ఐఎస్‌ఎస్‌కు సమీపంలో యూఎఫ్‌వో!?
భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) సమీపంలోకి ఇటీవల ఓ గుర్తుతెలియని ఎగిరే వస్తువు(యూఎఫ్‌వో) వచ్చిందట. ఐఎస్‌ఎస్ శీతల వ్యవస్థకు చెందిన ఓ గొట్టం పక్కకు జరగడంతో దానిని తిరిగి సరిచేసేందుకని అక్టోబరు 7న నాసా, ఈసా వ్యోమగాములు రీడ్ వీజ్‌మాన్, అలెగ్జాండర్ గెరెస్ట్ ఆరున్నర గంటల సేపు స్పేస్‌వాక్ చేశారు.
అయితే వీరు మరమ్మతు చేస్తున్నప్పుడు తీసిన వీడియోలో... ఐఎస్‌ఎస్‌కు, భూమికి మధ్య ఓ గుర్తు తెలియని ఎగిరే వస్తువు ప్రత్యక్షమైందట. ఐదు సెకన్లపాటు మెరిసి మాయమైపోయిన ఆ వస్తువు ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. నాసా యూట్యూబ్ చానెల్‌లో పెట్టిన వీడియోలో ఈ యూఎఫ్‌వో దృశ్యం కనపడిందని మీడియా పేర్కొంది. కానీ ఆ మెరిసే వస్తువు ఏమిటన్న దానిపై నాసా మాత్రం ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు.