Intesive household survey
-
ఇంట్లో లేకుంటే వివరాలు ఉంచి వెళ్లండి
హైదరాబాద్ : తప్పని పరిస్థితుల్లో విధులకు హాజరు కావాల్సిన ఉద్యోగులు... సమగ్ర సర్వే రోజున కంపెనీ ఇచ్చిన లెటర్‌తో పాటు కంపెనీ ఐడీ కార్డు ఇంట్లోనే ఉంచి వెళ్లాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ మంగళవారం తెలిపారు. సొంతూరు ఏదైనా హైదరాబాద్‌లోనే ఉండాలని అనుకున్నవాళ్లు ఇక్కడి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సమగ్ర సర్వేకు వచ్చేవారు సర్వే ముందు రోజే ప్రతి ఇంటికి వచ్చి జీహెచ్ఎంసీ స్టిక్కర్ అంటిస్తారని, ఒకవేళ ఆ స్టిక్కర్ కనుక అంటించి ఉండకపోతే జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చిన సోమేష్ కుమార్ తెలిపారు. ఆగస్ట్ 19న తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం సమగ్ర సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. -
ప్రజలు దొంగల్లా కనబడుతున్నారా?
రాయికల్ : తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పుడు ఆ ప్రజలు దొంగల్లా కనబడుతున్నారా? అని కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సర్వే రోజన పెళ్లిళ్లు సైతం రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఇంట్లో ఎవరో ఒకరు ఉండి సమగ్ర సర్వేను అధికారులతో చేపట్టాలే గానీ, కుటుంబంలోని ప్రతీ ఒక్కరు ఇంట్లో ఉండాలని, వంటగది, టీవీలను తనిఖీ చేస్తామని ఆదేశించడం సబబు కాదన్నారు. మైనార్టీల ఇళ్లల్లోకి వెళ్లి తనిఖీ చేయడం ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని సీఎం మరిచిపోయారా అని ప్రశ్నించారు. దినసరి కూలీలు పని చేస్తేనే వారి కుటుంబం గడుస్తుందని, తెలంగాణ ప్రజలను దొంగల్లా చిత్రీకరించకుండా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.