radio telescope
-
పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల గుట్టు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళ రహస్యాలను తేల్చే పరిశోధనలో భాగంగా.. పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల ఆధారాలను కనుగొన్న బృందంలో హైదరాబాద్ ఐఐటీ పరిశోదకులూ భాగస్వాములయ్యారు. ‘ఇండియన్ పల్సర్ టైమింగ్ అర్రే (ఐఎన్పీటీఏ)’తోపాటు జపాన్, యూరప్ దేశాల అంతరిక్ష శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారని ఐఐటీ హైదరాబాద్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచంలోని ఆరు అత్యాధునిక రేడియో టెలిస్కోప్‌లను ఉపయోగించి ఖగోళాన్ని పరిశీలించామని.. పాలపుంతలో అతి తక్కువ పౌనఃపున్యం ఉన్న గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నామని తెలిపింది. ఈ వివరాలు ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయని పేర్కొంది. ఐఐటీ హైదరాబాద్ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్ శంతన్దేశాయ్, అమన్ శ్రీవాత్సవ, ఫిజిక్స్ పీహెచ్డీ విద్యార్థి దివ్యనాశ్ కర్బందా, బీటెక్ విద్యార్థులు శ్వేత అర్ముగం, ప్రజ్ఞ మాండిపాక తదితరులు పరిశోధన బృందంలో ఉన్నారని వివరించింది. -
అంతరిక్షంలో నేపథ్య గానం!
పారిస్: అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తున్న శబ్దాలకు సంబంధించిన విశేషాలను ఖగోళ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. గురుత్వాకర్షణ తరంగాల నుంచి ఉద్భవిస్తున్న ధ్వనులపై ఒక ప్రకటన చేశారు. అంతరిక్షంలో వినిపిస్తున్న శబ్దాలకు సంబంధించిన నేపథ్య(బ్యాక్‌గ్రౌండ్) స్వరాలను గుర్తుపట్టినట్లు తెలియజేశారు. ఈ ప్రయోగంలో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు సైతం కీలక పాత్ర పోషించడం విశేషం. పుణెలో ఉన్న రేడియో టెలిస్కోప్‌కు ఆ ధ్వని తరంగాలు చిక్కాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ డేటాను సేకరిస్తున్నారు. అంతరిక్షంలోని సుదూర ప్రాంతాల నుంచి ఆ లయబద్ధమైన శబ్దాలు(హమ్మింగ్) వస్తున్నట్లు తేల్చారు. నార్త్ అమెరికన్ నానోహెట్జ్ అబ్జర్వేటరీ ఫర్ గ్రావిటేషన్ వేవ్స్ బృందం ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇండియా, కెనడా, యూరప్, చైనా, ఆ్రస్టేలియా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. పల్సర్స్ అనే మండిన నక్షత్రాల నుంచి గురుత్వాకర్షణ తరంగాలు వస్తున్నట్లు గుర్తించారు. ఇవి శక్తివంతమైన గురుత్వాకర్షణ శబ్దాలను సృష్టిస్తున్నట్లు తేల్చారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ తరంగాల నుంచి శబ్దాలు వెలువడుతున్నట్లు శతాబ్దం క్రితమే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వెల్లడించారు. -
మార్మిక వృత్తాల గుట్టు వీడింది
వాషింగ్టన్: అంతరిక్షంలో సుదూరాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమనే మార్మిక వృత్తాల గుట్టును భారత జెయింట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ) తాజాగా ఛేదించింది. భారత్‌తో పాటు పలు ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ సైంటిస్టుల బృందం జీఎంఆర్టీ సాయంతో వీటిపై లోతుగా పరిశోధనలు చేసింది. ఆడ్ రేడియో సర్కిల్స్ (ఓఆర్సీ)గా పిలిచే ఇవి థర్మో న్యూక్లియర్ సూపర్నోవా తాలూకు అవశేషాలు అయ్యుంటాయని అత్యంత శక్తిమంతమైన రేడియో టెలిస్కోప్‌ల సాయంతో తేల్చింది. విశ్వంలో సంభవించే అతి పెద్ద పేలుళ్లను సూపర్నోవాగా పిలుస్తారన్నది తెలిసిందే. ఈ ఓఆర్సీల నుంచి నిరంతరం భారీగా రేడియో ధార్మికత వెలువడుతూ ఉంటుంది. వీటిలో కొన్ని ఏకంగా 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయంటారు. అంతేగాక అసంఖ్యాక గ్రహాలకు నిలయమైన మన పాలపుంత కంటే కూడా 10 రెట్లు పెద్దవట! ఈ పరిశోధనకు నైనిటాల్‌లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ఏఆర్ఐఈఎస్) సైంటిస్టు డాక్టర్ అమితేశ్ ఒమర్ సారథ్యం వహించారు. పాలపుంతల్లో ఏదైనా తార అతి భారీ కృష్ణబిలాల సమీపానికి వెళ్లినప్పుడు దాని అనంతమైన ఆకర్షణశక్తి ప్రవాహాల ధాటికి ముక్కచెక్కలుగా విచ్ఛిన్నమై నశిస్తుంది. ఆ క్రమంలో దాని తాలూకు సగం శక్తిని ఊహాతీత వేగంతో కృష్ణబిలం సుదూరాలకు చిమ్ముతుంది. దాంతో సూపర్నోవా పేలుడును తలపిస్తూ భారీ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. హఠాత్తుగా పుట్టుకొచ్చే ఈ శక్తే భారీ వలయాల రూపంలో కనువిందు చేస్తుంటుందని పరిశోధన తేల్చింది. ఇది రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ జర్నల్‌లో పబ్లిషైంది. -
నక్షత్రాల అవిర్భావం గుట్టు విప్పిన భారత టెలిస్కోప్!
