరిమితం కావొచ్చని ఈ నివేదిక చెబుతోంది. వ్యాధి లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేకున్నా కరోనా సోకిన వారు ఆస్పత్రుల్లో చేరిన వారందరినీ కలుపుకొని ఈ అంచనాలన్న మాట. 50 వేల వెంటిలేటర్లే ఉన్నాయి.. ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్యపై ఈ నివేదిక ఏం చెబుతుంది అంటే.. నిబంధనలు పాటించకపోతే సుమారు 25 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం చెప్పినట్లు కచ్చితంగా పాటిస్తే మాత్రం సుమారు 18 లక్షల మందికి ఆస్పత్రుల్లో వైద్యసా యం అందించాల్సి వస్తుంది. వైరస్ సామర్థ్యం తగ్గితే ఈ సంఖ్య 11 లక్షలకు మాత్రమే పరిమితమవుతుంది. ఒకానొక దశలో దేశంలో కనీసం 10 లక్షల వెంటిలేటర్ల అ వసరం పడే అవకాశముండగా.. ప్రస్తుతం 50 వేల వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. అంతర్జాతీయ శాస్త్రవేత్తల మాట ఇదీ.. అయితే అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కాస్త ఊరట కల్పించే విషయాలు వెల్లడించింది. ఎందుకంటే వీరి అధ్యయనంలో మే నాటికి లక్ష నుంచి 13 లక్షల పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న తొలి దశలో అమెరికా, ఇటలీ కన్నా భారత్ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ దేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య విషయంలో కొంత సందిగ్ధత ఉందని వారు చెబుతున్నారు. ఈ వ్యాధిని పరీక్షించే విస్తృతి, నివేదికల కచ్చితత్వం, వైరస్ సోకినా లక్షణాలు కన్పించకపోవడం తదితర కారణాల వల్ల సరైన లెక్క చెప్పలేకపోవచ్చని పేర్కొంటున్నారు. తెలంగాణలో పరిస్థితేంటి? దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా బాధితుల, ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్యలపై ఈ నివేదిక స్పష్టమైన అంచనాలు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో బాధితుల సంఖ్య 2.1 కోట్ల నుంచి 4.8 కోట్ల వరకు ఉండే అవకాశం ఉండగా.. ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్య పది శాతం వరకు ఉండొచ్చు. ఢిల్లీలో 20 లక్షల మంది నుంచి 42 లక్షల మంది కరోనా బారిన పడితే.. ఆస్పత్రి పాలయ్యే వాళ్లు 20 వేల నుంచి 42 వేల మంది ఉంటారు. మహారాష్ట్ర, కేరళల్లోనూ ఈ సంఖ్య లక్షల్లోనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంచనాలు ఈ నివేదికలో లేవు. మరోవైపు తెలంగాణలో లాక్డౌన్ నిబంధనలు అన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తే కరోనా బాధితుల సంఖ్య 63–64 లక్షల మధ్యలో ఉంటుంది. సామాజిక దూరం, స్వీయ నిర్బంధం వంటి అంశాలను తేలిగ్గా తీసుకుంటే మాత్రం ఈ సంఖ్య 90 లక్షలకు చేరువగా ఉంటుందని ఈ నివేదిక చెబుతోంది. ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్య మాత్రం లక్షన్నర నుంచి 3 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. -
మనిషి ఆయుష్షు ఐదు రెట్లు పెరుగుతుందా?
