The International Space Station
-
ఎడారిపై ఉషోదయ సమయాన...
ఆఫ్రికాలోని సహారా ఎడారి వద్ద ఓ వైపు పట్టపగలు.. మరోవైపు అప్పుడే చీకట్లు తొలగుతున్న సుందర దృశ్యమిది. సహారా ఎడారిలో భాగంగా, దాని మధ్యలో ఉన్న ముర్జక్ ఎడారిపై ఉదయ భానుడి లేత కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి నాసా వ్యోమగామి ఇటీవల ఈ ఫొటో తీశారు. చిత్రంలో కుడివైపు పైన తెల్లగా కనిపిస్తున్న చోట పూర్తిగా తెల్లవారిపోగా.. ముర్జక్ ఎడారి(కిందివైపు మధ్యలో)పై అప్పుడప్పుడే చీకట్లు తొలగుతున్నాయి. సహారా ఎడారిపై చాలాసార్లు మేఘాలు ఎక్కువగా ఆవరించి ఉండకపోవడం వల్ల అంతరిక్షం నుంచి తరచూ ఇలాంటి అందమైన దృశ్యాలు కనువిందు చేస్తాయట. అన్నట్టూ.. ఫొటోలో ముర్జక్ ఎడారి చిన్నగానే కనిపిస్తున్నా.. 300 కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉందట. -
ఐఎస్ఎస్కు సమీపంలో యూఎఫ్‌వో!?
భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) సమీపంలోకి ఇటీవల ఓ గుర్తుతెలియని ఎగిరే వస్తువు(యూఎఫ్‌వో) వచ్చిందట. ఐఎస్ఎస్ శీతల వ్యవస్థకు చెందిన ఓ గొట్టం పక్కకు జరగడంతో దానిని తిరిగి సరిచేసేందుకని అక్టోబరు 7న నాసా, ఈసా వ్యోమగాములు రీడ్ వీజ్మాన్, అలెగ్జాండర్ గెరెస్ట్ ఆరున్నర గంటల సేపు స్పేస్‌వాక్ చేశారు. అయితే వీరు మరమ్మతు చేస్తున్నప్పుడు తీసిన వీడియోలో... ఐఎస్ఎస్కు, భూమికి మధ్య ఓ గుర్తు తెలియని ఎగిరే వస్తువు ప్రత్యక్షమైందట. ఐదు సెకన్లపాటు మెరిసి మాయమైపోయిన ఆ వస్తువు ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. నాసా యూట్యూబ్ చానెల్లో పెట్టిన వీడియోలో ఈ యూఎఫ్‌వో దృశ్యం కనపడిందని మీడియా పేర్కొంది. కానీ ఆ మెరిసే వస్తువు ఏమిటన్న దానిపై నాసా మాత్రం ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. -
అడవులకు 3డీ రూపం!
రోదసిలో సంచార ప్రయోగశాల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) ఇక భూమిపై అడవులను 3డీ రూపంలో కూడా బంధించనుంది. ఇందుకుగాను అడవులను త్రీడీ రూపంలో ఫొటోలు తీసే అధునాతన లేజర్ పరికరాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అభివృద్ధిపరుస్తోంది. ‘గ్లోబల్ ఎకోసిస్టమ్ డైనమిక్స్ ఇన్వెస్టిగేషన్(ప్రపంచ ఆవరణ వ్యవస్థ, గతిశాస్త్ర అధ్యయనం-గెడీ) లైడర్’ అనే ఈ పరికరం తొలిసారిగా అంతరిక్షం నుంచి అడవుల నిలువెత్తు రూపాన్ని చూసేందుకు ఉపయోగపడనుంది. రోదసి నుంచి లేజర్‌ను ప్రయోగించడం ద్వారా ఇది దట్టమైన అడవులను సైతం కచ్చితమైన కొలతలతో కొలుస్తుంది. దీని సమాచారం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా అడవుల తరుగుదలను, వాతావరణ మార్పుపై ఆ మేరకు పడే ప్రభావాన్ని అంచనా వేయొచ్చు. తద్వారా వాతావరణ మార్పు ప్రభావం నుంచి ఉపశమనానికి తగిన చర్యలు తీసుకోవచ్చు. వాతావరణంలోని కార్బన్ భూమిపై వృక్షజాతుల్లో ఎంతమేరకు నిక్షిప్తం అవుతోందన్న విషయం కూడా గెడీ ఇచ్చే సమాచారంతో తెలుసుకోవచ్చట. భూమిపై ఎన్ని చెట్లను నరికేస్తే ఎంత కార్బన్ వాతావరణంలోకి విడుదలవుతుంది? ఎన్ని చెట్లను నాటితే ఎంత కార్బన్‌ను నిక్షిప్తం చేయవచ్చు? అన్నదీ అంచనా వేయొచ్చట. గెడీని 2018లో ఐఎస్ఎస్కు పంపేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది.