న్యూఢిల్లీ/వాషింగ్టన్: అంతర్జాతీయ జలాల పరిధి విషయంలో భారత వాదనను సవాలు చేస్తూ, భారతదేశం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే, ఈ వారం లక్షద్వీప్ సమీపంలోని భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్(ఎఫ్‌ఓఎన్‌ఓపీ)’ను నిర్వహించామని అమెరికా ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. సముద్ర జలాల విషయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లం ఘించడం సరికాదని యూఎస్‌కు స్పష్టం చేసింది.
దేశాల ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలు(ఈఈజెడ్), కాంటినెంటల్ జోన్‌ల పరిధిలో ఇతర దేశాలు.. అనుమతి లేకుండా కార్యకలాపాలు చేపట్టడం, ముఖ్యంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు వినియోగించడం ‘యూఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ’కి వ్యతిరేకమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ‘క్షిపణి విధ్వంసక నౌక ‘జాన్ పాల్ జోన్స్ భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్’లో పాల్గొంది. తద్వారా ఆ జలాల పరిధిపై భారత దేశం పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశాం. ఎఫ్‌ఓఎన్‌ఓపీ ద్వారా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన సముద్ర జలాల్లో నేవిగేషన్‌కు ఉన్న స్వేచ్చను, హక్కులను, చట్టబద్ధ వినియోగాన్ని నిర్ధారించాం’ అని అమెరికా నౌకాదళానికి చెందిన 7వ ఫ్లీట్ ఏప్రిల్ 7న ప్రకటించింది.
సముద్ర జలాల పరిధిపై భారత వాదనను సవాలు చేస్తూ, అంతర్జాతీయ నిబంధనల మేరకు లక్షద్వీప్‌కు పశ్చిమంగా 130 నాటికల్ మైళ్ల దూరంలో, భారత ఈఈజెడ్ పరిధిలో ఎఫ్‌ఓఎన్‌ఓపీ నిర్వహించామని పేర్కొంది. దీనిపై అమెరికాకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పర్షియన్ గల్ఫ్ నుంచి మలక్కా సంధి వరకు అమెరికా నౌక ఆపరేషన్స్ జరిపింది. ఈ విషయంపై భారత అభ్యంతరాలను అమెరికా ప్రభుత్వానికి దౌత్య మార్గాల ద్వారా వెల్లడించాం’ అని శుక్రవారం భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయ ఈఈజెడ్ పరిధిలో ఇతర దేశాలు మిలటరీ ఆపరేషన్లు నిర్వహించాలంటే తమ అనుమతి తప్పనిసరి అన్న భారత వాదనను అమెరికా కొట్టివేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment