పొరుగు రాష్ట్రాలతో మరింత సఖ్యత
చర్చలతో జలవివాదాల పరిష్కారానికి టీ సర్కార్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై పొరుగు రాష్ట్రాలతో మరింత సఖ్యతతో మెలగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వివాదం నెలకొన్న ప్రాజెక్టుల పరిధిలో సర్దుబాటు ధోరణితో వ్యవహరించి, భవిష్యత్ బంధాలు పటిష్టం చేసుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా నీటి విడుదల విషయంలో ఏపీతో తలెత్తిన వివాదంతోపాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో జరిపిన చర్చలు ఫలప్రదమైన నేపథ్యంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు విషయంలో ఛత్తీస్‌గఢ్‌తోనూ, పాలమూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టుల విషయంలో కర్ణాటకతోనూ చర్చించి సయోధ్య చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఏపీ, తెలంగాణ జల జగడం కొలిక్కి..: తెలంగాణ, ఏపీల మధ్య 3 నెలలుగా నలిగిన కృష్ణా నదీ జలాల వివాదం ఇటీవల చర్చల ద్వారానే కొలిక్కి వచ్చింది. వాస్తవ వాటాలను మించి అదనంగా 43 టీఎంసీల మేర నీటిని ఏపీ వినియోగించుకున్నప్పటికీ భవిష్యత్తులో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలనే ఉద్దేశంతో కృష్ణాలోని 63 టీఎంసీల లభ్యత నీటిని అవసరాల మేరకు పంచుకునేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించడం తెలిసిందే. అలాగే ప్రాణహిత-చేవెళ్ల, లెండి, పెన్‌గంగల విషయంలో మహారాష్ట్రతోనూ సర్కారు ఇదే ధోరణితో వ్యవహరించింది. ప్రాణహిత బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూ ప్రాంతానికి ఆ రాష్ట్ర చట్టాలకు లోబడి నష్టపరిహారం చెల్లించడంతోపాటు పెన్‌గంగ విషయంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు కట్టుబడి పనులను ముందుకు తీసుకెళ్లే తదితర అంశాలపై జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి.
త్వరలోనే కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లతో చర్చలు: ఇచ్చంపల్లిపై ఇప్పటికే మహారాష్ట్రతో చర్చలు ప్రారంభించిన రాష్ట్రం త్వరలోనే దీనిపై ఛత్తీస్‌గఢ్‌తోనూ చర్చలు జరుపాలనే నిర్ణయానికి వచ్చింది. గతంలో జరిగిన ఒప్పందాలు, ఉన్నత స్థాయి కమిటీ, కేంద్ర జల సంఘం సూచన మేరకు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఎత్తును 112.77 మీటర్ల నుంచి 95 మీటర్లకు తగ్గించుకునేందుకు సమ్మతిస్తున్నందున ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలంటూ ఛత్తీస్‌గఢ్‌ను కోరాలని రాష్ట్రం నిశ్చయించింది. ఆల్మట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీరు: తుంగభద్ర నది నుంచి రాజోలిండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ద్వారా మహబూబ్‌నగర్‌కు సాగునీరు అందించే కాల్వల మరమ్మతు పనులు వేగిరం చేయడం, జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు ఆల్మట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలపై కర్ణాటకతో సంప్రదింపులు జరపాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది.