మార్మిక వృత్తాల గుట్టు వీడింది | Indian telescope reveals the secret of mysterious circles in space | Sakshi
Sakshi News home page

మార్మిక వృత్తాల గుట్టు వీడింది

Published Sun, Dec 18 2022 5:06 AM | Last Updated on Sun, Dec 18 2022 5:06 AM

Indian telescope reveals the secret of mysterious circles in space - Sakshi

వాషింగ్టన్‌: అంతరిక్షంలో సుదూరాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమనే మార్మిక వృత్తాల గుట్టును భారత జెయింట్‌ మీటర్‌వేవ్‌ రేడియో టెలిస్కోప్‌ (జీఎంఆర్‌టీ) తాజాగా ఛేదించింది. భారత్‌తో పాటు పలు ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ సైంటిస్టుల బృందం జీఎంఆర్‌టీ సాయంతో వీటిపై లోతుగా పరిశోధనలు చేసింది. ఆడ్‌ రేడియో సర్కిల్స్‌ (ఓఆర్‌సీ)గా పిలిచే ఇవి థర్మో న్యూక్లియర్‌ సూపర్‌నోవా తాలూకు అవశేషాలు అయ్యుంటాయని అత్యంత శక్తిమంతమైన రేడియో టెలిస్కోప్‌ల సాయంతో తేల్చింది.

విశ్వంలో సంభవించే అతి పెద్ద పేలుళ్లను సూపర్‌నోవాగా పిలుస్తారన్నది తెలిసిందే. ఈ ఓఆర్‌సీల నుంచి నిరంతరం భారీగా రేడియో ధార్మికత వెలువడుతూ ఉంటుంది. వీటిలో కొన్ని ఏకంగా 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయంటారు. అంతేగాక అసంఖ్యాక గ్రహాలకు నిలయమైన మన పాలపుంత కంటే కూడా 10 రెట్లు పెద్దవట! ఈ పరిశోధనకు నైనిటాల్‌లోని ఆర్యభట్ట రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్‌ (ఏఆర్‌ఐఈఎస్‌) సైంటిస్టు డాక్టర్‌ అమితేశ్‌ ఒమర్‌ సారథ్యం వహించారు.

పాలపుంతల్లో ఏదైనా తార అతి భారీ కృష్ణబిలాల సమీపానికి వెళ్లినప్పుడు దాని అనంతమైన ఆకర్షణశక్తి ప్రవాహాల ధాటికి ముక్కచెక్కలుగా విచ్ఛిన్నమై నశిస్తుంది. ఆ క్రమంలో దాని తాలూకు సగం శక్తిని ఊహాతీత వేగంతో కృష్ణబిలం సుదూరాలకు చిమ్ముతుంది. దాంతో సూపర్‌నోవా పేలుడును తలపిస్తూ భారీ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. హఠాత్తుగా పుట్టుకొచ్చే ఈ శక్తే భారీ వలయాల రూపంలో కనువిందు చేస్తుంటుందని పరిశోధన తేల్చింది. ఇది రాయల్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ జర్నల్‌లో పబ్లిషైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement