ఎడారిపై ఉషోదయ సమయాన...
ఆఫ్రికాలోని సహారా ఎడారి వద్ద ఓ వైపు పట్టపగలు.. మరోవైపు అప్పుడే చీకట్లు తొలగుతున్న సుందర దృశ్యమిది. సహారా ఎడారిలో భాగంగా, దాని మధ్యలో ఉన్న ముర్జక్ ఎడారిపై ఉదయ భానుడి లేత కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) నుంచి నాసా వ్యోమగామి ఇటీవల ఈ ఫొటో తీశారు.
చిత్రంలో కుడివైపు పైన తెల్లగా కనిపిస్తున్న చోట పూర్తిగా తెల్లవారిపోగా.. ముర్జక్ ఎడారి(కిందివైపు మధ్యలో)పై అప్పుడప్పుడే చీకట్లు తొలగుతున్నాయి. సహారా ఎడారిపై చాలాసార్లు మేఘాలు ఎక్కువగా ఆవరించి ఉండకపోవడం వల్ల అంతరిక్షం నుంచి తరచూ ఇలాంటి అందమైన దృశ్యాలు కనువిందు చేస్తాయట. అన్నట్టూ.. ఫొటోలో ముర్జక్ ఎడారి చిన్నగానే కనిపిస్తున్నా.. 300 కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉందట.