కేంద్ర నిధుల బాధ్యత మీదే
మంత్రులకు స్పష్టం చేసిన సీఎం
మంత్రుల పనితీరుపై ఆగ్రహం
స్వైన్‌ఫ్లూపై ఎందుకు స్పందించడంలేదని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టే బాధ్యతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రులపై ఉంచారు. రాష్ర్టంలో నిధుల కొరత, ఇతర అంశాలపై సోమవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు తాను ఒక్కడినే పదిమార్లు ప్రధాన మంత్రి చుట్టూ తిరిగాను కాబట్టి నిధులు వస్తాయనే భరోసాతో ఉండొద్దని మంత్రులకు చెప్పారు.
మంత్రులు వారి శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను ఢిల్లీకి పంపి నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే కేంద్ర మంత్రులను కలిసి నిధులు వచ్చేలా చూడాలని అన్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేశారని, ప్రణాళికా సంఘం వద్ద పెండింగ్‌లో ఉన్న నిధులను రాబట్టాలని చెప్పారు. మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు మినహా మిగతా వారు శాఖలపై పట్టు సాధించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొందరే వారి శాఖలపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారని, మిగిలిన వారు పట్టించుకోవటంలేదన్నారు. వారి శాఖల్లో జరుగుతున్న ప్రగతిని ఐప్యాడ్ ద్వారా వివరించమని సీఎం కోరగా కొద్దిమందే స్పందించారు. దీంతో.. మంత్రులు రెండు రోజుల్లో సంబంధిత శాఖల అధికారులతో జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సీఎం చెప్పారు. సొంత జిల్లాలకే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో పర్యటించాలని, ప్రతి శనివారం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని స్పష్టంచేశారు.
రాష్ర్టంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోందని పత్రికలు, ప్రసార సాధనాల్లో వార్తలు వస్తున్నా ఎందుకు స్పందించలేదని మంత్రులను ప్రశ్నించారు. తాను దావోస్‌లో ఉన్న సమయంలో కేర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సోమరాజు ఫోన్ చేసి రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి గురించి చెప్పారని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారని, తనను కూడా వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలని సూచించారని చెప్పారు. ఒక ప్రైవేటు వైద్యుడు తనను అప్రమత్తం చేశారని, అదే పనిని సంబంధిత శాఖ మంత్రి, అధికారులు ఎందుకు చేయలేదన్నారు.
ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు
విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్‌లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. స్థానిక దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో ఎయిర్కోస్టా 79వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత పోటీలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఐరిస్ ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
ట్రాఫిక్‌లో చిక్కుకున్న సీఎం కాన్వాయ్7
విజయవాడ, గుంటూరు జిల్లా పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా బాబు కాన్వాయ్ సోమవారం రాత్రి కనకదుర్గమ్మ వారధిపై 10నిమిషాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.
చేనేత రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆప్కోలోని చేనేత వస్త్రాల నిల్వలను 20 శాతం రిబేట్‌పై రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికిగాను రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఖర్చుకానుందన్నారు. ఈ మేరకు మంగళగిరిలో సోమవారం ఓ కళాశాల ఆవరణలో జరిగిన చేనేత చైతన్య సదస్సులో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో 6.50 లక్షల కుటుంబాలు చేనేతపై ఆధారపడ్డాయని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు రూ.165 కోట్ల మేరకు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేస్తామని, కార్మికులెవరూ రుణాలు చెల్లించొద్దని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా నూలుపై 20 శాతం సుంకాన్ని తగ్గించనున్నామని, దీనిలో 10 శాతం కార్మికునికి, 10 శాతం సంఘాలకు అందజేస్తామన్నారు. చేనేత కార్మికులకు షెడ్, ఇల్లు, ఆరోగ్య బీమా కల్పించి, 50 ఏళ్లు నిండిన కార్మికులకు పింఛన్లు ఇస్తామన్నారు.