International team of scientists
-
హిమగర్భంలో భారీ ఉల్క
న్యూఢిల్లీ: అంటార్కిటికాలో దట్టమైన మంచు గర్భంలో 7.6 కిలోల బరువైన ఉల్కను అంతర్జాతీయ సైంటిస్టుల బృందం వెలికితీసింది. మంచు ఖండంలో ఇంతటి భారీ ఉల్క దొరకడం అత్యంత అరుదైన విషయమని పేర్కొంది. గత డిసెంబర్ 11 నుంచి నెల రోజుల పాటు జరిపిన అన్వేషణలో మరిన్ని చిన్న సైజు ఉల్కలు కూడా దొరికాయి. శాటిలైట్ ఇమేజీలు, జీపీఎస్ సాయంతో వీటి జాడను కనిపెట్టారు. ‘‘ఇవి బహుశా ఏదో ఆస్టిరాయిడ్ నుంచి రాలి పడి ఉంటాయి. వేలాది ఏళ్లుగా మంచు గర్భంలో ఉండిపోయాయి. వీటిని పరిశోధన నిమిత్తం బ్రెసెల్స్కు పంపాం. అందులో భూమి ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. -
మార్మిక వృత్తాల గుట్టు వీడింది
వాషింగ్టన్: అంతరిక్షంలో సుదూరాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమనే మార్మిక వృత్తాల గుట్టును భారత జెయింట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ) తాజాగా ఛేదించింది. భారత్తో పాటు పలు ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ సైంటిస్టుల బృందం జీఎంఆర్టీ సాయంతో వీటిపై లోతుగా పరిశోధనలు చేసింది. ఆడ్ రేడియో సర్కిల్స్ (ఓఆర్సీ)గా పిలిచే ఇవి థర్మో న్యూక్లియర్ సూపర్నోవా తాలూకు అవశేషాలు అయ్యుంటాయని అత్యంత శక్తిమంతమైన రేడియో టెలిస్కోప్ల సాయంతో తేల్చింది. విశ్వంలో సంభవించే అతి పెద్ద పేలుళ్లను సూపర్నోవాగా పిలుస్తారన్నది తెలిసిందే. ఈ ఓఆర్సీల నుంచి నిరంతరం భారీగా రేడియో ధార్మికత వెలువడుతూ ఉంటుంది. వీటిలో కొన్ని ఏకంగా 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయంటారు. అంతేగాక అసంఖ్యాక గ్రహాలకు నిలయమైన మన పాలపుంత కంటే కూడా 10 రెట్లు పెద్దవట! ఈ పరిశోధనకు నైనిటాల్లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ఏఆర్ఐఈఎస్) సైంటిస్టు డాక్టర్ అమితేశ్ ఒమర్ సారథ్యం వహించారు. పాలపుంతల్లో ఏదైనా తార అతి భారీ కృష్ణబిలాల సమీపానికి వెళ్లినప్పుడు దాని అనంతమైన ఆకర్షణశక్తి ప్రవాహాల ధాటికి ముక్కచెక్కలుగా విచ్ఛిన్నమై నశిస్తుంది. ఆ క్రమంలో దాని తాలూకు సగం శక్తిని ఊహాతీత వేగంతో కృష్ణబిలం సుదూరాలకు చిమ్ముతుంది. దాంతో సూపర్నోవా పేలుడును తలపిస్తూ భారీ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. హఠాత్తుగా పుట్టుకొచ్చే ఈ శక్తే భారీ వలయాల రూపంలో కనువిందు చేస్తుంటుందని పరిశోధన తేల్చింది. ఇది రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ జర్నల్లో పబ్లిషైంది. -
మూడు భూమిలాంటి గ్రహాలు
పారిస్: భూమి వంటి జీవం ఉన్న మూడు గ్రహాలను కనుగొన్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. మన సౌర వ్యవస్థకు ఆవల ఉన్న ఇవి ఆవాసయోగ్యంగా ఉన్నాయంది. 39 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాలు పరిమాణంలో, ఉష్ణోగ్రతలో భూమి, శుక్ర గ్రహాలతో సమానంగా ఉన్నట్లు పేర్కొంది. సౌర వ్యవస్థకు బయట జీవానికి సంబంధించిన రసాయన ఆనవాళ్లను కనుగొనేందుకు ఇది తొలి అవకాశమని బెల్జియంలోని లీగె వర్సిటీకి చెందిన వ్యోమభౌతిక శాస్తవేత్త మైకేల్ గిల్లాన్ చెప్పారు. భూగ్రహానికి సమీపంలో ఉన్నందున అక్కడి వాతావరణాన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతోనే పరిశీలించే అవకాశముందన్నారు.