న్యూఢిల్లీ: బిగ్‌బ్యాంగ్ తర్వాత 20 కోట్ల ఏళ్లకు ఏర్పడ్డ తొలి నక్షత్రాల రహస్యాలను భారత టెలిస్కోప్ బహిర్గతం చేసింది. బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ)లో డిజైన్ చేసి, నిర్మించిన సరస్–3 రేడియో టెలిస్కోప్‌తో నక్షత్రాల గుట్టును బయట పెట్టారు. 2020 మార్చిలో కర్ణాటకలోని దండిగనహళ్లి చెరువు వద్ద, కొంతకాలం శరావతి బ్యాంక్ వాటర్స్ వద్ద ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకొనేందుకు ఆర్ఆర్ఐతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ టెల్ అవివ్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. సరస్–3 టెలిస్కోప్ డేటాను ఇటవలే విశ్లేషించారు. బిగ్‌బ్యాంగ్ అనంతరం తొలుత ఏర్పడిన నక్షత్ర మండలాల్లోని 3 కంటే తక్కువ శాతం వాయువులు నక్షత్రాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని ఆర్ఆర్ఐ ప్రతినిధి సౌరభ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన సరస్–3 రేడియో టెలిస్కోప్ కాస్మిక్ డాన్ ఆస్ట్రోఫిజిక్స్‌పై అవగాహన మరింత పెంచుకొనేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. బిగ్‌బ్యాంగ్ అనంతర కాలాన్ని కాస్మిక్ డాన్‌గా వ్యవహరిస్తారు. అప్పటి గెలాక్సీల్లో అత్యధిక సాంద్రత కలిగిన కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉండేవి. -
అసలైన ఏలియన్స్ అన్వేషణ మొదలైంది!
బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ తన పని ప్రారంభించింది. నైరుతి చైనా గిజూ ప్రావిన్స్‌లోని పర్వతప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఈ టెలిస్కోప్ ఆదివారం మధ్యాహ్నం నుంచి పనిని ప్రారంభించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. విశ్వంలో జీవం కోసం మానవులు సాగిస్తున్న అన్వేషణను ఈ రేడియో టెలిస్కోప్ మరింత ప్రభావవంతంగా చేపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ద ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్(ఎఫ్ఏఎస్టీ) పేరుతో నిర్మితమైన దీని కోసం చైనా 1.2 బిలియన్ యువాన్లను ఖర్చుచేసింది. ఇప్పటివరకూ ప్రపంచంలో పెద్ద టెలిస్కోప్‌గా పేరున్న ప్యూర్టోరికో లోని అరెసిబో టెలిస్కోప్‌ను ఎఫ్ఏఎస్టీ ద్వితీయ స్థానంలోకి నెట్టేసింది. 30 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉంటుందంటే ఎఫ్ఏఎస్టీ ఎంత భారీ టెలీస్కోపో అర్థం చేసుకోవచ్చు. చైనా తన అభివృద్ధిని చాటుకునేలా సైనిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అంతరిక్ష రంగంలోనూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 2020 నాటికి శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసుకునే దిశగా చైనా అడుగులేస్తోంది. ఎఫ్ఏఎస్టీ నిర్మాణాన్ని 2011లో చైనా ప్రారంభించింది. టెలిస్కొప్ వ్యవహారాలను సక్రమంగా నిర్వహించేందుకు గాను ఆ ప్రాంతంలో 5 కిమీ పరిధిలో ఉన్న సుమారు 10 వేల మందిని స్థానిక ప్రభుత్వం ఖాళీ చేయించింది.