వందేళ్లు బతకాలని ఎవరు అనుకోరు చెప్పండి. కానీ.. చాలా తక్కువ మందికి ఈ అదష్టం దక్కుతుంది. ఇప్పటివరకూ ఇదే పరిస్థితి. కానీ ఓ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బందం పరిశోధనలు పూర్తిస్థాయిలో సఫలమైతే మాత్రం మనిషి ఆయుష్షు నాలుగు రెట్లు అంటే సుమారు 400 ఏళ్లకు పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది! ఎందుకంటే.. సి.ఎలిగాన్స్ అనే సూక్ష్మస్థాయి పురుగులపై జరిగిన పరిశోధనల్లో వాటి ఆయుష్షు ఐదు రెట్లు ఎక్కువైంది కాబట్టి. అదెలాగో తెలుసుకునే ముందు మన కణాలెలా పనిచేస్తాయో కొంచెం అర్థం చేసుకుందాం. కణాల్లోపల ఉండే భాగాలు నిర్దిష్ట పనులు నిర్వహించేందుకు సిగ్నలింగ్ పాథ్‌వేస్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. ఒక భాగానికి సంకేతం అందితే.. ఆ పని చేసిన తరువాత సంకేతం పక్కనున్న భాగానికి వెళుతుంది. ఇన్సులిన్‌తోపాటు రాపమైసిన్ పాథ్‌వేలకూ.. ఆయుష్షుకు మధ్య సంబంధం ఉందని గతంలోనే రుజువైంది. రాపమైసిన్ పాథ్‌వేను నియంత్రిస్తే ఆయుష్షు 100 శాతం పెరిగితే ఇన్సులిన్ నియంత్రణ ద్వారా 30 శాతం పెరిగినట్లు గత పరిశోధనలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఈ రెండింటినీ మార్చడం ద్వారా ఆయుష్షు ఐదు రెట్లు పెరుగుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అయితే మానవుల్లోనూ ఇదే ఫలితాలు కనిపిస్తాయా? అన్నది ప్రస్తుతానికైదే తెలియదు. కానీ.. సి–ఎలిగాన్స్‌తోపాటు మానవుల్లోనూ ఒకే రకమైన జన్యువులు ఉండటం గమనించాలని అంటున్నారు ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన జరోడ్ రోలిన్స్ అనే శాస్త్రవేత్త. విస్తత స్థాయి పరిశోధనల ద్వారా మానవుల్లోనూ ఇదే ఫలితాలు సాధించేందుకు అవకాశముందని అంచనా. -
యంగ్ సైంటిస్టు మేఘన
పశ్చిమగోదావరి, అత్తిలి: అమెరికాలో ఇంటెల్ ఫౌండేషన్ నిర్వహించిన సైన్స్‌ఫేర్ పోటీలలో ఇంటర్నేషనల్ యంగ్‌సైంటిస్టు అవార్డు అందుకుని అమెరికన్ ఫోర్బ్స్ మేగజీన్‌లో చోటు సంపాదించుకుంది అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన బొల్లింపల్లి మేఘన. ఐసెఫ్ 2018 మే నెలలో మేఘన అవార్డు సాధించి ప్రతిభావంతురాలిగా నిలిచింది. అమెరికన్ ఫోర్బ్స్ మేగజీన్‌లో 2018–19 ఏడాదికి సంబంధించి అండర్–30 శాస్త్రవేత్తల విభాగంలో మేఘన చోటు దక్కించుకుంది. ప్రపంచస్థాయిలో ఐసెఫ్ సంస్థ నిర్వహించిన సైన్స్‌ఫేర్ పోటీలలో 82 దేశాలతో పోటీపడి ఎలక్ట్రోడ్ మేడ్ విత్ ప్లాటినమ్ అనే సైన్స్ సూపర్ కెపాసిటర్ ప్రయోగానికి ప్రథమస్థానంలో నిలిచి ఐసెఫ్ ప్రకటించిన యంగ్ సైంటిస్టు అవార్డు సాధించింది. అవార్డుతో పాటు 50 వేల డాలర్ల బహుమతిని పొందిందని మేఘన తాతయ్య వట్టికూటి సూర్యనారాయణ తెలిపారు. మేఘన తల్లిదండ్రులు బల్లింపల్లి వెంకటేశ్వరరావు, మాధవి. తండ్రి వెంకటేశ్వరరావు తొలుత లెక్చరర్‌గా, అనంతరం సత్యం కంప్యూటర్లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తూ, అక్కడ నుంచి కంపెనీ తరపున 2004లో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. వీరు అమెరికాలో ఆర్క్‌నెస్ రాష్ట్రంలో లిటిల్రాక్లో నివసిస్తున్నారు. మేఘన సెంట్రల్ ఉన్నత పాఠశాలలో 12వ గ్రేడు చదువుతోంది. తమ కుమార్తె 5వ గ్రేడు నుంచి అద్భుతమైన మేధాశక్తిని కలిగిఉందని, తానే సొంతంగా ఇంటర్నెట్ ద్వారా అనేక కొత్త విషయాలను తెలుసుకుని అనేక ప్రయోగాలు చేస్తుందని మేఘన తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, మాధవి శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. అక్కడ నిర్వహించే పలు సెమినార్లలో మేఘన పాల్గొని అనేక అవార్డులు సాధించిందని చెప్పారు. వెంకటేశ్వరరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మేఘన రెండున్నరేళ్ల వయస్సు ఉండగానే దేశాల రాజధానులను అనర్గళంగా చెప్పేదని, అప్పట్లో మాటీవీ కార్యక్రమంలో పాల్గొని ప్రశంసలు అందుకుందన్నారు. అక్కడ పలు డ్యాన్స్ పోటీలలో కూడా పాల్గొని ప్రశంసలు పొందుతోందన్నారు. మేఘన సోదరి శ్రీహిత కూడా స్పెల్‌బీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని వెల్లడించారు. మేఘన కవల సోదరులు సుభాష్, అభిలాష్ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. తమ నలుగురు మనుమలు విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం తమకు చాలా ఆనందంగా ఉందని తాతయ్య, అమ్మమ్మలు వట్టికూటి సూర్యనారాయణ, లక్ష్మీతులసి తెలిపారు. -
జీవజాతులపై పరిశోధనలు అవసరం
సాక్షి, హైదరాబాద్: జీవశాస్త్రవేత్తల ప్రయోగాలు ఎలుకలు, బొద్దింకలు, ఈగలు వంటి నమూనా జంతువులకే పరిమితం చేయకుండా అన్ని రకాల జీవజాతులపై పరిశోధనలు జరపాలని నోబెల్ గ్రహీత మార్టిన్ షాలిఫీ సూచించారు. ఆవిష్కరణలు, పరిశోధనలు ఒక్కరివల్ల అయ్యేవి కావని, ఆయా రంగాల్లో కృషి చేస్తున్న ఇతర శాస్త్రవేత్తల సహకారం కూడా అవసరమని తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న ‘కణజీవశాస్త్ర అంతర్జాతీయ సదస్సు’కు ఆయన హాజరై మాట్లాడారు. గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రొటీన్ ఆవిష్కరణ ద్వారా జీవిలో చూడలేని జన్యుపరమైన చర్యలను ప్రత్యక్షంగా చూసేలా చేశామన్నారు. జన్యుశాస్త్రంలో మౌలిక పరిశోధనలు వేగం పుంజుకునేందుకు, హెచ్ఐవీ పరిశోధనల్లోనూ ఈ ఆవిష్కరణ కీలకంగా మారిందని చెప్పారు. వీటితోపాటు మందుపాతరల గుర్తింపునకు, చీకట్లో వెలుగులు చిమ్మే పట్టుతయారీకి పనికొచ్చిందని తెలిపారు. గొప్ప ఆవిష్కరణల్లో చాలావరకూ యాదృచ్ఛికంగా జరిగినవేనన్నారు. ఘనంగా ప్రారంభమైన ఐసీసీబీ కణజీవశాస్త్రంలో కృషి చేస్తున్న శాస్త్రవేత్తలందరినీ ఒకే వేదికపైకి చేర్చే లక్ష్యంగా తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ సెల్ బయాలజీ–2018 శనివారం ఘనంగా ప్రారంభమైంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఆసియా పసిఫిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్ బయాలజిస్ట్, ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజిస్ట్ వంటి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 1200 మంది జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి ఆదివారం హాజరు కానున్నారు. -
‘వేడి గురుగ్రహం’పై నీటి ఆవిరి!
మన సౌరకుటుంబంలోనే అతిపెద్దదైన గురు గ్రహం కన్నా ఏకంగా ఆరు రెట్లు పెద్దగా ఉన్న ‘టౌ బూ బి’ అనే ఓ వేడి గ్రహంపై వాతావరణంలో నీటి ఆవిరి ఉన్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇన్ఫ్రారెడ్ పద్ధతికి డాప్లర్ టెక్నిక్‌ను జోడించి ఆ నీటిఆవిరిని కనుగొన్నట్లు వారు తెలిపారు. ‘టౌ బూటిస్’ అనే నక్షత్రం చుట్టూ అతి సమీపం నుంచే తిరుగుతున్న ‘టౌ బూ బి’ తన నక్షత్రాన్ని 3.3 రోజులకే ఓసారి చుట్టి వస్తోందట. మన గురుగ్రహం సూర్యుడికి దూరంగా, చల్లగా ఉంటుంది. కానీ ఇతర నక్షత్రాల చుట్టూ ‘టౌ బూ బి’ లాంటి వేడి గురుగ్రహాలు చాలానే తిరుగుతున్నాయట. ‘టౌ బూ బి’పై నీటి ఆవిరిని గుర్తించేందుకు ఉపయోగించిన ఈ పద్ధతితో ఇతర గ్రహాల వాతావరణాన్ని కూడా అధ్యయనం చేయొచ్చని, సౌరకుటుంబం ఆవలి గ్రహాలపై నీరు, ఇతర అణువులను కూడా గుర్తించొచ్చని భావిస్తున్నారు.