అడవులకు 3డీ రూపం!
రోదసిలో సంచార ప్రయోగశాల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) ఇక భూమిపై అడవులను 3డీ రూపంలో కూడా బంధించనుంది. ఇందుకుగాను అడవులను త్రీడీ రూపంలో ఫొటోలు తీసే అధునాతన లేజర్ పరికరాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అభివృద్ధిపరుస్తోంది. ‘గ్లోబల్ ఎకోసిస్టమ్ డైనమిక్స్ ఇన్‌వెస్టిగేషన్(ప్రపంచ ఆవరణ వ్యవస్థ, గతిశాస్త్ర అధ్యయనం-గెడీ) లైడర్’ అనే ఈ పరికరం తొలిసారిగా అంతరిక్షం నుంచి అడవుల నిలువెత్తు రూపాన్ని చూసేందుకు ఉపయోగపడనుంది. రోదసి నుంచి లేజర్‌ను ప్రయోగించడం ద్వారా ఇది దట్టమైన అడవులను సైతం కచ్చితమైన కొలతలతో కొలుస్తుంది. దీని సమాచారం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా అడవుల తరుగుదలను, వాతావరణ మార్పుపై ఆ మేరకు పడే ప్రభావాన్ని అంచనా వేయొచ్చు.
తద్వారా వాతావరణ మార్పు ప్రభావం నుంచి ఉపశమనానికి తగిన చర్యలు తీసుకోవచ్చు. వాతావరణంలోని కార్బన్ భూమిపై వృక్షజాతుల్లో ఎంతమేరకు నిక్షిప్తం అవుతోందన్న విషయం కూడా గెడీ ఇచ్చే సమాచారంతో తెలుసుకోవచ్చట. భూమిపై ఎన్ని చెట్లను నరికేస్తే ఎంత కార్బన్ వాతావరణంలోకి విడుదలవుతుంది? ఎన్ని చెట్లను నాటితే ఎంత కార్బన్‌ను నిక్షిప్తం చేయవచ్చు? అన్నదీ అంచనా వేయొచ్చట. గెడీని 2018లో ఐఎస్‌ఎస్‌కు పంపేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది.